Wednesday, December 30, 2009

సీతాదేవి

సీతాదేవి 18 సంవత్సరముల వయస్సులో రామునితో వనవాసమునకు వెళ్ళెను. పంచవటిలో 3 సంవత్సరములు పది సంవత్సరములు రామునితో కలసియే ఉన్నది. అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిని కోల్పోయినది. యుద్ధానంతరము అయోధ్యకి వచ్చినను సంవత్సరము తిరగక ముందే మరల స్వామి సన్నిధికి దూరమైనది. చివరకు భూప్రవేశముతో స్వామికి శాశ్వతముగ దూరమైనది. ఇంత భక్తి ప్రేమ కలిగిన సీత స్వామికి ఏల దూరము కావలసివచ్చినది. ఆమె మహా పతివ్రత. ఇచ్చట పతి శబ్ధము స్వామిని చెప్పును. ఆమె విషయములో స్వామియు భర్తయు ఒక్కరే. దీనికి కారణము అగు కర్మ లేకుండా ఫలము సంభవించదు. ఆమె కొన్ని భగవదపచారములను చేసినది. కాని స్వామి వాటిని లెక్కించలేదు. అవియేమనగా

అరణ్య వాసమునకు పోవునపుడు సీతను అయోధ్యలోనే ఉండమన్నాడు స్వామి. ఇదే ఆజ్ఞను స్వామి మధురకు పోవుచు రాధకు ఇచ్చినాడు. రాధ స్వామి ఆజ్ఞను పాటించి బృందావనములోనే ఉండిపోయినది. కాని సీత స్వామి ఆజ్ఞను పాటించక వెంటపడినది. అప్పుడు ఆవేశములో స్వామిని నిందించినది కూడ. స్వామిని "స్త్రియం పురుష విగ్రహమ్‌" అనగా నీవు నన్ను అడవిలో రక్షించలేవా నీవు పురుషుడవేనా? నా తండ్రి జనకుడు పురుష వేషములో యున్న ఒక స్త్రీకి నను ఇచ్చి చేసినాడని దూషించినది. దీనికి కూడ స్వామి కోపగించలేదు. ఏలననగా ఆయన స్తోత్రము నుండియును నింద నుండియును సమాన ఆనందము పొందును. ఇదే గీతలో "తుల్య నిందా స్తుతిః" అని చెప్పబడినది. పాయసము ఆనందమును కల్గించినట్లు ఆవకాయ అన్నము కూడా ఆనందము కల్గించును. కాన సుఖదుఃఖము మానవమానములు రెండు ఆనందకరములే. స్వామి విషయములో ఇంకనూ విశేషమేమనగా స్తోత్రము కంటే నిందకే విశేషముగా ఆనందించును. ఏలననగా? ఆయన స్వస్వరూపములో యున్నపుడు దేవతలు ఋషులు నిరంతరము స్తుతించెదరు. కనుక స్తోత్రములతో వెగటు పుట్టి నిందలకే వాచిపోయినట్లుండెను. అందుకే ఆయన నరావతారము దాల్చి ఎవరైన తనను నిందించినపుడు పరమానందము చెందుచుండును. కాని ఆయన భాగవతాపచారమును సహించడు. భాగవతుడు అనగా భక్తుడగు జీవుడు. జీవుడు అవమానమునకు దుఃఖపడును. ఆదిశేషుడు పరమ భాగవతోత్తముడు. లక్ష్మీదేవి కేవలము పాదస్పర్శయే నిరంతరము అనుగ్రహించినాడు. ఆదిశేషునకు ఆ పాదమస్తక స్పర్శను శయనించి అనుగ్రహించినాడు. ఆ ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించి రాముని వెంట నిరంతరము ఉండినాడు. రాముని విడచి భరత శతృఘ్నులు మేనమామ ఇంటికి పోయినారే గాని లక్ష్మణుడు పోలేదు. సీత లంకలో ఉండినప్పుడు కూడ లక్ష్మణుడు రామునితో ఉన్నాడు. మరల సీతను అడవులకు పంపినను లక్ష్మణుడు రామునితోనే ఉన్నాడు. లక్ష్మణుడు సరయూ నదిలో దూకిన కొన్ని గంటలకే రాముడు సరయూ నదిలో దూకినాడు. సీతయును భక్తుడగు జీవుడే. సీత యనగా నాగటి చాలు అది ఎట్టి వంకర లేక నేరుగా యుండును. శేషుడనగా సర్పము. అది వంకర టింకరలుగా పోవుచుండును. నేరు మార్గమున వచ్చు భక్తులు, వంకర మార్గమున వచ్చు భక్తులు ఆక్షేపించగనే పతనము ప్రారంభమగును. సీతాదేవి లక్ష్మణునిపై ఘోరనింద వేసినది. ఇది భాగవతాపచారము. అందుకే స్వామి సంకల్పించి చాకలి వానిచే సీతపై నింద వేయించినాడు. నిందాకర్మకు నిందయే ఫలము. ఆమె లక్ష్మణును నిందించిన కొన్ని నిమిషములకే రామునికి దూరమై పోయినది. అంతటితో ఫలానుభవము ఆగలేదు. మరల రజకుని చేత నిందింపబడి స్వామికి దూరమైనది. స్వామి వియోగములో ఆవేశములో మనస్సు స్ధిమితమును కోల్పోయినది. అందుకే చివరలో నీవు అయోధ్యా జనులకు మరల ఒక నిరూపణము చేసి చూపించమని స్వామి ఆదేశించినప్పుడు స్వామి ఆజ్ఞను తిరస్కరించి భూప్రవేశము చేసినది. ఆ సమయములో ఆ బుద్ధి పుట్టుటకు కారణము కూడా లక్ష్మణుని నిందించుటయే. ఈ విధముగా భాగవతాపచారము వలన ఆమె స్వామి సన్నిధిని శాశ్వతముగా కోల్పోయినది. ఈ పాపకర్మ ఫలము మరుజన్మలో కూడ వెంటపడినది. ఆమె రుక్మిణిగా అవతరించినప్పుడు శిశుపాలుడు పెండ్లి కొడుకుగా వచ్చి వియ్యాల వారి యింటిలో కూర్చునియున్నాడు. గౌరీపూజ సిద్ధమైనది. అప్పుడు ఆమె పడిన వేదన వర్ణనాతీతము. ఎంత వేదన పడినదంటే తాను లక్ష్మణుని నిందించినప్పుడు ఎంత భాధపడినాడో అంత తపన పడినది. ఇంకనూ కొంత కర్మ శేషము మిగిలియున్నది. దానిని కూడా పోగొట్టుటకు, పెండ్లి తరువాత ఒకనాడు శ్రీ కృష్ణుడు "మేము రాజులము కాము. శిశుపాలునే మరల పెండ్లి చేసికొమ్మని చెప్పగా రుక్మిణి దేవి మూర్చపోయినది". దానిని రాధకు వేడిపాలను ఇచ్చిన సందర్భములో రుక్మిణి దేవి ఓడిపోయినట్లు చేసి అవమానము చేసినాడు. ఈ విధముగా పంచభూతములతో నిర్మింపబడిన శరీరము, చేసిన భాగవతాపచారమునకు పంచ విధములుగా భాగించినారు స్వామి.

ఈ ఐదు భాగము మాత్రమే సీతను అడవులకు పంపించుట. ఇది చూచి అజ్ఞానులు రాముడు సీతకు ఎంత అవమానము చేసినాడని వాపోవుదురు. హనుమంతుడు రాధ మార్గమును వంకరయని ఆక్షేపించినాడు. కావున స్వామి రాధనే ఆదరించినాడు. అట్లే సీత లక్ష్మణుని ఆక్షేపించినది. కావున స్వామి లక్ష్మణుని ఆదరించినాడు. రాధ స్త్రీ అయినచో, లక్ష్మణుడు పురుషుడు. కావున స్వామికి స్త్రీ, పురుష వివక్షత లేదు. భక్తి పరీక్షను పట్టియే ఫలము లభించును. నీవు ఒక దైవ స్వరూపమును ఎన్నుకొని ఆరాధించుచుండగా ఆ దైవ స్వరూపము మీద నీకున్న చెదరని దృష్టియే నిష్ట అనబడును. నీవు సాధనలో క్రమముగా పైకి వచ్చుచుండగా, ఆ దైవ స్వరూపములోని అంతస్వరూపుడగు దత్తుడు క్రమముగా ప్రకటితమగుచుండును. దత్తుడు ప్రకటింపబడిన కొలది ఉష్ణము పెరుగును. సూర్యుని సమీపించిన కొలది ఉష్ణము పెరుగును. దత్తుడు పరిపూర్ణముగా ప్రకటితమగు సమయమున నీవు సాక్షాత్తు సూర్యగోళములో ఉందువు. దత్తపరీక్షలకు ఎంతో ఓర్పు కావలయును. అందుకే సాధన గుణ సంపత్తిలో మొట్ట మొదటి గుణము శమము అనగా ఓర్పు అని శంకరులు అద్వైత భాష్యమున వచించియున్నారు. కావున నిష్టతో పాటు సబూరి అవసరమన్నారు. సబూరి యనగా ఓర్పు కావలయునని శిరిడి సాయి ఎల్లప్పుడు బోధించెడివారు. రాధ స్వామి ఆజ్ఞననుసరించి, ఎల్లప్పుడును బృందావనములోనే నిద్రాహారములు మాని స్వామి ఆజ్ఞను పాటించుచు స్వామిని పల్లెత్తు మాట అనక జీవితమంతయును గడిపినది.

లక్ష్మణుడు కూడ పదునాలుగు సంవత్సరములు నిద్రాహారములు లేక స్వామిని సేవించినాడు. అంతే కాదు లంకలో సీత యొక్క అగ్ని ప్రవేశమునకు అగ్నిని కాల్చమని స్వామి ఆదేశించగా మారు మాట్లాడక సిద్ధము చేసినాడు. సీతను అడవులలో దింపి రమ్మని స్వామి ఆజ్ఞాపించగా ఎదురు చెప్పక స్వామి ఆజ్ఞను పాటించినాడు. ఇచ్చటి లక్ష్మణ భక్తియే కాక మరొక విశేషము కలదు. లక్ష్మణుని నిందా పాప కర్మ ఫలమును లక్ష్మణుని ద్వారానే అందించినాడు. కావున స్వామిలో ఎప్పుడు ఎట్టి పొరపాటు కూడా ఉండదు. ఆయన చర్యలోని అంతరార్ధమును మనము గ్రహించ లేక చాలా సార్లు స్వామిని అపార్ధము చేసుకొందుము. నిరాకారమైన స్వామిపై ఎట్టి బంధమును ఉంచలేము. కావున నిరాకారము యొక్క ధ్యానము వ్యర్ధము. నిరాకారము కొరకు సాకారులగు ధన గృహములను, నరాకారులగు భార్యాపుత్రాదులను త్యజించుట హస్యాస్పదము. మనకు ప్రత్యక్షము కూడా కాని అమృతము కొరకు మనకు ప్రత్యక్షముగ లభించుచున్న కాఫీ మొదలగు పానీయములను త్యజించెదమా? ఒక ప్రత్యక్ష పదార్ధము కొరకు మరియొక ప్రత్యక్ష పదార్ధమును త్యజించవచ్చును. ప్రత్యక్షము కాని నిరాకారము కొరకు ప్రత్యక్షములను ఏల త్యజించ వలెను. ఒక గ్లాసులో అమృతము పోసి యిచ్చి త్రాగించి రుచి చూపినచో, నీవు చెప్పనక్కరలేకయే వాడు కాఫీని త్యజించును. అంతే కాని అమృతము ఉన్నది. దాని ఆకారము కూడ నాకు తెలియదు. దాని కొరకు నీవు కాఫీని త్యజించమన్నచో ఎవడును త్యజించడు. త్యజించుటయు అవివేకము. కావున నిరాకార ధ్యాన మార్గములో వైరాగ్యము రాదు. ఇక సాకార మార్గములో ఒక విగ్రహమును, పటమును ధ్యానించుచున్నాము. అది అచేతనమైన జడపదార్ధము. జడము కన్నను చేతనము విలువ కలదు అని బాలుడు కూడ చెప్పును. కావున ఒక విగ్రహము పటము కొరకు చేతనమగు భార్యాపుత్రాదులను త్యజించనేల?

కావున అచేతనములను ఆరాధించు సాకారమార్గములో కూడ వైరాగ్యము అర్ధరహితమై యున్నది. దీనిని బోధించుటకే త్యాగరాజు ఆరాధించు రామ విగ్రహమును స్వామి సంకల్పము చేత నదిలో పారవేయబడెను. దానితో త్యాగరాజు ఉన్మత్తుడై నిరాహారియై దేశ భ్రమణము చేయుచుండగా భార్యయును నిరాహారియై ప్రాణములను విడచినది. ఇది సరియైన మార్గము కాదని స్వామి త్యాగరాజుకు స్వప్న దర్శనములో బోధించినాడు. కాని స్వామి నరాకారమున అవతరించినప్పుడు అచేతనములైన గృహాదులను చేతనులైనన భార్యాపుత్రాదులను త్యజించుటలో అర్ధమున్నది. చేతనము కొరకు జడములను త్యజించుట యుక్తమే కదా. ఇక చేతనులగు నరులలో అత్యుత్తముడగు పురషోత్తముని కొరకు ఇతర నరులను త్యజించుట కూడా యుక్తమే అగును. పురుషుడనగా జీవుడు అని అర్ధము కూడా ఉన్నది. "పురి" "దేహి"చేతే"పురుషః" అని అర్ధమున్నది. అనగా పురము అనబడు దేహము నందు వ్యాపించి యుండు చైతన్య స్వరూపుడు జీవుడు అని అర్ధము. కావున పురుషులలో అనగా జీవులలో ఉత్తముడగు పురషోత్తమముడగు నరావతారములో యున్న స్వామి కొరకు ఇతర పురుషులను అనగా ఇతర జీవులను త్యజించుటలో అర్ధమున్నది. కావున మార్గములోనే వైరాగ్యము సాధ్యము సార్ధకము. ఒకే సమయమున స్వామి ఒకే నరావతారములో ఉండవచ్చును లేక అనేక నరావతారములలో ఉండవచ్చును. అక్కలకోట మహారాజ్‌, శిరిడిసాయి ఒకే సమయమున ఉన్నారు. ఇరువురు దత్తావతారములే కావున నేనొక్కడనే దత్తుడన్నవాడు మూర్ఖుడు. వాడు అసలు దత్తుడే కాదు. వాడిని మనము పరీక్షింప పనిలేదు. పరీక్ష ఫలమును వాడే స్వయముగా చెప్పుచున్నాడు.

పౌండ్రక వాసుదేవుడు శంఖ చక్రములు ధరించి నేనొక్కడనే నారాయణావతారుడనని వాగినాడు. ఒకే సమయమున రెండు తీగెల ద్వారా ఒకే విద్యుత్తు ప్రవహించి ఫ్యాను త్రిప్పుట, లైటును వెలిగించుట అను రెండు వేరు వేరు పనులను చేయుచున్నది. కావున స్వామి కార్యమును అనుసరించి ఒకే సమయమున అనేక నరావతారములు రావచ్చును. ఒకే సమయమున అర్జునుడు విశ్వరూపమును చూచినాడు. విశ్వరూపము యొక్క పటములో అనేక ముఖములు అనేక బాహువులు ఉండును. కాని రెండే కాళ్ళు ఒకే ఉదరము ఉండును. ఈ చిత్రపటము సరియైనది కాదు. విశ్వరూపములో అర్జునుడు ఒకే సమయమున అవతరించిన అనేక నరావతారములను చూచినాడు. కావుననే అనేక బాహుదర వక్త్ర నేత్రం అని సూచించినాడు. అనగా అనేక బాహువులు అనేక ఉదరములు అనేక వక్త్రములు అనేక నేత్రములు అని అర్ధము. ఇదే అర్ధము సహస్రాత్‌ అని పురుష సూక్తములో అనేక పాదములు అనియును చెప్పబడినది. అనగా అనేక నరావతారములు అని అర్ధము. అయితే సృష్టి మొదలు ఇప్పటి వరకును వచ్చిన నరావతారముల సమూహము అని కూడా చెప్పవచ్చును గదా. కావున ఒకే సమయమున అనేక నరావతారములు ఉండవు అని వాదించరాదు. అట్లు అయినచో పరశురామ, శ్రీ రామావతారములు ఒకే సమయమున ఎట్లున్నవి? కలియుగములో శ్రీ స్వామి సమర్ధ (అక్కలకోట మహరాజ్‌) మరియు శ్రీ శిరిడిసాయినాధుడు ఒకే సమమయమున ఉన్నారు గదా.

జీవుని జీవిత ఆశయము ఏమనగా వర్తమానములోని నరావతారమును గుర్తించి సేవించుటయే.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, December 28, 2009

అనుగ్రహము

పరమాత్మ యొక్క అనుగ్రహము పొందినపుడు భక్తిని చూపించుట నిజమైన భక్తి కాదు. మనకు లాభము చేయు వారి మీద ప్రేమను చూపుట, సత్యమైన ప్రేమ కాదు. ఎదుటువారు మన సుఖమునకు కారణమైనందున వారిపై మనము చూపు ప్రేమ అది నిజమైగ వారిపై ప్రేమ కాదు. అది మన మీద మనకున్న ప్రేమయే. మనలను మనము ప్రేమించుట వలననే మనకు సుఖము నిచ్చెడి వస్తువులను వ్యక్తులను ప్రేమించుచున్నాము. కావున ఇది ఆత్మప్రేమయే తప్ప పర ప్రేమ కాదు. మనకు సుఖమును దుఃఖమును కల్గించక మౌనమున ఉన్న వారిపై మనము కూడా ప్రేమను చూపము. మనకు ఒక ప్రదేశములో ఒక రాయి కనబడినది. ఆ రాయి మనకు సుఖము నిచ్చుట లేదు. దుఃఖము నిచ్చుట లేదు. కావున ఆ రాయి మీద మనకు ప్రేమ లేదు. కాని అదే రాయి మన కాలికి కొట్టుకున్నచో కోపముతో దానిని అవతలకు పారవేయుదుము. కావున మనలో ఆత్మప్రేమ కాక పరప్రేమ ఎప్పుడు బయిటపడుచున్నది. స్వామి వరముల నిచ్చి అనుగ్రహమును చూపినప్పుడు కాదు స్వామిని పూజించి ప్రేమించుచున్నను ఎట్టి ప్రతి ఫలమును ఈయక ఉపేక్ష వహించినపుడు మన ప్రేమ, సేవ కొనసాగినచో అది పూర్ణ ప్రేమ లేక సత్యప్రేమ యగును. ఇక పరిపూర్ణమైన సత్యాతి సత్యమైన ప్రేమ సేవ ఏది యనగా స్వామి మనపై ఆగ్రహించినపుడు మనము ఎంత ప్రేమింతుము? మనము సేవించుచుండగా వరములనీయక పోగా ఉపేక్షవహించుట మాత్రమే కాక కష్టములను కల్గించినను ప్రేమ సేవలు యధాతధముగా కొనసాగించినచో అవియే పరిపూర్ణమైన సత్యాతి సత్యమైన భక్తి ప్రేమలనబడును. లొట్ట చేతులను బాగు చేసుకొన వచ్చిన కార్తవీర్యునకు ఆ రెండు లొట్ట చేతులను బాగు చేయక పోగా స్వామి కాలితో తన్ని ఆ రెండు చేతులను విరగకొట్టినాడు. అయిననూ కార్తవీర్యుని ప్రేమలో సేవలో ఎట్టి తేడా రాలేదు. శిరముతో సేవించినాడు. అట్లే శ్రీ రాముడు రజకుని నిందా వాక్యములను విని సీతను కారడవులకు పంపినపుడు సీత లక్ష్మణునితో రాముని వంశమగు ఈ సంతానము అడ్డము రాకున్నచో స్వామి వియోగములో వ్యర్ధమైన ఈ బ్రతుకును చాలించి ఉండెడిదానను. ప్రసవానంతరము నేను పంచాగ్ని మధ్య తపమును చేయుదును. ఆ తపస్సు యొక్క లక్ష్యము ఏమనగా మరుజన్మలో కూడా రాముడే నాకు భర్తగా లభించవలయును అని చెప్పినదే కాని శ్రీ రాముని నిందించలేదు. ఇదే నిజమైన భక్తి.

Thursday, December 24, 2009

నిష్కామము

భగవంతుని నిష్కామముగా ప్రేమించుట లేక ఆరాధించుట అసంభవమని కొందరు తలచుచున్నారు. ఏలయనగా "ప్రయోజన మనుద్దిశ్యస మందోపి ప్రవర్తతే" అను సామెత ప్రకారము ఎంతటి మూర్ఖుడైనను ప్రయోజనము లేకుండా ఏ పనిచేయడు. మనకు ఏ ఉపకారము చేయకుండా ఒకరి మీద మనకు ప్రేమ ఎలా కలుగుతుంది. ఇచ్చిపుచ్చుకుంటే ఆపేక్షలు అని అందుకే అంటారు. తండ్రి ధనమును సంపాదించి, మన యొక్క అవసరములు తీర్చుచున్నాడు కావున తండ్రిని ప్రేమించి సేవించెదము. తల్లి పదార్ధములు వండి పెట్టి మన యొక్క ఆకలి తీర్చుచున్నందున మనము తల్లిని ప్రేమించి సేవించు చున్నాము. అట్లే భగవంతుడు మన కష్ణములను పోగొట్టి మనము అడిగిన వరములను ఇచ్చినచో ప్రేమించి సేవించుట సహజము. కాని ఎన్ని కష్టములు వచ్చినను వాటిని తీసివేయమని యాచింపక ఎట్టి వరమును కోరక, స్వామిని ప్రేమించి సేవించుట కంచి గరుడ సేవయే అగును. స్వామి తాను ఆయుధము పట్టనని తన సేన యగు పదివేల యాదవులు ఆయుధము ధరించి యుద్ధము చేయుదురని ఈ రెండింటిలో ఏది కావలయునని పార్ధుని అడిగినాడు. ఆ పదివేలు యాదవులు "నారాయణ సేన " అను పేరుతో గొప్ప వీరులు. దుర్యోధనుడు చాలా భయపడినాడు. పార్ధుడు తప్పక నారాయణ సేననే కోరుననియు ఇక మిగిలిన కృష్ణుడే తనకు గతియని యుద్ధము చేయని కృష్ణునికి ప్రతిరోజు వెన్నముద్దల నైవేద్యములతో వ్యర్ధమగు సేవ చేయవలసి వచ్చునని బాధపడినాడు. కాని కౌంతేయుడు నారాయణ సేనను వదలి నారాయణునే వరించినాడు. దుర్యోధనుడెంతయో సంతోషించి ఇంక కొంచెము సేపు ఉన్నచో ఈ కృష్ణుడు ఏమి తారుమారు చేయునో అని భయపడి అప్పుడు కృష్ణుడు నవ్వుచు, "అర్జునా! నీకేమైనా పిచ్చి పట్టినదా నీకు యుద్ధములో ఉపయోగించు నారాయణ సేనను వదలుకున్నావే.

నీకు ఏ విధముగను ఉపయోగించని నన్నేల కోరుకొంటివి" అని స్వామి నెత్తి బాదుకున్నాడు. అప్పుడు అర్జునుడు "స్వామీ! నీ నుండి నాకు ఎట్టి ప్రతిఫలాపేక్షయు లేదు. నీవు నా వద్ద ఉండిన చాలును. నీ వంటే నాకు పిచ్చి ఇష్టము" అన్నాడు. కానీ, నిజముగా ఆలోచించినచో జరగబోవు యుద్ధములో ఉపయోగించక పోయినను, జరిగిన ఎన్ని విషయములలో కృష్ణుడు వారికి సాయపడినాడు. అవి అన్నియు పార్ధునకు గుర్తు ఉన్నవి కావుననే కృష్ణుడన్న అంత ఇష్టము. భీమునికి విషాన్నము పెట్టించినప్పుడు, యమునలో పడ త్రోయించి, లక్క ఇంటిలో కాల్చినపుడు, ద్రౌపది వస్త్రాపహరణ సమయమునను ఇట్లు ఎన్నిసార్లు స్వామి ఆదుకున్నాడు. అట్లే మానవుడును తనకు ఈ క్షణము వరకు స్వామి విధములుగాఅ సాయపడినాడో, గుర్తుకు తెచ్చుకొన్నచో, అవి చాలవా? స్వామిపై భక్తి ఏర్పడుటకు. ఇప్పుడు అడిగిన వరము ఈయకున్ననూ, నీవు అడుగకయే ఎన్ని వరములు ఇచ్చినాడు. అతి దుర్లభమైన మానవ జన్మ నీకు ఇచ్చినాడు. పూర్ణాయుర్ధాయమును ఇచ్చినాడు. ఆరోగ్యము నిచ్చినాడు. తిన్న అన్నము అరిగించు శక్తిని అరుగుదలను ఇచ్చి నీకు కావలసిన అన్నమును ధనమును ఇచ్చినాడు. సంతానము యిచ్చినాడు. కీర్తి ఇచ్చినాడు. శీతాకాలములో సుఖమును కల్గించు వెచ్చని ఎండ నిచ్చినాడు. ఎన్ని విధముల ఫలములను సృష్టించినాడు. ఎన్ని రుచుల ఆహారమును సృష్టించినాడు. వాటిని చక్కగా తయారుచేయు పాక శాస్త్రమును అందించినాడు. ఇన్ని వరములను ఇచ్చిన స్వామిపై భక్తి కలుగుటకు ఇప్పుడు ఒక్క వరము కావలయునా? ఇచ్చిన వంద వరములకు గతి లేదు. ఇంత వరకు స్వామిపై భక్తి పుట్టలేదు. ఇప్పుడు 101 వరము ఇచ్చినచో నీకు స్వామిపై భక్తి పుట్టుననిన నమ్మమందువా? లేదా 101 వరము తరువాత 102 వరము అడుగుదువు. ఇచ్చిన వంద వరములకు నోటారా ఉచ్చరించి ఒకనాడైనా కృతజ్ఞతలు చెప్పితివా? మానవుడు ఇంత కృతఘ్నుడు కనుక ఇచ్చిన వరములను మరచి 101వ వరమును కోరుచు వరమీయకున్నచో ఎట్లు ప్రేమింతును అని అనుచున్నాడు. నిస్కామముగా సేవించమని స్వామి గీతలో చెప్పుటలో అంతరార్ధ మేమి? పాతబాకీలు వాటి వడ్డీలలో ఏమియు చెల్లించక కొత్త బాకీ అడుగ వద్దనియే నిష్కామ కర్మ యోగము. అంతే కాని స్వామి పిచ్చివాడు కాదు. 40 రోజుల తపస్సు తరువాత క్రీస్తు మహాత్ముడు కొండ మీద తనను చూడవచ్చిన 4000 మందికి 4000 వేల రొట్టెలు ఇయ్యమని భగవంతుని అడుగక బుట్టలో యున్న 4 రొట్టెలను పైకి చూపి "ప్రభూ! ఈ నాలుగు రొట్టెలు ఇచ్చినందులకు నీకు కృతజ్ఞతా స్తుతులను చెల్లించుచున్నాను అని మాత్రమే అన్నాడు. ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలిపినందుకు పరమాత్మ సంతోషిస్తాడు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Wednesday, December 23, 2009

అహంకారము

అహంకారముతో ఉన్న జీవులకు ప్రభువు బోధ చేయ తలచినప్పుడు తన యదార్ధ స్ధితిని దాచి అధముడైన పాత్రలో ప్రవేశించి చండాలాది వేషములలో అధమునిగా నటించుచు ఆ అహంకారి వద్దకు స్వామి చేరును. అహంకారి వద్ద స్వామి తన నిజస్ధితిని ప్రకటించుకున్నచో అతడు అంగీకరించక స్వామిని దూషించుచూ స్వామి చెప్పు బోధలను వినడు. అప్పుడు సాధనలో మొదటి అవస్ధ యగు శ్రవణమే లేకుండా పోవును. కావున అహంకారియగు జీవునకు శ్రవణము కలిగించుటకై స్వామి వినయముతో అధమునిగా వచ్చును. అహంకారమునకు ఆకర్షణను కలిగించునది వినయము.

అహంకారమునకు అహంకారము వికర్షణ కల్గించి దూరముగా పోవును. కావున ముందు వాని అహంకారమును ఉపశమింప చేసిన కాని వాడు శ్రవణమునకు అవకాశమునీయడు. ముందు లంఖిణిని లొంగదీసిన గాని లంకాప్రవేశము జరుగదు. కావుననే అహంకారియైన బలి వద్దకు స్వామి అమిత దుర్భలుడగు పసి బాలునిగా అనగా అధమునిగా వామనుడై వచ్చినాడు. కావున గురుస్వరూపుడగు దత్తుడు ఎప్పుడును వినయముతో తన్ను తాను అధమ స్ధితిలో నుంచుకొనును, ఏలననగా జీవులందరు అహంకారులే. కుక్క తోకకు వంకర తనము ఎట్లు స్వభావ గుణమో జీవునకు అహంకారము అట్లు స్వభావగుణము. ఎంత జ్ఞాని యైనను జీవునకు ఏదో ఒక సమయములో అహంకారము ప్రవేశించును. వాని అహంకారము అణిగి ఉన్నప్పుడు స్వామి తన స్వరూపమును ప్రకటించును. వానిలో ఆహంకారము లేచినప్పుడు స్వామి మరల దాసుడిగా అధముడిగా ప్రకటించుకొనుచు వానిలోని అహంకారమును శాంతింప చేయును.
శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు మరి కొందరు ఎక్కువ అహంకారము కలవారు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు. మరికొందరు ఇంకనూ అహంకారము కలవారు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. కావున బ్రహ్మమగు శంకరులు చెప్పు వాక్యములను ఎవడును గ్రహించలేరు. ఆ బ్రహ్మము చెప్పు వాక్యములను బ్రహ్మమగు నేను వినవలయును అను అహంకారము ప్రవేశించినది.మీరు బ్రహ్మము గాదు జీవులు అని స్వామి అన్నచో నీవును జీవుడవే. జీవుడు చెప్పు మాటలను జీవుడు విననేల? అని శిష్యులు భావింతురు. ఒక టోపీలు అమ్ముకొను వాడు నిద్రించుచుండగా వాని టోపీలను కోతులు ఎత్తుకొని పోయి చెట్లు ఎక్కి టోపీలను తలపై ధరించినవి. అవి టోపీలను ధరించుటకు కారణము ఆ వర్తకుడు టోపీను నెత్తిన ధరించుటయే. ఆ వర్తకుడు లేచి ఎంత ప్రాధేయపడినను, ఎంత బోధించినను అవి ఇకిలించినవే కాని తలలపై టోపీలను తీయలేదు. కారణము బోధించువాడు తలపై టోపీని ధరించి యుండగా కోతుల వంటి శిష్యులు వారి టోపీలను తీయరు. అప్పుడా వర్తకుడు తన టోపీని తీసి క్రింద పారవేయగా, ఆ కోతులును టోపీలను క్రింద పార వేసినవి. కావున శంకరులు ఉన్నంత కాలము శిష్యులు అద్వైత మతమునే అవలంభించి ఆయన బ్రహ్మము అన్నాడు కావున మేము కూడా బ్రహ్మమే యని శిష్యులు అన్నారు. జీవులకు శోభాయము అహంకారము స్వరూపము అసూయ.

కావున శంకరులు రామానుజులుగా అవతరించి తాను స్వామికి భక్తుడను అని అన్నారు. భక్తిని గుర్తించి బోధించినప్పుడు స్వామి భక్తుడు గానే అవతరించవలయును. అప్పుడు శిష్యులందరును "మేము స్వామి భక్తులమే" అన్నారు. అప్పుడు రామానుజులు "ఓ జీవులారా!మీరు భక్తులైనంత మాత్రమున చాలదు. స్వామి కార్యములో పాల్గోని సేవకులు కావలయును. నిజమైన భక్తియే సేవయని బోధించినారు. కాని జీవులు రామానుజులు ఎట్లు విష్ణువు అంశయో తాము కూడా విష్ణువు యొక్క అంశయే అని భావించినారు. జగత్తు స్వామి యొక్క శరీరము. ఈ శరీరములో ఒక భాగము జీవుడు. కావున మేము కూడా స్వామి యొక్క భాగములమే. మహాగ్ని నుండి వచ్చిన నిప్పురవ్వలమే అన్నారు భక్తులు. అప్పుడు రామానుజులు మధ్వాచార్యునిగా అవతరించినారు. స్వామి దాసుడగు హనుమంతుని తనకు స్వామిగా చేసుకొని నేను దాసానుదాసుడను అని అన్నారు. జగత్తు స్వామి యొక్క శరీరము కాదు. స్వామి కన్న విడిగా యున్న పదార్ధము అని బోధించినారు. అప్పుడు జీవులు కూడా స్వామి యొక్క దాసానుదాసులమని భావించిరి. కావున "యధా రాజా తధా ప్రభూ" "యధా గురు తధా శిష్యః" అను సిద్ధాంతమును అనుసరించియే స్వామి కూడా దత్తునిగా కాకుండా భక్తునిగానే ప్రవర్తించు చుండును.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, December 21, 2009

హనుమంతుడు మరియు రాధ

హనుమంతుడు, రాధ, సత్యభామ, రుక్మిణి మొదలగు పాత్రలన్నియును జీవులుగా నటించుచున్న శ్రీ దత్తుని వేషములే. వీరందరును జీవులకు ఆదర్శములను సాధనలో నిలుపము ఎట్లుండును అని జీవులకు బోధించుటకై గెలుపు, ఓటమిలను పొందుచు,లోపమునట్లు నటించుచున్న వారే తప్ప నిజముగా వారిలో ఎట్టి లోపములు లేవు. కానీ, మానవులు యీ నాటకముల నుండి గుణపాఠములను నేర్చుకొనక, నిజముగా వారిలో లోపమునట్లు భావించుచుందురు. ఒక సినిమాలో సుబ్బయ్య అను ఒక నటుడు భీమునిగాను దుర్యోధనునిగాను నటించుచున్నారు. భీముడు దుర్యోధనుని పడగొట్టెను. అనగా సుబ్బయ్య సుబ్బయ్యను పడగొట్టెనా? అక్కడ పడిపోయినది దుర్యోధనుని వేషము కాని నిజముగా దుర్యోధనుడు అక్కడ లేడు. అట్లే హనుమంతుడు మొదలగునవి శ్రీ దత్తుని వేషములే. సత్యభామ చుప్పనాతి అని చెప్పుదురు. సత్యభామ అనునది ఒక వేషము. చుప్పనాతి తనము పనికి రాదని మనకు ఉపదేశించుటయే అక్కడి ముఖ్యోద్దేశ్యము. అసలు సత్యభామ ఎవరు? భూదేవి. భూదేవికి ఉన్న సహనము ఎవరికిని లేదు. అందుకే ఆమె చుప్పనాతి సత్యభామ పాత్ర వేషమునకు అంగీకరించి, అందరు నిందించుటను సహనముతో ఓర్చుకొనుటకు అంగీకరించినది. కావున పాత్రధారియైన భూదేవి చుప్పనాతి కాదు. ఇక సత్యభామ అనునది బాహ్య వేషమే. వేషమునకు చుప్పనాతి తనము ఉండునా? కావున, అక్కడ చుప్పనాతి ఎవరును లేరు. చుప్పనాతివి నీవే. నీ చుప్పనాతి తనము పోగొట్టుటకై ఆ వేషము వేసి నీకు బోధించ వలసి వచ్చెను. నీవు చుప్పనాతివని నీకు బోధించినచో నీవు అంగీకరించవు అహంకారముతో. కావున నేరుగాకాక, పరోక్షముగా బోధించుట ఒక పద్ధతి. "కారితా సమ్మిత తయోపదేశయుజే" అన్నారు పండితులు. అనగా భార్య ఎట్లు మెత్త మెత్తగా తియ్యగా ఉపదేశమును చెప్పునో, అట్లే జీవులకు బోధించవలెను. చుప్పనాతి ఒకరు ఇట్లు గర్వభంగము పొందినని ఒక నాటక కధను చెప్పినచో, అది విన్న జీవుడు "చుప్పనాతి తనము మంచిదికాదు" అని తెలుసుకొని, తనకోని చుప్పనాతి తనమును విడచి పెట్టుటకు ప్రయత్నించును. అట్లు కాక, నీ చుప్పనాతి తనమును విడిచిపెట్టమని నేరుగా బోధించినచో " నీవు చుప్పనాతివి, నీ తాత తండ్రులు చుప్పనాతులు" అని అహంకారము దెబ్బతిన్నందున ఎదురు చెప్పును. కావున, వ్యాసుడు పురాణములను కాంతా వాక్కులతో పరోక్షముగా బోధించుచు, కధలను చెప్పినాడు. కావున రాధ హనుమంతుడు, సత్యభామ మొదలగు వారి పొరపాట్లు, గెలుపు ఓటములను చెప్పినపుడు జీవులను దృష్టిలో పెట్టుకొని చెప్పినవే కాని వారిలో అట్టి లోపములు ఉండవు. హనుమంతుడు ఎవరు? శివుని అవతారము. శివుడు ఎవరు? సాక్షాత్తు దత్తుడు. కావున, జీవుల బోధ కొరకు అలా హనుమంతుడు నటించినాడే తప్ప, హనుమంతుడు పొరపాటు అన్న సాక్షాత్తు దత్తుడే పొరపాటు పడినాడని చెప్పినట్లు అగును.
త్రిమూర్తులు కూడ దత్తుని వేషములే. కావున పురాణములలో ఒకచోట శివుడు విష్ణువును గెలిచినట్లు శివపురాణములో చెప్పబడును. నరసింహుని, శరభావతారము నెత్తి శివుడు ఓడించినట్లు వ్రాయబడినది. అచ్చట దీర్ఘ కోపము పనికిరాదని జీవులకు బోధించుటకై నరసింహుడు దీర్ఘ కోపమును నటించెను. అది పనికిరాదని అట్టి దీర్ఘ కోపమునకు గర్వ భంగము తప్పదని నిరూపించుటయే తప్ప ఇక్కడ శివుడు, విష్ణువును ఓడించెనని శైవులు గంతులు వేయుట పామర దృష్టియే. అట్లే భాగవతమున బాణాసురుని రక్షించుటకు వచ్చిన శివుని కృష్ణుడు ఓడించెను. ఇది వైష్ణవులకు ఆనందము నిచ్చుచున్నది. శివుడు ఎవరు? విష్ణువు ఎవరు? సృష్టి హర్తయే, సృష్టి భర్త. ఆరెండూ వేషములే. వ్యక్తియగు నటుడు దత్తుడు ఒక్కడే. కావున ఓడినది, గెలిచినది దత్తుడే. వేషములు జడములు గెలుపు ఓటమి ఉండదు. అట్లే శివుడు పెరుగుచుండగా, విష్ణువు వరాహరూపమును ధరించి కిందకు, బ్రహ్మ హంసరూపమున పైకి పోయినారు. ఆయన పాదములు విష్ణువుకు, తల బ్రహ్మకు కనిపించ లేదు. బ్ర్హహ్మ తలను చూచినానని అబద్ధమును చెప్పినాడు కావున ఆయన తలను శివుడు తుంచివేసినాడు. ఇందులో అంతరార్ధమము పరమాత్మ అనాది, అనంతుడనియును, అసత్యము చెప్పుట పనికిరాదని జీవులకు బోధించుటయే. బ్రహ్మ ముఖమును తుంచివేయుట అనగా వేషము యొక్క ముఖమును తుంచుటయే. నిజమముగా బ్రహ్మ ముఖమును శివుడు తుంచినచో, దత్తుడు తన ముఖమును తానే తుంచుటయగును. " బ్రహ్మచ నారాయణః, శివశ్చ నారాయణః" అని శ్రుతి. త్రిమూర్తులు ఒక్కరేయని చెప్పుచున్నది. ఆ ఒక్క వ్యక్తియే శ్రీ దత్త పరబ్రహ్మము.
రాధ యనగా ధార. ధార యనగా తన సాధనలో ఎట్టి పరీక్షలోను ఓడిపోక కుంటుపడక ఆగిపోక ఎన్ని బలమైన అడ్డంకులు వచ్చినను మహా తీవ్రమైన వేగముతో ఉప్పొంగి వాటిని అతిక్రమించి పరమాత్మను చేరిన మహాప్రవాహము. సృష్టి మొదలు ఇంత వరకును ఏ జీవునకు ఆ స్ధానము లభించలేదు. ఒక కళాశాలలో బంగారు పతకము ఒక విద్యార్ధికే లభించును. అట్టి బంగారు పతకము పొందినది రాధ. 14 లోకములకును పైన ఉన్నది గోలోకము. ఆ గోలోకమను శ్రీ మత్సింహాసనమును అధిష్టించిన సామ్రాజ్ఞయే రాధ. ఆమెయే లలిత యని పిలువబడుచున్నది. లలిత యనగా చాలా తక్కువ బలము కలది అని అర్ధము. ఈ జగత్తు అంతయు స్వామి యొక్క ఊహయే. ఊహ యొక్క బలము ఊహించు వ్యక్తి యొక్క బలముతో పోల్చినచో చాలా తక్కువ. ఈ సమస్త జగత్తు స్వామి యొక్క ఊహ. ఈ ఊహాజగత్తులో ఒక బిందువు మాత్రమే జీవుడు. ఈ జగత్తులో జడము చైతన్యము అను రెండు భాగములున్నవి. అవియే అపరా ప్రకృతి, పరా ప్రకృతి. జగత్తుకు ప్రతినిధిగా మానవుడు కూడా జగత్తులోనే ఉన్నాడు. మానవునిలో కూడా జడమగు శరీరము, చైతన్యమగు జీవుడు ఉన్నారు. ఊహ సముద్రమగు ఈ జగత్తులో మానవుడు ఒక చిన్ననీటి బిందువు కావుననే ఈ మానవుడు చాలా బలహీనుడు అమిత దుర్బలుడు. కావున మానవుడు లలిత యనబడు చున్నాడు. రాధ కూడా ఒక మానవాకారము కావున లలితయే. ఇట్టి మానవుడు పరమాత్మ యుండు పదునాలుగవ లోకమగు బ్రహ్మ లోకమునకు పైన ఉన్న గోలోకమున శ్రీ మత్సింహాసనమున ఆశీనురాలైన లలిత యగు రాధ యొక్క చరణముల క్రింద దత్త పరబ్రహ్మము యొక్క శిరస్సు ఉండు స్ధానమును ఆక్రమించినాడు. రాధను ఒక మానవ రూపము ఉన్న స్త్రీగా తీసుకొనుటలో అంతరార్ధము మానవ రూపములో యున్న జీవులందరు అనియే అర్ధము. ఈ స్త్రీ పురుష రూపమున ఉన్న మానవులందరును ప్రకృతి రూపులే. ప్రకృతి యనగా స్వామి చేసిన శ్రేష్టమైన కార్యము అని అర్ధము. ఒకడు ఒక పెద్ద భవనమును నిర్మించినపుడు ఆ భవనమును వాడు చేసిన కార్యము అని చెప్పుదురు. ఆ భవనములో యున్న ఒక చిన్న గోడయు వాడు చేసిన పనియే అగును. భవనమంతయును సిమెంటు ఇటుకలతో నిర్మింపబడినట్లే ఆ చిన్న గోడ కూడా సిమెంటు ఇటుకలతోనే నిర్మించబడి యున్నది. అట్లే పర అపర ప్రకృతులతో నిర్మించబడిన ఈ జగత్తు అను భవనము ఎట్లు స్వామి కార్యమగు ప్రకృతి అనబడుచున్నదో ఈ జగత్మ్భవనమగు ఒక చిన్న భాగమగు మానవుడు అన్న చిన్న గోడ కూడ పరా అపరా ప్రకృతులచే నిర్మింపబడి స్వామి కార్యమగు ప్రకృతియే అగుచున్నది. ఈ అర్ధమునే రామానుజాచార్యుడు "తత్త్వమసి" అను మహా వాక్యము యొక్క భాష్యములో "స్ధూల చిదచిత్విషష్ట విశ్వము" అన్ననూ "సూక్ష్మ చిదచిద్విశిష్ట"మానవుడన్ననూ ఒకటియేనని విశిష్టా ద్వైత వాదమున వినిపించినాడు. అనగా తత్త్వ పరముగా సముద్రము నీటి బిందువు రెండు నీవే యనుట. కావున లలిత యనగా అతి బలహీనమైన ఒక మానవుడు రాధ యనగా అట్టి మానవుడు నిరంతర భగవత్ప్రేమ ధార స్వరూపుడి తన సాధనలో అన్ని దత్త పరీక్షలను దాటిన వాడని అర్ధము. అట్టి జీవునకు దత్తుడు దాసుడై వాని చరణములను నెత్తి మీద పెట్టుకొనుటయే గోలోకము యొక్క అంతరార్ధము. దత్త పరీక్షలలో ముఖ్య తత్త్వము మన ప్రతి వస్తువు కన్నను, ప్రతి వ్యక్తి కన్నను చివరకు ధర్మము కన్నను స్వామికే ఎక్కువ విలువ నిచ్చుట. చివరకు నీ ప్రాణములతో పోటీ పడినపుడు కూడా ప్రాణముల కన్నను స్వామి ఎక్కువ యని నిరూపించు మరణమే భక్తి యొక్క దశావస్ధలలో చిట్ట చివరిది యగు మరణంతతః అని చెప్పబడినది. ఈ ప్రాణ త్యాగ పరీక్షలో గెలువ వలయునన్నచో, దాని ముందు భగవత్ప్రేమ ఉన్మాదావస్ధకు రావలయును. అందుకే మరణావస్ధకు ముందు తొమ్మిదవ మెట్టు ఉన్మాదమని "ఉన్మాదో మరణం తతః" అని చెప్పబడినది. ఇట్టి ఉన్మాదావస్ధలో ప్రహ్లాదుడు ప్రాణ త్యాగమునకు హిరణ్యకశిపుని హింసలకు సిద్ధమైనాడు. మరియును జీవతో వాక్య కరణాత్‌ అను ధర్మమును సైతము ఉల్లంఘించి ధర్మము కన్నను స్వామికి విలువ నిచ్చినాడు. ఈ విధముగా దత్త పరీక్షలలో దత్తుడు ధర్మముతో పోటీ పడినపుడు మహా భక్తులు సైతము ఒక్కొక్కసారి స్వామి కన్నను ధర్మమునకే ఎక్కువ విలువ నిచ్చి పరమపదసోపాన పటములో ధర్మము అను మహా సర్పము యొక్క నోటిలోపడి క్రిందకు జారినారు. అనగా చిట్టచివరి పరీక్షలో తప్పి వారి భగవత్ప్రేమ ప్రవాహము కుంటుపడి సాగక పోవుట వలన నిరంతర ధారకానందున రాధాతత్త్వమును పొందలేకపోయినారు. కావుననే సర్వధికమైన గోలోకమునకు ఆధిపత్యము అను కైవల్యమునకు మించిన ఫలమును పొందలేకపోయినారు. అద్వైత కైవల్యములో బ్రహ్మత్వమును పొంది బ్రహ్మముతో సమానుడైన దత్త పరబ్రహ్మమే తానై బ్రహ్మలోకము నందుండుట కానీ గోలోక నివాసములో బ్రహ్మమునకే స్వామియై బ్రహ్మమునే దాసునిగా చేసుకున్న సర్వోత్తమ స్ధానము లోకపాలకులగు దేవతలు రాజులు అనబడుదురు. అట్టి దేవతలు దేవుడే యగు దేవ దేవ పదవియగు దత్త పరబ్రహ్మమే రాజరాజు. అట్టి దత్త పరబ్రహ్మమునకే స్వామిగా నిలుచుటయే ఈశ్వరీ పదవి. దీనినే రాజరాజేశ్వరి అందురు. దేవతలు తేజో రూపులగుట వలన శ్రీ మంతులు అనబడుదురు. అట్టి వారికి దేవుడగుటయే దేవదేవ పదవి యగు శ్రీ మత్సింహాసనము. అట్టి దేవదేవుని శాసించు ఈశ్వర పదవియే శ్రీ మత్సింహాసనేశ్వరి. ఈ స్ధానము అన్ని దత్త పరీక్షలలో గెలిచి ఎచ్చటను ఆగని నిరంతర ప్రేమధారయగు రాధకే చిక్కినది.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Friday, December 18, 2009

తన్మయాహితే

శ్రీ దత్త సద్గురువుని ఉపదేశము మరియు ప్రవర్తన మానవుని యొక్క అసూయ, అహంకారము, మమకారముల ప్రమాణములపై ఆధారపడి యున్నది. మానవుడు ప్రత్యక్షమును వర్తమానమును ఓర్చుకొనజాలడు. అందులోను తన స్వరూపము వంటి సాటి మానవుని ఎట్టి పరిస్ధితులలోను సహించజాలడు. కావున పరమాత్మ సాటి మానవునిగా వచ్చినపుడు మానవుడు గుర్తించుట చాలా కష్టము. ఆ సాటి మానవుని స్వరూపము పరోక్షముగా వైకుంఠముననో, కైలాసముననో ఉండినచో కొంత సహించగలడు. ఆ సాటి మానవుని స్వరూపము వర్తమాన కాలములో కాక గతించిన కాలములో ఉన్నచో అదియైనను సహించగలడు. వర్తమానములో సాటి మానవునిగా ఎదురుగా కనపడుచూ ఎట్టి మహిమలను చూపక సామాన్య మానవుని వలె ప్రవర్తించుచున్నను అట్టి రామునే దైవమని విశ్వసించి సేవించుచూ, తాను ఎట్టి మహిమలను చూపగలిగినను, తాను దైవమని భావించక యున్న హనుమంతుడు ఎంత గొప్పవాడో ఆలోచించుడు. రాధయును అట్లే వర్తమాన కాలమున ప్రత్యక్షముగా యున్న నవ స్వరూపమును ఆరాధించినను, కృష్ణుడు మహిమలను ప్రదర్శించినాడు. రాధ వద్ద ఎట్టి మహిమలు లేవు. కావున రాధ కృష్ణుని గుర్తించుట కన్నను హనుమంతుడు రాముని గుర్తించుట చాలా కష్టమైనది. కాన రాధ యొక్క జ్ఞానము, హనుమంతుని జ్ఞానము కన్న తక్కువ. అందువలనే హనుమంతుడు చతుర్ధశ భువనములకు అధిపతియై అందరి చేతను ప్రత్యేక దేవాలయములలో పూజింపబడుచున్నాడు. కాని రాధకు అట్టి దేవాలయములు లేవు. కావున హనుమంతుడు రాధకన్న గొప్పవాడు. దేనిలో? జ్ఞానములో. కాని రాధ యొక్క మార్గము చాల కష్టమైనది. ఆమె యొక్క ప్రేమ నరకమునకు కూడా భయపడలేదు. కనుక భక్తిలో హనుమంతుని కన్న రాధ గొప్పది. కావుననే పదునాలుగు భువనములకు పై నున్న గోలోకమునకు మహారాణి అయియున్నది. హనుమంతుని మార్గము దాస మార్గము. ఇది చాలా సులభమైనది. కాని రాముని గుర్తించుట చాల కష్టము. కాన గుర్తింపు చాల గొప్పయైనది. కాని రాధ యొక్క ప్రియ మార్గము చాల కష్టమైనది.

కావున మార్గము గొప్ప గుర్తింపు సులభము. కావున ఇరువురును సమ ఉజ్జీలే. పొందిన ఫలములు సమానమే. ఇంత అత్యుత్తమ ఫలమును ఇరువురును సమానముగా పొంది యున్నారు. కావున వారి సాధనలు కూడ అత్యుత్తమములై యుండవలెను. సాధనలో ప్రధాన అంశము ఏది? నీకు అత్యుత్తమ స్ధితిని అందించగల అత్యుత్తమ దైవ స్వరూపమును ఎన్నుకొనుటయే ప్రధానాంశము. ఏల యనగా అత్యుత్తమ ఫలప్రదాత ఆ దైవ స్వరూపమే కదా! వారిరువురు అత్యుత్తమ ఫలమును పొందినారు అన్నప్పుడు వారు అత్యుత్తమ దైవ స్వరూపమును ఎన్నుకున్నట్లే గదా! కావున వారు ఎన్నుకున్న అత్యుత్తమ దైవ స్వరూపము ఏది? ఆ దైవ స్వరూపము వారున్న వర్తమాన కాలములో వారికి ప్రత్యక్షముగ యుండి వారికి అందివచ్చిన బ్రహ్మమగు రామావతారము, కృష్ణావతారములే గదా. వారిరువురును (నరాకారములగు) ఎప్పుడును పరోక్షములగు నరాకారములగు విష్ణు, శివాది రూపములను ద్యానించినట్లు ఆరాధించినట్లు వినబడలేదు. ఇంత కన్న క్రియాత్మకమైన ప్రమాణము ఏమి కావలయును? వారిరువురు గతించిన నరాకారములను కూడా ధ్యానించలేదు.

హనుమంతుడు అప్పటికి గతించిన పరశురామ, వామన, నరాసింహాది అవతారములను ధ్యానించలేదు. అట్లే రాధ అంతకు ముందు గతించిన రామావతారమును ధ్యానించలేదు. దీనికి గల కారణము ఒక్కటే. ఆ ఇరువురిలోను అసూయ సంపూర్ణముగా నాశనమై యున్నవి. దత్తుడు అనసూయ గర్భము లోనికి మాత్రమే ప్రవేశించును. కనుక అసూయ లేని వారికే చిక్కును. అందివచ్చిన వర్తమాన నరాకారమునే ఉపాసించవలయునని నాలుగు వేదములు నాలుగు మహావాక్యముల ద్వారా బోధించుచున్నవి. శివశక్తి స్వరూపమే శిరిడి సాయిగా, సత్యసాయిగా అవతరించినది. కొందరు వర్తమానుడగు సత్యసాయిని నమ్మక గతించిన శిరిడి సాయినే నమ్ముదురు. నరాకారమున ఈ లోకమున స్వామి అవతరించుట నమ్మని మరికొందరు ఈ ఇరువురిని నమ్మక నరాకారములనే కలిగిన పరోక్షమున యున్న కైలాసవాసులైన పార్వతి పరమేశ్వరులను నమ్ముచున్నారు. కావున ఈ మత భేదము లన్నియు మానవునిలో గల అసూయ యొక్క ప్రమాణము మొదలగు భేదము మీద ఆధారపడి యున్నది. ఇంకనూ అందరి కన్నను అసూయ ఎక్కువ కలవాడు అసలు ఆకారమునే కొట్టివేసి నిరాకారమైన సర్వవ్యాపకమైన చైతన్యము వంటి శక్తిని దైవ స్వరూపముగా అంగీకరించును. కావున నిరాకారవాదులు మూడు కిలోల అసూయ కలవారు. పరోక్షసాకారాదులు అనగా కైలాస వాసులైన పార్వతి పరమేశ్వరులను మాత్రమే అంగీకరించు వారు రెండు కిలోల అసూయ కలవారు. భూలోక నరాకారమును అంగీకరించు సాకారవాదులు ఒక కిలో అసూయ కలవారు. గతించిన నరాకారమైన శివశక్తి అవతారమైన షిరిడి సాయిని మాత్రమే నమ్ముదురు. వీరిలో అరకిలో అసూయ కలవారు వర్తమాన నరావతారమైన సత్య సాయిని విశ్వసింతురు. ఆ అరకిలో అసూయ కూడ లేనివారు సత్య సాయిని చేరి ఆయన తలపెట్టిన కార్యములో పాల్గొని ఆయన సేవకులుగా తరించుదురు. అట్లే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీయును వర్తమాన దత్తావతారులే. వర్తమానములో శ్రీ దత్తుడు ఎందరో మహానుభావులైన నరావతారములను దాల్చి అందరకిని వారున్న ప్రదేశములలోనే అందుచున్నాడు.

కనుక భగవంతుని అందుకొనుటకు మనము ఎట్టి ప్రయత్నము చేయనక్కరలేదు. శ్రీ దత్త పాదము ఇంటింటికి తిరుగును. చేయవలసినదేమి? అనగా ఆయన ఉపదేశములను అనుసరించి ఆయన సేవలో పాల్గోనుటయే నీవు చేయవలసిన పని. కాని నీవు అక్కర లేని పనియగు భగవద్ప్రాప్తికై ప్రయత్నించుచున్నావే కాని అవసరమైన స్వామి సేవ చేయకున్నావు. అనవసరమైన పనిని చేయుట, అవసరమైన పనిని చేయకుండుట మానవుని నైజము. ఈ మత భేధములలో అసూయతో పాటు మానవునిలో లోభ గుణము గూడా వివిధ ప్రమాణములలో తాండవించుచున్నది. నిరాకారవాదులలో మూడు కిలోల లోభము ఉన్నది. దీపారాధన కూడ వారు చేయరు. ఏలననగా, ఆకారమును అంగీకరించినచో విగ్రహము వద్ద దీపారాధన ఖర్చు చేయవలసి వచ్చును. విగ్రహముల యొక్క ముఖము ప్రత్యేకముగా, స్పష్టముగా కనిపించుట కొరకే దర్శనమునకు సహకరించు విధముగా దీపారాధన నీరాజనము చేయబడుచున్నది. ఇది ఇంటిలో అక్కరలేదు. గర్భగుడిలో చీకటిగా యుండును కావున దీపారాధన చేయబడుచున్నది. ఐతే నిరంతరము ఒక లైటు వెలిగించి ఉంచవఛ్ఛును గదా అన్నచో మానవ స్వభావమునకు ఉన్న గుణము ఏమనగా, నిత్యము కనిపించినచో వెగటు పుట్టును. గర్భగుడిలో చీకటిలో కనిపించక, స్పష్టమైన దర్శనము కొరకు ఉత్కంఠముతో వేచియుండగా ఒక్క క్షణకాలము నీరాంజన జ్వాల కాంతులలో స్వామి స్వరూపము గోచరించినపుడు స్వామిపై శ్రద్ధ ఎక్కువగా నుండి విలువ పెరుగును. ఏలననగా మానవుని యొక్క అసూయ దీనికి కారణమగుచున్నది. నిత్యము గోచరించు దానిని నిర్లక్ష్యము చేయుదురు. ఎప్పుడొ కనిపించినచో విలువ యుండును. రాకరాక వచ్చిన ఒక బంధువు జీవుడైననూ వానికి విలువ నిత్తురు. నారాయణుడైనను నిత్యమము కనిపించుచున్నచో నిర్లక్ష్యము చేయుదురు.
నిత్యము కనిపించు కృష్ణ పరమాత్మను నిర్లక్ష్యము చేసి కృష్ణుని ఆదేశములను పాటించక యాదవులు మద్యము త్రాగి నశించిరి. అప్పుడప్పుడు వచ్చి కనిపించు కృష్ణ పరమాత్మ ఆజ్ఞలను పాండవులు ఆచరించిరి. ఐతే మానావమానములకు భగవంతుడు అతీతుడు గదా! అన్నచో, భక్తులు చేయు నిర్లక్ష్యము వలన స్వామికి ఎట్టి నష్టము లేదు. భక్తులకే నష్టము కలిగించినది. భక్తుల యొక్క నష్టము, భక్తులకు కలిగించు బాధ కన్నను, కరుణామయుడైన పరమాత్మకే ఎక్కువ బాధకలిగిస్తుంది. కావున భక్తుల శ్రేయస్సు కొరకే నిరంతర దర్శనము మంచిదికాదని ఇట్లు చేయుట జరుగుచున్నది. ఇక సాకారవాదులలో రెండుకిలోల లోభమున్న వారు మరియు ఒకకిలో లోభమున్న వారు విష్ణు శివాది రూపములను లేక శిరిడి సాయి రూపమును విగ్రహములుగా పటములుగా పూజించుచున్నారు. ఈ ఆరాధనలో ధూపదీపాదులకు స్వల్పమైన ఖర్చు మాత్రమే అగుచున్నది. అంతే కాక విగ్రహము వద్ద పెట్టిన దీపము యొక్క కాంతి ఆ గది లోనికి ప్రవేశించి మనకు దీపముగా కూడా సాయపడుచున్నది కదా. సుగంధ ధూపమును మనమే ఆఘ్రాణించుచున్నాము గదా. కనుక నష్టము లేదు. ఇందులో ముఖ్యముగా పెట్టిన నైవేద్యము పటములు స్వీకరించుట లేదు. కనుక ఖర్చు తగ్గుతున్నది. ఇక అరకిలో లోభమున్న వాడు ప్రత్యక్ష నరాకారమును విశ్వసించి ఆయనకు నైవేద్యము అర్పించి వ్యక్తిగత సేవలో పాల్గోనుచున్నాడు. ఆ అరకిలో లోభము కూడ పూర్ణముగ నశించిన వాడు స్వామి యొక్క కార్యములో పాల్గోని జ్ఞాన భక్తి ప్రచారసేవలో తాను కష్టించి ఆర్జించిన ధనములో ఎక్కువ భాగము వ్యయము చేయుచున్నాడు. నైవేద్యసేవ కన్నను ఈ సేవలో ఖర్చు ఎక్కవ గదా. కావున ఇట్లు అసూయ లోభముల యొక్క భిన్న ప్రమాణముల యొక్క నృత్యమునే భిన్న మతములు. ఐతే ఈ అసూయ లోభములనను మానవుడు అంగీకరించడు. వాని అంతరాత్మ తెలిసియున్ననూ బహిరంగముగా అంగీకరించడు. అవి బయిటపడి అంగీకరించనిచో తన అహంకారము దెబ్బతిను చున్నది. మానవుని యొక్క అసూయను పట్టియే స్వామి యొక్క దశవతారములున్నవి. "ప్రజ్ఞానం బ్రహ్మ" - బ్రహ్మము జీవుడుగా వచ్చును. కాని ఆ జీవుడు భూమిపై కనిపించరాదు. ఇది పదికిలోల అసూయ. కావుననే స్వామి భూమి మీద కనిపించక జలములో మత్స్య రూపములో అవతరించినాడు. ఒక కిలో అసూయ తగ్గగా, అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చు కూర్మావతారము ఎత్తినాడు. మరియొక కిలో అసూయ తగ్గగనే ఎప్పుడు భూమిపై నుండు వరాహవతారము ఎత్తినాడు. భూమిపై నిత్యము కనిపించుచున్నను సాటి నరాకారమును అంగీకరించని స్ధితిలోనే యున్నాడు. వానికి మరియొక కిలో అసూయ తగ్గినది. పూర్తి నరాకారమును అంగీకరించలేడు.

నరాకారములో ముఖము ప్రధానము. కావున పరమాత్మ నరసింహ ముఖమును ప్రదర్శించినారు. తరువాత వానిలో మరియొక కిలో అసూయ తగ్గినది. పూర్ణ నరాకారమును అంగీకరించినాడు కాని తన కన్న అధముడుగా యుండవలెను. స్వామి పూర్ణ నరాకారముగా వామనుడుగా వచ్చినాడు. వామనుడు అనగా పొట్టివాడు అని కాదు. ఒక మానవుడు ఉచ్చదశలోకి పోయినప్పుడు ఎంత ఎక్కువకు ఎదిగినాడందుము. అనగా 7 అడుగులు పెరిగినాడని అర్ధము కాదు. ఈ స్ధితిలో జీవుడు బలియను దానవునిగా చెప్పబడినాడు. బలి అనగా అహంకారి అని అర్ధము. భగవంతుని చేయి క్రింద వుండి తన చేయి పైన ఉండు స్ధితిని కోరుకున్నాడు. కావుననే వామనుడుగా వచ్చినాడు. అనగా అధముడుగా వచ్చి స్వామి క్రమక్రమముగా విజృభించింనాడు. అనగా ఎత్తు పెరుగుట కాదు. తన యొక్క పరమాత్మ తత్త్వమును ప్రకటించినాడు. ఒక పదము చేత ఆకాశమును మరియొక పదము చేత భూమిని ఆక్రమించినాడు. ఇక్కడ పదము అనగా శబ్ధము, వాక్కు, బోధ. అనగా తన బోధ చేత ఆకాశమునాశ్రయించుట అనగా ఉత్తమ సాధకులను బోధ ద్వారా ఆక్రమించినాడు. మద్యములగు భూలోక స్ధాయిని కూడా బోధచే ఆక్రమించి ఉద్దరించినాడు. ఇక అధములు అనగా పాతాళము మిగిలినది. నేను అధమ స్ధితిలో వచ్చి ఎంత ఉచ్చ స్ధితికి ఎదిగినాడొ చూపుటకు బలి తలలోకి బోధ ద్వారా జ్ఞానము నెక్కించినాడు. మూడవ పదమును బలి శిరస్సుపై యుంచుట ఇదియే. బలి ఆట్టి అధమ స్ధితిలో ఉంచి తన అహంకారమును నిర్మూలించమని ప్రార్ధించినాడు. ఇదే బలి పాతాళమునకు త్రొక్కపడుట. అనగా బలి అహంకారమును వదలి అధమ స్ధితిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. నిన్ను నీవు ఎంత తగ్గించు కొందువో అంత హెచ్చింపబడుదువు అని విదేశములో అవతరించినపుడు శ్రీ దత్తుని వాణి గదా. కావున బలి ఎంత హెచ్చింపబడినాడు అనగా ఆ బలికి తాను దాసుడై స్వామి గేటు కాపరిగ నిలబడినాడు. అనగా వామనుడుగా ఉన్నవాడు ఎవడైనను తప్పక త్రివిక్రముడగును. కావున అహంకారము ఎంత నిర్మూలించుకున్న అంత ఉచ్చస్ధితి లభించును. ఈ స్ధితిలో మానవుడు పరమాత్మను ప్రశ్నించినాడు. స్వామీ! గర్భములో ఏర్పడిన ఒక శిశు స్వరూపమును తాము ఆవేశించి అవతరించి పూర్ణావతారముగ ఉన్నారు. అట్లు కాక తమ భక్తుడగు ఒక మానవుని ఆవేశించినపుడు అతడు కూడ అవతారము కావచ్చును గదా. ఒక లోహపు తీగె నిర్మించబడగనే దానిని లైటుకు బిగించి విద్యుత్తును పంపినట్లు ఎట్లు విద్యుత్తీగె అగుచున్నదా. అట్లే లోహపు తీగె నిర్మించబడిన కొంత కాలము తరువాత దానిని బిగించి, విద్యుత్తును పంపినచో అదియును విద్యుత్తీగె అగును కదా అని ఈ ప్రశ్నను నారదుడు వేసినాడు.

"తన్మయాహితే" అను భక్తి సూత్రమున భక్తుని గూడ పరమేశ్వరుడు ఆవేశించును. కావుననే ఒక ఋషి కుమారుడగు పరశురాముని స్వామి ఆవేశించి వ్యాపించినాడు. అచ్చట స్వామి విష్ణువు అనబడినాడు. విష్ణువు అనగా వ్యాపించువాడు అని అర్ధము. పరశురాముడు కూడా అవతారములలో నిలచినాడు. కాని అహంకరించి గర్వభంగము పొందినాడు కారణమేమి? పరశురామునిలో శరీరము మాత్రమే కాక అనేక జన్మల సంస్కారముల సమూహమైన విశిష్టమైన ఒక జీవ స్వరూపమున్నది. కావున పరశురామునిలో శరీరము, జీవుడు, దేవుడు అను ముగ్గురున్నారు. దేవుడు చేసిన పనిని జీవుడు తాను చేసితినని అహంకరించినాడు. కావున జీవుడు అద్వైత కైవల్యమును పొందినచో వచ్చు ప్రమాదమిది. కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టిన వెనుకటి గుణమేల మారును? కావున జీవుడు అద్వైత కైవల్యమును కోరవద్దని ఉపదేశించుచు దాస భావములో ఉన్న జీవుడు అద్వైత కైవల్యమున కన్న అధికస్ధితిని సాధించవచ్చునని ఉపదేశించుచూ రామావతారమున దైవశక్తులను దాసుడైన హనుమంతున కిచ్చి తాను ఆ దైవశక్తులను లేకయుండి తన కన్న అధిక స్ధానమున దాసుని నిలిపి చూపెట్టినాడు. పరశురాముడు స్వామి కైవల్యమును కోరి తనను తాను హెచ్చించుకున్నాడు. కనక తగ్గించబడినాడు. హనమమంతుడు దాస భావమున తనను తాను తగ్గించుకున్నాడు. కనుకనే రామాంజనేయ యుద్ధమున రామునినే ఓడించగలిగినాడు. ఇది జీవులకు స్వామి ఇచ్చిన ఉపదేశము. రామావతారమున కౌసల్యా గర్భమున చేతనమైన శరీర పిండము ఏర్పడినది. ఈ శరీర పిండములో అనేక జన్మ సంస్కార వాసనా రూపమైన విశిష్ట జీవుడు లేడు. కేవలము సామాన్య చైతన్యమైన జీవస్వరూపము ఉన్నది. ఈ సామాన్య చైతన్యము సామాన్య జీవస్వరూపమే అనవచ్చునే తప్ప విశిష్ట చైతన్య స్వరూపమనరాదు. ఈ సామాన్య చైతన్య స్వరూపములో కేవలములో చైతన్యము ఎట్టి మలినములు లేని శుద్ద జలము వలెనుండును. దీనిలో జీవుని యొక్క పూర్వకర్మ వాసనా గుణములు ఉండవు. ఈ చైతన్యములో కేవలము వంశ లక్షణములు మాత్రమే ఉండును. ఈ సామాన్య చైతన్యము శుక్రము- రేతస్సు యొక్క సంయూగము చేత ఏర్పడు గర్భస్ధ శిశు పిండములో ఉండును. బ్రహ్మసూత్రములలో శ్రుతి ప్రమాణముగా రేతస్సు ద్వారా జీవుడు పిండము లోనికి ప్రవేశించు చున్నట్లు చెప్పబడుచున్నది. కాని కొందరు యోగి శ్రేష్టులు మూడవ మాసమున గర్భస్ధ శిశు పిండము నందు జీవుడు ప్రవేశించు చున్నాడని చెప్పుచున్నారు. ఈ ప్రవేశించు జీవుడు పూర్వకర్మ వాసనా జీవరాశి యగు విశిష్ట జీవుడు. ఈ విశష్ట జీవుడు పై లోకమములలో పుణ్య పాప కర్మల ఫలములను అనుభవించి కర్మ శేషముతో అనగా కొంచెము ముగిలిన పాపము పుణ్యములతో ఈ లోకమునకు వాయుమండల మేఘమండలముల ద్వారా, వర్షము ద్వారా భూమిలోకి ప్రవేశించి, మొక్క ద్వారా దాని గింజల ద్వారా పురుషుని రేతస్సు ద్వారా స్త్రీ గర్భములోనికి ప్రవేశించుటయో లేక మూడవ మాసమున ఆ ధ్యానపు గింజను భుజించిన గర్భవతి యగు స్త్రీ గర్భము లోనికి ప్రవేశించుటయో జరుగుచున్నది. ఏ మతమైనను మొత్తము మీద విశిష్ట జీవుడు గర్భస్ధ శిశు పిండములోనికి ప్రవేశించుచున్నాడు. అయితే విశిష్ట జీవుడు ప్రవేశించక ముందు ఆ శిశు పిండము అచేతనమైన శరీరముతోను కేవలము వంశ లక్షణములు గల శుద్ద చైతన్యమయమైన సామాన్య జీవునితోను కలసి యున్నది. ఈ సామాన్య జీవ స్వరూపమే విజ్ఞాన శాస్త్రవేత్తలకు అందుచున్నది. విశిష్ట జీవ స్వరూపమను ఏ మానవుడు దర్శించజాలడు. అని గీతలో ఇట్లు చెప్పుచున్నది. "ఉత్‌క్రామంతం స్ధతం వాపి భుంజానంవా గుణాన్వితం విమూఢానాను పశ్చంతి పశ్చంతి జ్ఞాన చక్షుసః". అనగా, దీని అర్ధము ఈ విశిష్ట జీవుడు గర్భములోనికి ప్రవేశించుచున్నప్పుడు గానీ, శరీరము వదలి పోవుచున్నప్పుడు గానీ, కర్మఫల వాసనా గుణ స్వరూపుడైన ఈ జీవుని ఇతర జీవులు యెవ్వరునూ ఎట్టి ప్రయత్నము చేతనూ చూడలేరు. కేవలము యోగీశ్వరుని యొక్క యోగ దృష్టికే కనపడును. కావున విజ్ఞాన శాస్త్రవేతేలు పిండములో చూచుచున్నది వంశ లక్షణములకు సంభందించిన జీన్స్‌ కలల సామాన్య జీవస్వరూపమే. కావున నేటి జీన్స్‌ సిద్ధాంతము ప్రకారము విజ్ఞాన శాస్త్రవేత్తలు మార్చగలిగినది కేవలము వంశానుగతములైన గుణములు మాత్రమే. పూర్వ కర్మ వాసనా గుణ స్వరూపుడైనన జీవుడు కనిపించడు కావున ఆ పూర్వ జన్మ కర్మ వాసనా గుణములు కూడా మానవుల భౌతిక దృష్టికి గోచరించవు. కావున విశిష్ట జీవుని యొక్క గుణములను మానవుడు మార్చుట అసంభవము. ఈ సామాన్య జీవ స్వరూపములో కూడా కేవలము వంశానుగత గుణములు మాత్రమే మానవుడు మార్చగలడే తప్ప ఆ గుణములకు ఆధారమైన శుద్ధ చైతన్యమును సృష్టించలేకున్నారు. అచేతనములగు పదార్ధముల నుండి చైతన్యమును మీరు పుట్టించగలరా? మృత కళేబరములో చైతన్యము తెప్పించగలరా?

ప్రశ్న:- "మేము విశిష్ట జీవుని అంగీకరించము. కనపడని దానిని ఒప్పుకొనము. కావున సామాన్య జీవుని మాత్రమే అంగీకరించెదము".
సమాధానము:- "సరే అట్లే కానిండు. సామాన్య జీవ స్వరూపమైన చైతన్యమును మీరు ఏల సృష్టించలేకున్నారు? cloning అను ప్రక్రియలో చేతనమైన పదార్ధము నుండి చైతన్యమయమైన జీవుని సృష్టంచగలరే తప్ప అదే చేతన పదార్ధములోని మూలకముల యొక్క పరమాణువులన్నింటినీ అనగా కార్బన్‌, హైడ్రోజిన్‌, ఆక్సిజన్‌, నైట్రోజన్‌ మొదలగు మూలకములైన పదార్ధములను మీకు ఇచ్చెదము. వాటి నుండి జీవసృష్టి చేయగలరా? అనగా మీకు జీవ కణములోని మూలకముల పరమాణువులన్నియునూ తెలియును. ఆ పరమాణువులను కలిపి ఈ జీవకణములలో నున్న సమ్మేళనములనన్నింటినీ తయారు చేయగలరు. ఆ సమ్మేళనమే తప్ప జీవకణములో మరియొకటి లేదని మీరు అనుచున్నారు. ఇదే నిజమైనచో ఆ సమ్మేళనముతో మీరు ఏల సృష్టించలేకున్నారు? మీకు టి.వి ఇచ్చినాము. టి.విని విడదీసి దానిలోని భాగముల న్న్నింటినీ మీరు పరిశిలించినారు. పని చేయుచున్న టి.విలో విద్యుత్తు కూడా ఒక భాగమే. మీరు టి.వి భాగములను విడివిడిగా ద్రవ్య పదార్ధముల నుండి తయారు చేయగలుగు చున్నారు. మరియు టి.విని పని చేయించగలరు. విద్యుత్‌ని గూడా నీటి నుండియో, బొగ్గు నుండియో, అణు reactors నుండియో సృష్టించ గలుగుచున్నారు. కావున టి.వి భాగముల నన్నింటినీ విద్యుత్తుతో సహ, సృష్టించి మరల వాటి సమావేశపరచినప్పుడు టి.వి పని చేయుచున్నది. జీవకణములో అన్ని సమ్మేళనములనూ సృష్టించి మీరు సృష్టించిన జీవకణమును పని చేయించగలుగు శక్తియగు చైతన్యమును మీరేల సృష్టించలేకున్నారు? విద్యుత్తు మీకు గోచరించినది గాన మీరు సృష్టించగలిగినారు. ఈ చైతన్యమే జీవుడు అందురు. ఈ జీవుడు ఏ మానవునకునూ గోచరించడు కేవలము యోగీశ్వరుని దృష్టికే గోచరించును అని గీతా శ్లోకము ఇదియే చెప్పుచున్నది.
ప్రశ్న:- మేము జీవ సృష్టిని చేయలేము. అంగీకరింతుము. కాని జీవకణములలో నున్న డి.ఎన్‌.ఎ, అర్‌.ఎన్‌.ఎ అణువులను సృష్టంచి ఒక జీవునిలో దుర్గుణములు లేకుండా చేసి, ఆ జీవుడు కేవలము సత్కర్మలే చేయునట్లు మేము చేయగలము. బుద్ధి యొక్క గుణములను అనుసరించియే కర్మలు చేయుట జరుగును. కావున ఒక మానవుడు జన్మించినపుడు వానిలో నున్న పుణ్యకర్మ శేషము వాని చేత పుణ్యకర్మలను వానిలోని పాపకర్మ శేషములు వానిచేత పాపకర్మలను చేయించును అన్న మీ కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేకము చేయగలము. అనగా వానిలో కృత్రిమ జీన్స్‌ ద్వారా దుర్గుణములు తొలగించి అన్నీ సద్గుణములే ఉండునట్లు చేయగలము. అప్పుడు వాడు కేవలము పుణ్యకర్మలనే చేయును. కావున మీ కర్మ సిద్ధాంతమునకు భంగము కలుగును.
సమాధానము:- మీకు కనిపించని చైతన్యము అగు విశిష్ట జీవ స్వరూపము మీరు తయారు చేయలేక పోయినను, ఉన్నది అని మీరు అంగీకరించినారు కదా. మీరు సామాన్య జీవ స్వరూపములో నున్న జీవ స్వరూపమును మార్చగలరే కాని మీరు తయారు చేయలేని, ఉన్నది అని మీరు అంగీకరించక తప్పని, విశిష్ట జీవ స్వరూపములలోని దుర్గుణములు మీరు ఎట్లు మార్చగలరు? ఒకవేళ మీరు సామాన్య జీవునిలో అన్ని సద్గుణములు ప్రవేశింపజేసి ఈ భూలోకమున వాని చేత సత్కర్మలే చేయించినారు అనుకొనుడు. ఇట్లు చేయించుటకు మీరు జీన్స్ ను మార్చనక్కరలేదు. ఒక మానవుని వెంట అహోరాత్రములు పోలీసులు కాపలా ఉంచి వాడు ఎట్టి దుష్కర్మలను కూడా చేయించకుండా ఉండవచ్చును కదా? ఎట్లు అయిననూ, వాని చేత జీవిత కాలమంతయు సత్కర్మలన్నియునూ మా విశిష్ట జీవ స్వరూపమలల సద్గుణముల యొక్క ప్రభావమే. ఇక విశిష్ట జీవ స్వరూపములలో నున్న దుర్గుణముల ప్రభావముల చేత దుష్కర్మలను వాడు ఈ కర్మలోకమగు భూలోకమున చేయలేదు కదా. మరణించిన తర్వాత పై భోగలోకములలో ఫలముల అనుభవముండునే తప్ప కర్మ ఉండదు కదా. మరి విశిష్ట జీవస్వరూపములో పాత కర్మశేషము ఉన్నవన్నారు కదా. అనగా దుర్గుణములున్నవి కదా? కావున దుష్కర్మలను చేయవలెను కదా. దానిని మేము చేయ నీయలేదు. కావున కర్మ సిద్ధాంతము భంగమైనది? మానవజన్మ మిశ్రమ కర్మఫల స్వరూపము. అనగా సద్గుణ దుర్గుణ శేష స్వరూపమైన జీవుడే మానవజన్మను ఎత్తును. కేవల సద్గుణ స్వరూపుడు దేవ జన్మలనెత్తును. కేవల దుర్గుణ శేషస్వరూపుడు రాక్షస జన్మలనెత్తును. విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రయోగములు కేవలము మానవుని పైనే జరుగుచున్నవి. దీనికి సమాధనమే కర్మలోకమగు భూలోకము నాలుగు అవాంతర లోకములుగా విజభింపబడి ఉన్నది. క్రింద మొదటి అవాంతర లోకము మర్త్యలోకము. దీని పైనున్న అవాంతర లోకములు వరుసగా ప్రేత, నరక, పితృ లోకములు. మరణించగనే మానవుడు ప్రేతలోకమున కేగుచున్నాడు. ఈ లోకములో మానవుని కర్మల విచారణ జరుగును. పాప కర్మలకు నరకలోకము, మధ్య కర్మలకు పితృలోకము, ఉత్తమ కర్మలకు భూలోకమునకు పైనున్న జ్యోతిర్లోక, స్వర్గలోకములు లభించుచున్నవి. ఇచ్చట కర్మలోకము అనగా భూలోకము యొక్క మొదటి అవాంతర లోకమగు కేవలము మర్త్యలోకమే. ఈ మర్త్యలోకమున మాత్రమే కర్ము చేయవీలగును. మీరు పొరపాటు బడినది ఎచ్చట అనగా మానవుడు మరణించగానే ప్రేత రూపమును ధరించుట సత్యమే కాని పదియవ దినమున "ఇతః పరౌ ప్రేతశబ్ధం నాస్తి" అని అన్నప్పుడు ఆ ప్రేత రూపుడు వెంటనే కర్మలోకమగు మర్త్యలోకమును దాటి ప్రేతలోకమునకు పోనవసరము లేదు. ఆ జీవుడు ప్రేత రూపముతోనే మర్త్యలోకమున అనగా కర్మలోకమున ఉండవచ్చును. కావున ఈ కర్మలోకముననే ప్రేతస్వరూపుడైన పిశాచ రూపము వానిలోనున్న దుర్గుణముల ప్రేరణ చేత దుష్కర్మములనే చేయును. కావున జీవుడు మిశ్రమ గుణస్వరూపుడై సత్కర్మములనూ దుష్కర్మములనూ ఈ లోకముననే చేసి భోగలోకములకు పోవును. కావున మీ జీన్స్‌ సిద్ధాంతము మానవుడు బ్రతికి ఉన్నంత వరకే తప్ప మానవ దేహము దహనమయిన తరువాత పిశాచ రూపమున పనిచేయదు. పిశాచములు ఉన్నట్లు ప్రామాణ్యము అనేక దేశములలో నిరూపితమగుచున్నది గదా! కావున విజ్ఞాన శాస్త్రవేత్తలు దైవశాసన నియమితమైన కర్మ సిద్ధాంతమును భంగము చేయజాలరు. ఇప్పుడు అసలు ప్రకరణములోకి వచ్చెదము గాక. అవతరించిన రామునిలో అచేతనమైన శరీరము ఉన్నది. పూర్వకర్మ వాసనములు అను మలినములు లేని శుద్ద జల సమానమైన శుద్ద చైతన్య స్వరూపమైన గర్భస్ధ శిశు పిండ ఆవిర్భావ సమయముననే ఏర్పడిన సామాన్య జీవ స్వరూపము ఉన్నది. ఇట్లు శరీరమను ప్రకృతియు సామాన్య జీవుడను పురుషుడునూ ఉన్నారు. ఈ రెండింటిలోనికి పురుషోత్తముడైన పరమాత్మ ప్రవేశించి, వ్యాపించి ఉన్నారు. ఇట్లు ప్రకృతి, జీవ, ఈశ్వర తత్త్వములు మూడునూ ఉన్నవి. ఇచ్చట పూర్వకర్మ వాననా స్వరూపమైన విశిష్ట జీవుడు లేడు. కొందరి మతమున గుణరహితమైన ఈ శుద్ద చైతన్యము ప్రకృతి లోనికే చేతన అనుపేరున చేరుతున్నది. దీనిని పరాప్రకృతి అనుచున్నారు. "సంఘాతః చేతనా ధృతిః" అను గీతా శ్లోకము ప్రకారముగా చేతన ప్రకృతి రూపములలోనే చేరుచున్నది. అప్పుడు శరీరమూ, చేతనయూ కలసి ప్రకృతి అనబడుచున్నది. అప్పుడు పురుషోత్తముడగు పరమాత్మయే పురుషుడనబడుచున్నాడు. ఈ మతము ప్రకారముగా రామావతారము ప్రకృతి, పురుష మిళితమై రెండు తత్త్వములతోనే ఉన్నది. ఇక రామావతారము కన్నా భిన్నమైన ఒక మానవుని గూర్చి విచారించెదము. గర్భస్ధ శిశు పిండములో అచేతనమైన శరీరమున్నది. సామాన్య జీవుడనబడు చేతనయూ ఉన్నది. పూర్వకర్మ వాసనా గుణ స్వరూపుడగు విశిష్ట జీవుడూ ఉన్నాడు. సామాన్య జీవుని విశిష్ట జీవునితో చేర్చి, జీవుడన్నచో శరీరమను ప్రకృతి జీవుడనబడు పురుషుడూ ఉన్నారు. సామాన్య జీవుని చేతనయను పేరుతో ప్రకృతిలోకి చేర్చినను ప్రకృతి పురుషులే ఉన్నారు. కావున సరిగా విచారణ చేయలేని వారు సామాన్య మానవునులోను రామావతారములోను ప్రకృతి పురుషులిరువురే ఉన్నారని భావించుచున్నారు. కానీ విచారణ చేసినచో రామావతారములో ఉన్న తత్త్వములు ప్రకృతి పురుషులను రెండే అయినప్పటికిన్ని ఆ రెండింటి యొక్క స్వరూపములు వేరుగా ఉన్నవి. రామావతారములో ఉన్నవి ఒకటి శరీరము, రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు, మూడు పరమాత్మ. సామాన్య మానవునిలో ఉన్నవి.

ఒకటి శరీరము, రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు, మూడు కర్మశేషగుణమైన విశష్ట జీవుడు. మరల అక్కడా మూడే ఇక్కడా మూడే కనుక సమానమనరాదు. కాని అక్కడున్న మూడు వేరు. ఇక్కడున్న మూడు వేరు. కాకపోయినచో ఒకటి శరీరము .రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు ఇరువురిలో సమానముగా ఉన్నారు. కాని సామాన్య మానవునిలో కర్మశేష స్వరూపుడైన జీవుడు ఉన్నాడు. రామునిలో ఆ విశిష్ట జీవునికి బదులు పరమాత్మ ఉన్నాడు. కావున ప్రకృతి , పురుష, పురుషోత్తమ శబ్ధముల యొక్క అర్ధములను సంకలీకృతము చేసి జీవునిలోను ఈశ్వరునిలోను అభేదములు శబ్ధార్ధముల నృత్యము చేత ఊహాత్మకముగా సాగించి అద్వైత పండితులు జీవుడే దేవుడనుచున్నారు. శంకర భాష్యమును అపార్ధము చేసినారు. శంకరులు చెప్పిన అద్వైతము కేవలము అవతార పురషుని విషయములోనే. భాష్యమును అపార్ధము చేసుకొని "నేను దేవుడనే" అని భావించుచున్న శిష్యులను మరల భాష్యము చెప్పి దిద్ద దలచుకొనలేదు. ఏలననగా మరల రెండవ భా్య్యమును అపార్ధము చేసుకొనుదురు. కావున అపార్ధము రాకుండా ఉండుటకు ఒక క్రియ ద్వారా బోధను చేసినాడు. ప్రతి జీవుడూ బ్రహ్మమే కావున తాము బ్రహ్మమే అని భావించుచున్న శిష్యులను కరిగిన సీసమును తాను త్రాగి వారునూ బ్రహ్మమే కావున వారిని కూడా త్రాగమన్నాడు. ఇది భాష్యము కాదు. ఆచరణము. కావున దీనిని ఇంక వక్రీకరణము చేయు అవకాశము లేనందున శిష్యులు సత్యమును తెలుసుకుని దేవుడు జీవుడుగా అవతరించునే తప్ప జీవుడు దేవుడు కాడని తెలుసుకుని దేవుడే జీవుడైన శంకరులకు దాసోహం అని పాదములపై పడినారు. కాని తరువాత అద్వైత మత పండితులు ఈ సన్నివేశమును ఎప్పుడును స్మరించరు. ఏలననగా అది వక్రార్ధమును చేయుటకు వీలుకానిది. అందరాని దానిని అందినట్లు ఊహించికుని సంతసించుట మానవునికి ఉన్న ఒక బలహీనత. కావున "సోహం" అను మార్గములో అద్వైత కైవల్యమును కోరి శంకరుల శిష్యుల వలె పరాభవము పొందనేల? ఇట్టి అద్వైత కైవల్యమునే కోరి, పొంది నిలుపుకొనలేక పరాభవమును పొందినవాడు పరశురాముడు. పరశురాముడు ఒక సామాన్య మానవుడు. ఆయనలో శరీరము, రెండు శుద్ద చైతన్యమైన సామాన్య జీవుడు, మూడు పూర్వకర్మ వాసనా ఫలమైన విశిష్ట జీవుడు. ఈ ఋషి కుమారుని లోనికి పరమాత్మ ప్రవేశించి వ్యాపించినాడు. ఇప్పుడు పరశురాముడిలో పై మూడింటితో పాటు నాల్గవ వాడగు పరమాత్మ ఉన్నాడు.

ఆ పరమాత్మయే సకల క్షత్రియ సంహారము చేసినాడు. కార్తవీర్యుని వధించినాడు. కాని విశిష్ట జీవునిలో పూర్వ వాసనా గుణములు ఉన్నవి కావున ఆ విశిష్ట జీవుని గుణమగు అహంకారము వెలిగినది. ఈ మహిమనంతయు తానే చేసితినని అహంకరించినాడు. దీనితో రాముని చేత పరాభవించబడినాడి సత్యమును తెలుసుకుని తానింకనూ సాధన చేయవలెనని గ్రహించి తపస్సు చేయ నారంభించినాడు. ఇట్లు రామావతారము మానవునకు అద్వైత కైవల్యము వలదని బోధించి శరణాగతి ప్రపత్తి మార్గములో హనుమంతునకు సృష్టి స్ధితి లయాధికార పదవిని ఇచ్చి నిజమైన పరబ్రహ్మముగా చేసినాడు. కాని రామావతారమున ఎట్టి సిద్ధులు ప్రదర్శించబడక సామాన్య మానవునితో సమానమైన స్ధితిలోనే ఉండెను. అప్పటి మానవుడు తనతో సమానుని అంగీకరించినారే తప్ప సాటి మానవ రూపమును తనకన్నా అధికముగా భావించు స్ధితికి రాలేదు. కావున సిద్దులు ప్రదర్శించి రాముడు మానవత్వమును మించిన దైవత్వమును చూపించలేదు. సిద్ధులను దైవత్వమును ఒక వానరమగు హనమమంతుని ద్వారా ప్రదర్శింపజేసినాడు. అది సాటి మానవుడు కానందున, కోతి అయినందున అంగీకరించిరి. క్రమముగా మానవుని అసూయ మరియొక కిలో తగ్గినది. సాటి మానవుని ఆధిక్యతను అంగీకరించు స్ధితికి మానవుడు వచ్చినాడు. అప్పుడు సాటి మానవునిగా కృష్ణావతారమున సిద్ధులను ప్రదర్శించి ఆధిక్యమును చూపించినాడు. కృష్ణావతారము తరువాత కలియుగారంభమున సిద్ధులే దైవత్వమని మానవుడు మరల భ్రమించినాడు. ఈ భ్రమను నివారించుటకు జ్ఞానము, కరుణ, శాంతి మొదలగు కల్యాణ గుణములే దైవత్వమని సిద్ధులు కేవలము భగవంతుని ఆభరణములేనని వాటిని పరమాత్మ నుండి పొంది రాక్షసాదులు కూడా ప్రదర్శింపగలరని బోధించుటకే, ఎట్టి మహిమలు చేయని కరుణా, శాంతి,జ్ఞానము త్యాగము మొదలగు కల్యాణ గుణములు గల బుద్ధావతారము వచ్చినది. ఈ విధముగా జ్ఞానానంద శాంతి కరుణాది గుణములు గల నరాకారమునే స్వామి నిరంతరము ఆవేశించి ఉండునని బోధించి జ్ఞాన బోధలు సమాప్తి చేసినారు. ఇంత బోధ చేసిననూ అసూయ, అహంకార, స్వార్ధములతో మారని జీవులను కల్కి అవతారములో ఖండించి వారిని శాశ్వతముగా పశుపక్ష్యాది జన్మలకు త్రోసి వేయుదురు. కావున విష్ణువు మత్స్యావతారమున చేపగా వచ్చినప్పుడు ప్రతి చేపయూ విష్ణువు కాదు. ప్రతి చేపయూ విష్ణువైనచో సాక్షాత్తు పరమహంసయే చేపను ఎట్లి భుజించెను? ప్రతి మానవుడు దేవుడే అయినచో గోపికలు పతి పుత్రాదులను త్యజించి బృందావనమునకేల వెళ్ళిరి? మీరా భర్త నేల వదిలెను? బుద్ధుడు భార్యా పుత్రులనేల త్యజించెను? పరమాత్మ కొరకు శంకరులు తల్లి నేల వదిలెను? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఏల ధిక్కరించెను? కావున అసూయా తత్త్వము పూర్తిగా అంతమొందిచు కున్న జీవుడు అనసూయ అగును. ఇందు స్త్రీ పురుష భేదము లేదు. అందరు జీవులునూ ప్రకృతి రూపులే. శరీరము అపరాప్రకృతి. జీవుడు పరాప్రకృతి. కావున సర్వ జీవులునూ స్త్రీలే. పురుష సూక్తము ప్రకారముగా స్వామి ఒక్కడే పురుషుడు. కావున ప్రతి జీవుడూ అసూయను పరిపూర్ణముగా తుడిచి చేసినచో అనసూయగా మారవచ్చును. అనసూయా గర్భముననే దత్తుడు ప్రవేశించెను. అనగా నీలో దత్తుడులీనమై తనను తాను దానము అనగా దత్తత చేసికొనును. అప్పుడు నీవు దత్త స్వరూపుడవై సాక్షాత్తు దత్తావతారము అగుదువు.

AT the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Wednesday, December 16, 2009

గోరంత సేవకు కొండత ఫల పధకము

పరమాత్మ నరావతారమున భూలోకమునకు వచ్చినపుడు ఆయన మానవుల భక్తికి పరవశించు చుండును. ఈ భక్తి మద్యమును సేవించి ఆ మైకములో వారు కోరిన వరములు ప్రసాదించుచుండును. ఎంత నిష్కామ భక్తిని కలిగియున్నను ఎప్పుడో ఒకప్పుడు మానవుని యొక్క నైజము బయిటపడక మానదు. "ఆ నైజమే స్వార్ధము" ఆ స్వార్ధముతో కోరు వరములతో ఒక్కొక్కసారి భగవంతునికే కాక ఆ కోరిన మానవునకే అనర్ధము వాటిల్లును. భస్మాసురుడు కోరిన వరమట్టిదియే కదా! దాని వలన స్వామికి ముప్పు వచ్చుటయే కాక, చివరకు వాడే నశించినాడు. కావున వాని తపస్సు వానినే నశింప చేసినది. మరియు స్వామి వరమునీయకుండా తిరస్కరించ వచ్చును గదా! కాని వాడు యిచ్చిన భక్తి మద్యము అను మైకముతో స్వామి బోళా శంకరుడైనాడు. కావున అవతరించుటకు ముందు కాలభైరవునకు గట్టిగా ఈ విధముగా శాసనములనిచ్చును. "నేను భూలోకమునకు పోయినపుడు చాలా ప్రమాదకరమైన మానవుల మధ్యకు వెళ్ళుచున్నాను. వారు అతి తెలివి గలవారు. వారి అతి తెలివి వలన ఆత్మవినాశనము, పర వినాశము, గురు వినాశము సంభవించును. వారు అతి తెలివి చేత భక్తసులభుడైన నా చేత భక్తి మధ్యమును త్రాగించి అంతములో వినాశకరములగు వరములను కోరును. కొందరు నిష్కామ కర్మసేవా భక్తియను మహాశక్తివంతమైన మధ్యమును నాచే త్రాగింతురు. అట్టి భక్తులు నిష్కామముగనే ఉందురు. కాని ఎప్పుడో ఒకప్పుడు వారి నైజగుణమగు స్వార్ధము విజృంభించును. కావున ఆట్టి సమయములలో నేను మైకము లోపడి ఇచ్చిన వరములను నిష్పలములగునట్లు చేయుము. అప్పుడు నేను నిన్ను దూషించి నీపై ఆగ్రహించెదను. ఆ సమయమున భయంకరమైన రవమును అనగా గర్జనము వేసి నన్ను నియమించుము. ఇదే కాల = ఆ సమయము నందు; భైరవ = భయంకరమైన రవమును చేయుట. కావున కాలభైరవుడు నీ పేరు కాదు. భాధ్యతకు ఆ పేరు. నీవు ఇట్లు చేయకున్నచో నేను తర్వాత పైకి వచ్చినపుడు నిన్ను ఈ పదవి నుండి తొలగించవలసి వచ్చును". ఈ విధముగా అవతార కార్యక్రమ మంతయును ఒక నిర్ధిష్టమైన స్వామి స్వయముగా రచించి ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే జరుగును. స్వామి శాసనానుసారముగా ఆ ప్రణాళికను నిర్దాక్షిణ్యముగా అవసరమైనచో అవతార పురుషుని సయితము గర్జించి నియమించుటయే కాలభైరవుని కర్తవ్యము. ఇది అంతయును స్వామి శాసనమే కావున స్వామి యొక్క స్వాతంత్రయమునకు, అధికారమునకు, ఎట్టి భంగము లేదు. అందువల్లనే స్వామి మధ్యపానము చేయుచున్న వానిగా దర్శన మిచ్చు చుండును. ఆ దర్శనములోని అంతరార్ధమిది. అయితే అంతయును నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారమే జరుగుచున్నది కదా. మనము అవతరించిన స్వామిని సేవించుట వ్యర్ధము. ప్రణాళికలో ఉన్నచో అది మనకు లభించియేతీరును. దానికి సేవ యొక్క అవసరము లేదుకదా. ప్రణాళికలో లేనిచో ఎంత సేవ చేసిననూ లభించదు. అప్పుడు సేవ అవసరము లేదుకదా! అన్న సంశయము వచ్చును. దీనికి సమాధానము ఏమి అనగా కాలభైరవుని ప్రణాళికలో ఎవరు ఎట్టి సేవను చేసినచో వారికి ఎట్టి ఫలమును ఎక్కడ ఎచ్చట వారి యొక్క నిజమైనన అవసరములకు అందచేయవలయును అని స్పష్టముగా వ్రాయబడియే యున్నది. కావున నీవు చేసిన సేవకు సరియైన ఫలమును పొందుట ప్రణాళికలోని అంశమే కావున నీ సేవ వ్యర్ధము కాదు. కాకున్నచో ఏ సేవకు ఎట్టి ఫలము? ఆ సేవ యొక్క విలువ ఎంత? ఆ సేవ యొక్క ఫలము ఎంత? మొదలగునవి నిర్ణయించి ఇచ్చినవే ప్రణాళికలో యున్నవి. వాటిని ఆ ప్రణాళిక ప్రకారము జీవులకు నిష్పక్షపాతముగా అందచేయు అధికారమును కాలభైరవుని చేతిలో స్వామి పెట్టియున్నారు. అనగా స్వామి చేత కొండంత ఫలమమును దానవ స్వభావము వలన మానవుడు కోరవచ్చును. భస్మాసురుడు కోరినది అదేకదా. వాడు చేసిన తపస్సు గోరంత. వాడు కోరిన వరము స్వామిని కుడ భస్మము చేయగల శక్తి కొండంత. భక్తి మద్యము యొక్క మైకములో స్వామి వరము ప్రసాదించినాడు. పోనీ దాని వలన వాడు ఏమైనను లాభపడినాడా లేదు లేదు. వాడే చివరకు అంతమైనాడు. కావున ఇట్టి సమయము లందు ఆ భక్తుని శ్రేయస్సు కొరకే కాలభైరవుని నియమాధికారము అవసరమా కాదా? కావున దీని వలన చిట్ట చివరకు ఆలోచించి చూచినచో ఇది జీవులకే ఉపకారమగుచున్నది.
అయితే గోరంత సేవకు కొండంత ఫలము లభించి ఆ ఫలము మనకే సద్విని యోగమునకు అవకాశము లేదా? ఇట్టి అవకాశము కూడా గలదు. నీవు గోరంత సేవను చేసి ఆ సేవకు ఎట్టి ఫలమును ఆశించకుము. నీవు చేసిన సేవయే నీ పురాకృత పుణ్యకర్మఫలమని భావించుము. ఫలమునకు మరియొక ఫలము ఉండదు. ఇట్టి భావముతో నీవు చేసిన సేవకు ఎట్టి ఫలమును కోరక నిస్వార్ధ భావముతో ఉందువేని నీ గోరంత సేవకు కొండంత ఫలము అనుగ్రహించబడును. అయితే దానిపై నీకు కోరిక లేనందున ఆ కొండంత ఫలమును నీ ఖాతాలో జమచేయబడినట్లు నీకు తెలియదు. ఈ జమ చేసినది నీకు తెలియదు. ఏలననగా నీ గోరంత సేవయను వంద రూపాయిలు నీవు స్వామికి దానముగా సమర్పించియున్నాను అనుకొనుచున్నావు. దానము చేసిన తర్వాత దానిని వడ్డీతో కలిపి నాకు యివ్వమని అడుగుట లేదుకదా. కావున నీవు గోరంత సేవకు గోరంత ఫలమును కూడా కోరుట లేదు. ఇప్పుడు ఈ కొండంత ఫలము నీకు తెలియకుండా కాలభైరవుని అధీనములో యున్నది. ఇది నీకు తెలియదు కాన నీవు అవసరము లేకున్ననూ దానిని తీసుకొని ఖర్చుపెట్టకొనవు. ఆ కొండంత ఫలము స్వామి అధీనములో కూడ ఉండదు. ఏలననగా నీవు స్వామికి భక్తిమద్యమనను త్రాగించి నీకు అనవసరము లేనప్పుడు స్వామిని ధనమును ఇమ్మని కోరగా స్వామి ఆ మైకమములో దాని నుండి తీసి ఇచ్చును. కావున ఆ కొండంత ఫలము నీకు తెలిసినను, లేక స్వామి ఆధీనములో యున్ననూ అనవసరముగా దుర్వినియోగమై వ్యర్ధమగును. కాలభైరవునిచే నీవు భక్తిమద్యమును త్రాగించలేవు. ఏలననగా కాలభైరవుడు చాలా కఠోర హృదయుడు. నీ మద్యము నీ ప్రాత్రలోనే యుండును. దానిని ఎట్టి పరిస్ధితులలోను అంటడు. కావున సర్వము స్వామి ఇచ్చానుసారమే కాలభైరవుని అధీనములో యున్నది. నీవు భక్తిని త్రాగించినను ప్రయోజనము లేదు. కాలభైరవుని చేత త్రాగించలేవు. కావున స్వామికి మస్కాకొట్టి ఆత్మవినాశకరమగు వరములను కోరుకొనుటను విరమించుకొనుము. ఆ సమయమున నీకు వరములు లాభకరముగనే తోచును. కాని అవి భస్మాసురునివలె నిన్నే అంతమొందించును. కావున ఎట్టి ఫలములను ఆశించక నీవు స్వామికి చేసిన సేవ నీ పుణ్యఫలమే అని భావించుచు నీ యధాశక్తి స్వామిని సేవించుటయే నిజమైన అత్యుత్తమ మార్గము.
దీనికి చక్కని ఊదాహరణము రాజసూయ యాగమున స్వామి వేలు తెగి రక్తము కారుచుండగా అవభృధస్నాతమైన ద్రౌపది అమంగళకరమైనను, అనర్ధకరమని తెలిసియును, తన పట్టుచీరెను చించి స్వామి వేలుకు కట్టినది. అష్టపత్నులు అచ్చట ఉన్ననను అట్లు చేయు సేవ వారికి స్పురించలేదు. "ఇది నాకే స్పురించి నేనే చేసితిననగా, ఇచ్చట ఎవరును చేయని నేను మాత్రమే చేసిన పూర్వపుణ్య తపస్సు యొక్క ఫలము" అని ద్రౌపది భావించిదే తప్ప , ఈ సేవకు ప్రతి ఫలముగా నా వేలు ఎప్పుడైనను ఇట్లు తెగినచో పరమాత్మ ఎవరినైనను ప్రేరేపించి నావ్రేలికి గుడ్డముక్క కట్టునట్లు చేయునులే అని అనుకొనలేదు. ఆమె అట్లు భావించి యున్నచో ఆ గుడ్డముక్కను వడ్డీతో కలిపినచో చక్రవడ్డీ యైనను ఒక చీరె మాత్రమే దుశ్శాసన వస్త్రాపహరణ సమయమున లభించి యుండును. దుశ్శాసనుడు ఆ లభించిన ఆ రెండవ చీరెను లాగినప్పుడు అమె దారుణ దుఃఖమునకు గురియై యుండెడిది. కాని ఆ మె స్వామి వ్రేలికి చుట్టిన గుడ్డముక్క తన యొక్క పుణ్యఫలమని భావించి ఆ ఫలమునకు మరియొక ఫలము ఉండదని నిశ్చయించినది కావున అసలు ఆ విషయమునే మరచిపోయినది. అందుకే వస్త్రాపహరణ సమయమున "స్వామీ నేను ఆనాడు మీ వేలుకు గుడ్డముక్క కట్టినాను నాకు ఇప్పుడు ఆ ఫలము నిమ్ము" అని ప్రార్ధించలేదు. ఏలననగా ఆనాడు ఆమె చేసినది కర్మయని భావించలేదు. కావుననే ప్రాణము మీదికి వచ్చినను ఆ కర్మకు ఫలమును యాచించలేదు. కావుననే ఆమె గోరంత సేవకు కొండంత ఫలముగా ఆమె పేరున జమ చేయబడినది. ఆమెకు నిజమైన అవసరము రాగానే ఆ కొండంత ఫలము ఆమెకి అందచేయబడినది. ఆ గుడ్డముక్కయే అక్షయమై అనంతమైన సంఖ్యలో చీరెలుగా మారినది. కావున ఓ దత్తసేవకులారా! మీరు ఈ " గోరంత సేవకు కొండంత ఫలము" అను పధకములో చేరండి తరించండి.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, December 10, 2009

ధర్మమా - భగవంతుడా ఏది ఎక్కువ?

సంసారమను ఈ దుకాణములో ధనము, తల్లితండ్రులు, భార్యాభర్తలు,సంతానము గురువు, బంధువులు మిత్రులు అను వస్తువులున్నవి. ఈ వస్తువులతో పాటు నరాకారమున వచ్చిన భగవంతుడను వస్తువు కూడ ఉన్నది. ఈ వస్తువులలో నీవు ఏ వస్తువుకు ఎక్కువ విలువ నిచ్చావు? అన్ని వస్తువుల కన్నను భగవంతునికే ఎక్కువ విలువ నిచ్చినప్పుడు ధర్మము అను మరియొక వస్తువు కూడ ఈ దుకాణములో కనపడును. భగవంతుడను వస్తువు లేనప్పుడు అన్ని వస్తువుల కన్ననూ, ధర్మమే ఎక్కువ విలువ గలిగినది. కాని భగవంతుడు అను వస్తువుతో ధర్మమను వస్తువు పోటీ పడగానే ఎవడు భవగంతునకే ఎక్కువ విలువ నిచ్చుచున్నాడో వాడే భక్తుడు అనబడును. ఆచరణాత్మకమైన క్రియలలో విలువ బయిటపడును. అతడే సత్యమైన మాటలలో విలువ బయిటపడదు. కావున భావమున స్వామి పై కేంద్రీకరించు ధ్యానములో కాని, భాష్పములు రాల్చుచు ఎంతో ఆవేశముగా భజనలను పాడుట కాని, లేక మంత్రములను జపించుటలో కాని భక్తి యొక్క విలువ బయిటపడదు. ఒక పతివ్రత సదా పాతివ్రత్యమును భావములలో, మాటలలో, పాటలలో ప్రకటించుచుండెను. ఆమె తన భర్తకు ఇచ్చిన విలువ తన ప్రాణముల కన్నను మిన్నగా ఉండెను. జయదేవుని మరణవార్త విని పద్మావతి వెంటనే ప్రాణములను విడచినది అను కధను అందరికి బోధించుచుండెను. ఈమె తనకు నిజముగా ఎంత విలువ నిచ్చినదో తెలుసుకొన కోరి ఒక పండగ నాడు ఆమె భర్త స్నానము చేసి వచ్చి భోజనమునకు ముందు కూర్చుని వెంటనే మరణించినట్లు నటించి పడిపోయెను. ఆమె శ్వాస పరీక్షించగా ఆ భర్త శ్వాసను బంధించెను. భర్త మరణించినాడని తేల్చుకున్నది. చేసిన పిండి వంటలు ఘుమ ఘుమలాడుచున్నవి. ఇప్పుడు ఏడ్చినచో అందరును వచ్చెదరు. అప్పుడు ఈ పిండి వంటలు తినుటకు వీలులేకపోవును. కావున వెంటనే తలుపులు బంధించి పిండి వంటలు శుభ్రముగా తిని చేతిని మూతిని శుభ్రముగా కడుకుని తలుపులు తెరచి "నా ప్రాణానాధా! నీ కొరకు ఎన్ని పిండి వంటలను చేసితిని. రుచి చూడకుండగనే పోయినావా? అని ఎలుగెత్తి ఎడ్చినది. అందరు చేరినారు. ఆమె అట్లే పదే పదే పల్కుచు ఎడ్చుండెను. అప్పుడు భర్త లేచి కూర్చొని ఎందుకు ఏడ్చుచున్నావు. నేను రుచి చూడకపోయిననూ, నీవు శుభ్రముగా తిన్నావుగదా అనెను. ఆమె యొక్క పతి భక్తి ఎంత వరకు సత్యమో అందరి ముందు తేలిపోయినది. కావున భక్తి ఆచరణములో నిరూపించబడినపుడే సత్యమైన భక్తి అగును. కావున నీవు భగవంతుని విలువను ఆచరణములో చూపించవలెను. ధ్యానము చేతగాని, ఉపన్యాసముల చేతగాని, పాటల చేతగాని, భక్తిని నిరూపించలేవు. అట్లే నమస్కారములు పెట్టునపుడు కూడా భక్తి నిరూపించబడదు. నిజముగా నీ విచ్చు విలువ సమయము వచ్చినప్పుడు నీ ఆచరణలో బయిటపడును. ఆచరణలో నిజముగా విలువ నిచ్చినప్పుడు పైన చెప్పిన వన్నియును సార్ధకములగును. ప్రాణము గల శరీరములో అవయవములు ఎట్లు కళకళ లాడుచుండునో అట్లే ఆచరణలో నిరూపితమైన సత్యభక్తి ఉన్నప్పుడు ధ్యానము, భజనలు మొదలగునవి అన్నియును సాధనలో సార్ధకమైన భాగములు అగును. నీవు స్వామికి యిచ్చు విలువ పరీక్షించుటకు ఎంతో చిన్న సన్నివేశము చాలును. ఒక ఋషి తపస్సు చేసుకొనుచున్నాడు. ఒక పిచ్చిభక్తుడు చింత చెట్టు క్రింద హరి భజన చేయు చున్నాడు. నారదుడు పైకి పోవుట ఇరువురును చూచినారు. మాకు ఎప్పటికి ముక్తి వచ్చునో కనుక్కొని రమ్మన్నాారు. స్వామితో మాట్లాడి కొన్ని దినములకు నారదుడు తిరిగి వచ్చుచున్నాడు. ఇరువురును తమతమ విషయముల కూర్చి అడిగిరి.

నారదుడు ఋషితో "నీకు ఇంకా నాలుగు జన్మలకు ముక్తి పొందుదువు" అని అన్నాడు. దానికి ఋషి ఇంక నాలుగు జన్మలా అని వాపోయునాడు. తరువాత పిచ్చి భక్తునితో "ఈ చింత చెట్టుకు ఎన్ని ఆకులున్నవో, అన్ని కోట్ల జన్మల తరువాత నీకు ముక్తి అని స్వామి చెప్పినాడని" అన్నాడు. వెంటనే ఆ భక్తుడు ఆనందముతో గంతులు వేయుచు నేను ఇంత త్వరగా స్వామిని చేరుదునా? ఇది స్వామి చెప్పినాడంటే స్వామి ఎంత కరుణామయుడు అని కేకలు పెట్టుచు ఎగురుతున్నాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక తేజస్సు ఆ భక్తుని పై పడినది. ఆ తేజస్సు నుండి స్వామి వాక్కు ఇట్లు వినిపించినది. "ఓ భక్తా! నీవు ఈ క్షణముననే స్వామిని చేరుచున్నావు. వెంటనే ఆ తేజస్సు ద్వారా ఆ భక్తుడు స్వామిని చేరినాడు. ఈ కధలో అంతరార్ధమేమి? నాలుగు జన్మలలో స్వామిని చేరుదువు అని ఋషికి చెప్పినపుడు ఇంత ఆలస్యమా అని తలచినాడు. అనగా భగవంతుని విలువను చాలా తక్కవగా అంచనావేసినాడు. అంతే కాదు ఆ మాట స్వామి చెప్పిన మాటయే అని వినియును, ఆ మాటకు విలువనీయక దానిని ఆక్షేపించినాడు. కాని ఆ పిచ్చి భక్తుడు అన్ని కోట్ల జన్మలలో స్వామిని పొందెదవు అన్నను అది చాలా స్వలకాలమని ఎందుకు భావించినాడు? అతడి దృష్టిలో భగవంతునకు ఎంతో విలువ యున్నది. అతడు స్వామి చెప్పినాడని విని "ఎంత కరుణ" అని ప్రశంసించినాడు. కావున అతడి సత్యమైన భక్తి ఆ ఒక్కమాటతో నిరూపితమైనది. అన్నము ఒక్క మెతుకు పట్టుకొనిన చాలును ఉడికినదా లేదా తెలుసుకొనవచ్చును. కావున దత్త పరీక్షలు ఎంతో సూక్ష్మముగా, సున్నితముగ, సుకుమారముగ యుండును.
సీతకు అగ్ని పరీక్ష వలె ఎదో భయంకరముగా ఉండునని తలచెదరు. ఒకనాడు వివేకానందుడు వచ్చు సమయమున పరమహంస తాను శయనించు మంచములోని నల్లులను చంపు చుండెను. ఇతర శిష్యులు కూడా వచ్చిరి. తత్త్వము తెలిసిన వివేకానందుడు మిన్నకుండెను. ఇతర శిష్యులు పరమహంసయే ఈ జీవహింస చేయుచున్నాడేమి? అని మనస్సులలో తలచిరి. వారి సంశయములను పోగొట్ట తలచి వివేకానందుడు "గురుదేవా! మీరే జీవహింసను చేయుచున్నారా? అని ప్రశ్నించెను. అప్పుడు పరమహంస ఇట్లు వచించెను. "నేను ఈ మంచములో శయనించి పరమాత్మను ధ్యానించు చుండును. అప్పుడు ఈ నల్లులు నన్ను కుట్టి నా ధ్యానమును భంగము కల్గించుచున్నవి. నాకు భగవంతునితో సమానము అహింస యను ధర్మము కూడా కాదు. దీని వలన పాపము వచ్చిననూ, నేను లెక్కచేయను. భగవంతుని ముందు నాకు ఏదియును ముఖ్యము కాదు. స్వామి కొరకు ధర్మమునైనను త్యజింతును అని వచించెను. శ్రార్ధము పెట్టునాడు బిచ్చము కూడా వేయరాదని సాంప్రదాయము. కాని స్వామి రాగానే సుమతి భోక్తలు తినక ముందే స్వామికి అర్పించెను. కావున స్వామికి ముందు ధర్మమును సహితము వదిలినది. కావుననే స్వామిచే అనుగ్రహించబడినది. ఒక జీవుడు ఇతర జీవులతో ప్రవర్తించు చున్నప్పుడు అధర్మమును చేయరాదు. ధర్మమునకే ఎక్కువ విలువ నీయవలెను. రాముడు తన అవతారములో మొదటి నుండియు చివర వరకును ఒక జీవుడు ఎట్లు ప్రవర్తించవలయునో ఆచరించి చూపెట్టినాడు. కావుననే వాలిని చెట్టు చాటున నుండి చంపినందుకు కృష్ణావతారమున ఫలముననుభవించినాడు. కాని కృష్ణావతారమున ఎన్ని అల్లరి పనులను చేసినను వాటి ఫలితములను ఆ అవతారములో కాని, తరువాత అవతారములలో కాని అనుభవించలేదు. శిఖండిని ముందుంచుకొని భీష్ముని చంపించినాడు. అసత్యము పలికించి ద్రోణుని వధింప చేసినాడు. మరి ఈ కర్మలకు ఫలమును ఏల అనుభవించలేదు. కారణము కృష్ణావతారములో తాను స్వామిగా వ్యవహరించినాడు. అనగా జీవుడు ఇతర జీవుల విషయములలో అధర్మము చేసినచో దాని ఫలమును అనుభవించియే తీరవలయును. కాని స్వామి విషయమున ధర్మాధర్మముల కన్ననూ స్వామి ఎక్కువ. జీవుల విషయమున జీవుల కన్ననూ ధర్మము గొప్పది. ధర్మరాజు శ్రార్ధమును పెట్టుచున్నాడు. మంత్ర పూర్వకముగా పిండము పెట్టక ముందే భీష్ముడు ప్రత్యక్షమై నాకు చాల ఆకలిగా ఉన్నది. ఆ పిండమును పెట్టమని చేయిచాచినాడు. ఇది పితృ యజ్ఞమునకు విరుద్ధము కావున కావున నేను పెట్టనని ధర్మజుడు నిరాకరింనాడు. ఇది సమ్మతమే. భీష్ముడు జీవుడు. జీవుని కన్నను ధర్మము గొప్పది. కాని ఋషులు యజ్ఞము చేయుచున్నప్పుడు హోమము చేయక ముందు కృష్ణుడు వచ్చి అదే మాటను అడిగినాడు. నిజముగా పితృ యజ్ఞము కన్నను దేవ యజ్ఞము గొప్పది. కాని ఋషి పత్నులు దేవ యజ్ఞము కన్నను స్వామి ఎక్కువని హోమము చేయుటకు ముందే యజ్ఞాన్నమును స్వామికి పెట్టినారు. దాని వలన వారు తరించి ముక్తులైనారు. సాక్షాత్తు శ్రీ దత్తుని మాతృ దేవతయుగు అనసూయ కూడా దత్త పరీక్షలో ఓడిపోయినది. ఆమెను పరీక్షించమని త్రిశక్తులు అసూయతో నారదుని ప్రేరణ వలన త్రిమూర్తులను పంపినారనుటలో కేవలము మానవుల కల్పనయే. పురాణములలో అనేక మంది వారి స్వంత కవిత్వములను శ్లోకములను దూర్చినారు. ఇట్టి శ్లోకములే ప్రక్షిప్తములు అనబడును. శ్రీ దత్తుడు తన త్రిమూర్తి స్వరూపములతో అనసూయ వద్దకు వెళ్ళి వివస్త్రయై అన్నమును వడ్డించమన్నాడు. సృష్టి అంతయు శ్రీ దత్త పరబ్రహ్మము యొక్క సంకల్ప మాత్రమై ఊహా స్వరూపమై యున్నప్పుడు ఆయనకు తెలియనిది ఈ సృష్టి యందు ఒక పరమాణువు కూడా లేదు. ఈ జ్ఞానమును కోల్పోయి సర్వ ధర్మముల కన్నను స్వామియే ఎక్కువ యను సత్యమును విస్మరించి వారలను పసిపాపలుగా చేసినది. ఆమె కోరిక ప్రకారము స్వామి తన సంకల్పముతో పసిపాపయైనాడు. ఆమె శక్తి వలన కాదు. సర్వ శక్తులును ఆయన శక్తులే. త్రిమూర్తులు ఓడిపోయినారని చెప్పుట అజ్ఞానము. ఓడిపోయినది త్రిమూర్తి స్వరూపమైన స్వామి కాదు అనసూయయే. గెలుపు ఓటమి పరీక్షింపబడు వానికే గాని, పరీక్షించు వానికి కాదు. ఆయనకు ఏమియును అక్కరలేదు. నిర్వికారుడు, నిర్వికల్పుడు, నిశ్చలుడు, నిత్యుడు, నిరంజనుడు, నిష్కలంకుడు, నిరామయుడు, నిత్యానంద స్వరూపుడు, "నాన వాక మహాప్తవ్యం" అని గీతలో చెప్పినట్లు, ఆయనచే పొందబడని వస్తువు కాని, ఆయన పొందవలసిన వస్తువు కాని ఈ సృష్టిలో ఏమీ లేదు. "ఆప్త కామస్య కాస్పహ" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా సత్యకాముడు, సత్య సంకల్పుడు అగు పరమాత్మకు కోరిక ఉండునా? అని అర్ధము. ఆనంద స్వరూపునకు ఒక వస్తువు నుండి ఆనందము పొందవలసిన అవసరములేదు. అగ్నికి తాపము కలుగదు, నీటికి దాహము కలుగదు. ఆట్లే ఆనంద స్వరూపునకు ఆనందమును పొందుటకు ఎట్టి ప్రయత్నము అవసరము లేదు. జీవుల సాధనలకు సహకరించుటకే పరీక్షల ద్వారా వారి సత్య స్ధితి వారికి నిరూపించి వారు తరువాత సాధనను చేయుటకు ప్రేరణము నిచ్చుచున్నాడు. కావున దత్త పరీక్షలు జీవుల శ్రేయస్సు కొరకే కాని ఆయన వినోదము కొరకు కావు.
ధర్మరాజు ఎల్లప్పుడు ధర్మమునకే ప్రాధాన్యము నిచ్చెను. కారణము అతడు ధర్మదేవుని అంశ అనగా అతదే ధర్మ దేవుడు. అతడే ధర్మము. అందరి కన్నను అన్నింటి కన్నను తనకు తానే ప్రాధాన్యమిచ్చుకున్నాడు. ఇది సత్యము కూడ. కాని ధర్మ స్వరూపుడైన తన కన్నను స్వామి ఎక్కువ యని మరచినాడు. అశ్వర్ధామ మరణించెనని అసత్యమును చెప్పమని స్వామి ఆదేశించగా తిరస్కరించినాడు. స్వామి కన్నను ధర్మమే అనగా తానే గొప్పయని అహంకరించినాడు. కావుననే నరక దర్శనము చేయవలసి వచ్చెను. అసత్యమాడమని బలవంతము చేసిన కృష్ణుడు నరకమునకు పోలేదు. "కర్త కారయితా చైవ" అను శాస్త్ర ప్రకారము చేసినవాడు, చేయించిన వాడు సమాన ఫలితమును పొందవలెను గదా. కాని కృష్ణుడు పొందలేదు. కారణము కృష్ణుడు పుట్టినదది మొదలు చివర వరకు స్వామిగనే వ్యవహరించినాడు. కాని రాముడు జీవుడిగనే వ్యవహరించినాడు. రాముడు మాయామానుష విగ్రహుడు. అనగా మనష రూపమను మందమైన దుప్పటి కప్పుకున్నాడు. కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. అనగా మనుష్య రూపమను చాలా పులుచని నైలాను గుడ్డ వంటి మాయను కప్పుకున్నాడు. రాముడు మాయలో దాగుకున్న వాడు. కృష్ణుడు మాయయను పలుచని మేలి ముసుగు వేసుకొనినవాడు. తీగెలో కరెంటు పోవుచున్నప్పుడు, తీగయె కనిపించునుగాని కరెంటు కనిపించదు. ఇదే రామావతారము. హీటరులో ఉన్న తీగెలో కరెంటు ప్రవహించి, ఆ తీగె ఎర్రగా కాలి ప్రకాశించుచుండును. ఆ ప్రకాశము చాలా ఎక్కువైనప్పుడు తీగె కనిపించదు. ఎర్రని కాంతి మంటయే కనపపించుచుండును. ఇదే కృష్ణావతారము. ఒక జీవుడు ఇతర జీవులతో వ్యవహరించుచున్నప్పుడు అన్నింటి కన్నను ధర్మమే గొప్పది అని నిరూపించు రామావతార సందేశమే రామాయణము. అందరి కన్నను అన్నింటికన్నను గొప్పది యగు ధర్మము కన్నను స్వామి గొప్పవాడు అని నిరూపించు కృష్ణావతార సందేశమే భాగవతము.

అత్యుత్తమ సాధకుల విషయములో ధర్మముతో తాను పోటిపడి ఏది ఎక్కువ అని దత్తుడు పరీక్షించును. మధ్యములైన సాధకుల విషయములో అందరి జీవుల కన్నను, తాను ఎక్కువ? కాదా? అను విషయములో పరీక్షించును. అధములైన సాధకుల విషయములో అన్ని వస్తువుల కన్నను అనగా ధనము కన్నను తాను ఎక్కువా కాదా అని పరీక్షించును. అనగా అధముడు స్వామి కన్నను ధనమునకు ఎక్కువ విలువ నిచ్చును. కావున వారికి పరీక్షలో సున్నా మార్కులు వచ్చును. మద్యముడు ధనము కన్నను స్వామికి ఎక్కువ విలువ నిచ్చును. కాని తన బంధువులగు జీవుల కొరకు భార్య భర్త, సంతానము, తల్లి తండ్రులు, మొదలగు అతి సన్నిహిత జీవులకు స్వామి కన్న ఎక్కువ విలువ నిచ్చును. అట్టివాడు పరీక్షను 40 మార్కులతో బొటా బొటీగా ఉత్తీర్ణుడైనవాడు. ఇక ఉత్తమ సాధకుడు ధనము కన్నను, సర్వజీవుల కన్నను స్వామికే ఎక్కువ విలువ నిచ్చును. కాని స్వామి కన్నను ధర్మమునకే ఎక్కువ విలువ నిచ్చును. అట్టివాడు 60 మార్కులతో ఫస్టుక్లాసును తెచ్చుకున్న ఉత్తీర్ణుడు. దత్త పరీక్షలో ఈ ప్రధమ శ్రేణిని పొందిన వారు ధర్మరాజు, అనసూయ వంటి ఉత్తమ సాధకులు. కాని కోటాను కోట్ల సాధకులలో ఏ ఒక్కడో ధర్మము కన్నను స్వామికే ఎక్కువ విలువ నిచ్చును. అట్టి జీవుడే నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణ ఉత్తీర్ణుడు. వారి ఫలితమునే రికార్డు బ్రేక్‌ అందురు. వీరు సాధకులు కాదు సిద్ధులు. ధర్మము నత్రికమించి యజ్ఞము జరుగక ముందే యజ్ఞాన్నమును స్వామికి పెట్టిన ఋషిపత్నులు, శ్రీ పాద వల్లభుని జనని యగు సుమతియు, గోపికలును ఇట్టి సిద్ధజీవులు. తన కొరకు ధర్మము తప్పమని స్వామి అడిగిననూ, అనసూయ తప్పలేదు. కావున ఆమె ఫలము ప్రధమశ్రేణి మాత్రమే కాని తన కొరకు ధర్మము తప్పి శ్రార్ధాన్నమును ముందుగా పెట్టిన సుమతి పరిపూర్ణముగా ఉత్తీర్ణురాలైనది. స్వామి, ధర్మము పోటీ పడినపుడు వస్త్రాపహరణ సందర్భమున గోపికలు కూడ స్వామి ధర్మముల మధ్య ఊగిసలాడినారు. కాని నేను సర్వజ్ఞడను సర్వసాక్షిని అను స్వామి బోధ చేత 60 మార్కులు మాత్రమే రావలసిన వారు నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు. ద్రౌపదీ వస్త్రాపహరణ విషయమున వస్త్రముల నిచ్చిన వాడే గోపికల వస్త్రాపహరణము ఏల చేసెను? ద్రౌపది వస్త్రాపహరణము ద్రౌపది అను జీవుడు కౌరవులు అను జీవుల మధ్య జరిగిన వ్యవహారము.
జీవుల వ్యవహారములో అధర్మము కన్నను ధర్మము గొప్పది అని నిరూపించుటకే ద్రౌపదికి వస్త్ర దానము చేసి కౌరవులను శిక్షించినాడు. కాని స్వామికి గోపికలకు అనగా స్వామికి జీవులకు మధ్య వ్యవహారములో ధర్మము కన్నను స్వామియే గొప్ప అని నిరూపించినాడు. రామాయణములో పరభార్యను కోరిన రావణుని వధించిన రాముడే కృష్ణావతారములో పరభార్యలగు గోపికలతో రాసక్రీడ నేల చేసెను? రామాయాణములో రాముడు ఒక జీవుడుగా వ్యవహరించినాడు. రావణుడు ఒక జీవుడే. జీవునకు జీవునకు మధ్య ఉన్న విషయములో ధర్మమునకే గెలుపు నిచ్చినాడు. కాని కృష్ణావతారములో తాను స్వామిగా వ్యవహరించినందున, స్వామికి యాదవులకు మధ్య విషయము స్వామికి జీవులకు మధ్య విషయమై యున్నది. కావున అన్నింటి కన్నను ధర్మమే గొప్పయన్నది రామాయణము, ఆదర్శము కన్నను స్వామియే ఎక్కువ అనుట భాగవతము. కావున మన లక్ష్యము, గమ్యము భాగవతము. నూరవ మెట్టు భాగవతమైనది. 99 మెట్టు రామాయణము. కాని ఈనాడు కలియుగములో భాగవతముతో పోల్చి చూచినపుడు మన సాధకుల స్ధితి పాతాళ లోకములో యున్నది. భగవంతునకు ఎంత విలువ నిచ్చుచున్నాము. సినిమాకు పోవుటకు ముందు ఎంత ఉత్సాహమున్నది. పెండ్లి కుమారడు లేక పెండ్లికొడుకు సాయంత్రమునకు పెళ్ళి ముహుర్తము కూర్చెదము సినిమాకు పొమ్మన్నచో ఆనందముతో పోవుచున్నారు. అచ్చట తలుపులు కిటికీలు మూసి ప్రాణవాయు సంచారము లేక కుర్చీలలో నల్లులు పీకుచుండగా దోమలు రక్తము త్రాగు చున్ననూ ఆ సినిమాపైనే స్ధిర దృష్టిని ఉంచి తెరిచిన నోటిలోనికి ఈగలు పోవుచున్ననూ తెలియక మూడు గంటలు ఎంత ఏకాగ్రతతో ఆసీనులగు చున్నారు. అదే సత్సంగమునకు, గుడిలో భాగవత శ్రవణమునకు రమ్మన్నప్పుడు అవసరములేని పనులన్నియును కనిపించును. ఇంటిలో కూరలున్ననూ, కూరలు తెచ్చుకొనవలయునని తప్పించుకొనుచున్నారు. ఒకవేళ వచ్చిననూ 10 నిమిషములు స్ధిరముగ కూర్చున లేరు. సత్సంగ శ్రవణము చేయునప్పుడు ఎన్ని గుసగుసలు మాటలాడు తుందురో, పాల పాకెట్టు కోసం లేచిపోవుదురు.

కావున మన సాధకుల సాధన యొక్క స్ధితి ఎచ్చట ఉన్నది? భగవంతుని కొరకు తండ్రిని త్యజించిన ప్రహ్లాదుడు తల్లిని త్యజించిన శంకరాచార్యులు, భర్తను త్యజించిన మీర, భార్య పుత్రులను త్యజించిన బుద్ధుడు , వివాహము ఆపియును సంతానము అక్కరలేదని రామకృష్ణ పరమహంస, స్వామి కొరకకు అన్నింటిని అందరిని త్యజించనన గోపికలు, వైదిక యజ్ఞ ధర్మమును త్యజించిన ఋషిపత్నులు ఎక్కడ! ఎక్కడ! ఎక్కడ! ఎంతో దూరం బ్రహ్మపదం ఓ జీవా ఇంకా ఎంతో దూరం బ్రహ్మ్మపదం|
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, November 30, 2009

ఏ జీవుని ఆక్షేపించకుము

సాధకుని యొక్క గొప్పతనము అతడు చేసిన సాధన యొక్క గొప్పతనము మీద ఆధారపడియుండును. ఆ సాధన యొక్క గొప్పతనము ఆ సాధకుడు పొందిన ఫలము యొక్క గొప్పతనము పై ఆధారపడి యొండును. ఒకడు సాధించిన ఉద్యోగము యొక్క హోదా జీతమును పట్టి అతడు చదివిన చదువును నిర్ణయించి వచ్చును. ఆ చదువు యొక్క గొప్పతనము బట్టియే అతని గొప్పతనముండును. ఈ సృష్టిలో పరమాత్మ నుండి అత్యుత్తమ ఫలమును పొందిన సాధకులు ఇద్దరే ఇద్దరు. వారు హనుమంతుడు, రాధ. హనుమంతుడు 14 లోకముల యొక్క ఆధిపత్యమును సృష్టికర్త, సృష్టిభర్తగా, సృష్టిహర్తగా పొందినాడు. ఈ లోకములే సృష్టి. రాధ 14 లోకముల పైన పరమాత్మచే ప్రత్యేకముగా సృష్టించబడిన 15 లోకమగు గోలోకమునకు ఆధిపత్యము పొందినది. ఇంతకు మించి ఫలములు లేవు. కావున ఇరువురిని మించిన సాధకులు లేరు. కావున ఆ ఇరువురి సాధనను మించిన సాధన లేదు. అయితే ఆ ఇరువురికి అనుగ్రహించిన ఫలములలో తారతమ్య మున్నది. ఒకరిని హైస్కూలుకు హెడ్‌మాస్టర్‌గా చేసినాడు. మరి యొకరిని హైస్కూలుకు పైనున్న కాలేజ్‌కి ప్రిన్సిపాల్‌గా చేసినాడు. అనగా 14 లోకముల అధిపత్య పదవియే హైస్కూలు హెడ్‌మాస్టర్‌ పదవి. కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ పదవియే గోలోక ఆధిపత్యము. హనుమంతుడు పరమాత్మను నిలదీశినాడు. పరమాత్మ హనుమంతుని బుజ్జగించుచు "హనుమా! నీ రాజ్యము 14 లోకములు. రాధ రాజ్యము ఒక్క లోకమే గదా అన్నాడు. కాని బుద్ధిమంతులలో వరిష్టుడుగు హనుమంతుడు దీనిని అంగీకరించలేదు. 2000 మంది విద్యార్ధులు గల హైస్కూలు హెడ్‌మాస్టర్‌ పదవి కన్నను 200 విద్యార్ధులు గల కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ పదవియే ఎక్కువ. హెడ్‌మాస్టర్‌ జీతము కన్నను ప్రిన్సిపాల్‌ జీతము ఎక్కువగా యుండును. ఈ రెండు పదవులలో పెద్ద తారతమ్యము లేకపోయినను రాధ యొక్క పదవియే హనుమంతుని పదవి కన్న కొంచెము ఎక్కువయని పరమాత్మ అంగీకరించక తప్పలేదు. అప్పుడు హనుమంతుడు "స్వామీ! లంకలో నా తోక మండుచున్ననూ ఇంత బాధపడలేదు. ఇప్పుడు నీవు చేసిన పనికి నా కడుపు మండుచున్నది అన్నాడు. కావున హనుమంతునకు కారణము వివరించక తప్పలేదు". స్వామి ఇట్లు వివరించినాడు.

"బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైన హనుమా! నిన్ను మభ్యపెట్టుట స్వామికి కూడా తరము కాదు. కావున సావధానముగా ఆలకించుము. సముద్రమైన నన్ను ఒక నది నేరుగా వచ్చి చేరుచున్నది. మరియొక నది వంకరులుగా తిరిగి చేరుచున్నది. కాని నేరుగా వచ్చునది అహంకారముతో వంకరలుగా వచ్చునదిని చూచి ఆక్షేపించుచున్నది. ఈ ఆక్షేపణము చేయకున్నచో నేరుగా వచ్చు నది త్వరగానే చేరును. ఇందు ఎట్టి సందేహము లేదు. కాని అహంకారముతో రెండవ నదిని ఆక్షేపించినందులకు సముద్రుడగు పరమాత్మ యొక్క సంకల్పము చేత మొదటినదికి అడ్డముగా మానవులు ఆనకట్టను కట్టిరి. మొదటినది యొక్క జలములన్నియును పొలములకే మరలింపబడి ఒక్క చుక్కయైనను సముద్రమునకు చేరలేదు. నీవును ఇదియే పొరపాటు చేసియున్నావు. నేను రామావతారము తరువాత కృష్ణావతారము నెత్తితిని. నేను చేయు అల్లరి పనుల వలన నీ విశ్వాసము సడలి నన్ను గుర్తించలేకపోయినావు. అందుకే నన్ను దర్శించుటకు నీవు ఎప్పుడును రాలేదు. ఈ కృష్ణుడు పరమాత్మ కాదని భావించినావు. కాని భగవద్దూషణమునకు భగవంతుడు ఎట్టి పాప ఫలమును అందించడు. హిరణ్యకశిపుడు నన్ను నిందించినను నేను వానిని దండించలేదు. కాని నా భక్తుడైన ప్రహ్లాదుని జోలికి వెళ్ళి నందున హిరణ్యకశిపుని దండించితిని. కావున భగవదపచారము కన్నను బాగవత అపచారము గొప్పది. ఒక భక్తుడు ఇతర భక్తుల పై ఎట్టి ఆక్షేపణలు చేయరాదు. నీవు రాధను, గోపికలను చూచి ఆక్షేపించినావు. ఈ భక్తులు అధర్మవర్తనులు. వీనిని భగవంతుడు అధర్మమునే ప్రోత్సహించుచున్నారు" అని నా భక్తులగు గోపికలను చులకనగా చూచినావు. కావున నా వద్దకు నీవు రాలేదు. ఐతే కౌరవసభలో నేను ప్రదర్శించిన విశ్వరూపమును చూచి, నన్ను చేరి నా కార్యమగు ఆ యుద్ధమున సాయపడినావు.

"ఏ యధామాం ప్రపద్యన్తే తాం స్తదైవ భజామ్యహం మమ వర్మాను వర్తన్తే మనుష్యాః పార్ధ సర్వశః" నన్ను ఎవరు ఏ భావమున ఇష్టపడుదురో ఆ భావములోనే వారిని నేను సమీపించెదను. భావములో ఎట్టి గొప్పదనము లేదు. భావములో యున్న ప్రేమయను బరువును చూడవలెను. నీవు నన్ను దాస భావమున ఆరాధించినావు. రాధ, గోపికలు నన్ను ప్రియ భావమున ఆరాధించినారు. దాస భావము కన్నను ప్రియ భావము గొప్పది కాదు. చిలుక యైనను, గాడిద యైనను పంచదార బరువును పట్టియే ధర పలుకును. ఒక వేశ్య ఒకనిని ప్రియ భావమున సేవించుచున్నది. దాని దృష్టి యంతయు వాని ధనము పైనే యున్నది. కావున ఈ భావము ఈ ఉదాహరణములో గొప్పది యుగుచున్నదా? నీవు నీ యజమాని అగు సుగ్రీవుని వద్దకు పోయి నీవు సుగ్రీవుడికి దాసుడవై యున్నను "నేను రామునకు దాసుడను అని చెప్పినచో అతడేమి చెప్పును".

నిజమే నేనును రామునకు దాసుడనే కావున రామునికి దాసుడగుటలో అభ్యంతమేమున్నది? నీవు అని పలుకును. ఇట్లే పరమాత్మను తండ్రిగా, సోదరునిగా, గురువుగా భావించిన వారు వారి తండ్రులకు, వారి సోదరులకు, వారి గురువులకు చెప్పినచో వారును హర్షింతురు. కాని రాధ యొక్క అవతారమగు మీరాబాయి యొక్క భర్తకు మీరాబాయి కృష్ణుడే నా భర్తయని చెప్పినప్పుడు మీరాబాయి యొక్క భర్త ఆమెను విషమునిచ్చి హింసించినాడే తప్ప నిజమే జగద్భర్తయగు కృష్ణుడు నాకును భర్తయే అని చెప్పలేదు. మీరాబాయి సమయములో కృష్ణుడు కేవలము విగ్రహముగా యున్నాడు. కాని గోపికలు యున్న సమయములో కృష్ణుడు నరాకారమున ఉన్నాడు. కాని గోపికలు వారి భర్తలకు ఇదే సమాధానము నిచ్చినారు. వారిచే ఎంతో హింసించబడినారు. కావున ఆ గోపికలు ఆ గోపికల నాయకురాలగు రాధ ఎంత గొప్పవారో ఆలోచించుము. అంతే కాదు వారు బృందావమునకు వచ్చినప్పుడు నేను కూడా వారికి బోధించినాను. "ఓ గోపికలారా! మీకేమైనా పిచ్చి పట్టినదా? మీ గృహములనను, పతిపుత్రులను, తల్లితండ్రులను, భాంధములను త్యజించచి ఈ అర్ధరాత్రి నా వద్దకు వచ్చినారు. ఒకవేళ వారు నిద్రించుచున్న మీరు శిక్ష తప్పించుకున్నను చిత్రగుప్తుని, యమధర్మరాజును తప్పించుకొన లేరుగదా! ధర్మ శాస్త్రమున మీకు ఏమి శిక్ష విధించబడునో మీకు తెలియునా? ఇనుముతో తయారు చేసిన కృష్ణ విగ్రహములను ఎర్రగా అగ్నిలో కాల్చి ఆ విగ్రహములను ఆ లింగనము చేసుకొనునట్లు యమదూతలు చేయుదురు. కావున మీ తమోగుణమును వదలి ఇండ్లకు పొండు అని చెప్పితిని. దానికి వారు మందహాసములను చేసి "కృష్ణా! నీవు చెప్పిన శిక్షను మేము సంతో్షముగా స్వీకరింతుము. కాని నిన్ను విడజాలము" అని అన్నారు. కావున నా కొరకు ఎట్టి శిక్షలను అయినా అనుభవించుటకు సిద్ధపడిన ఆ గోపికల ప్రియ భావములో వారి ప్రేమ భారమును చూడుము. కిలో పంచదారతో చేయబడిన గాడిద బొమ్మ యొక్క ధర అరకిలో పంచదారతో చేయబడిన చిలుక కన్న ఎక్కువ పలుకును. కనుక భారము ప్రధానము కాని చిలుక కాదు. కావున నన్ను ప్రియునిగా భావించుటలో గొప్పతనము రాలేదు. ఆ భావములో వారికి కల భక్తి యొక్క బరువు వలన విలువ వచ్చినది. భావములోనే విలువ యున్నచో ఒకని ప్రియునిగా చూచు వేశ్యకు కూడా ఫలము వచ్చును గదా. కావున గోపికలు వేరు, వేశ్యలు వేరు. "గోపి వేశ్య అనిన మూఢా దత్తుడెపుడు వేశ్య రతుడే భాగవతము రంకు కాదు జ్ఞానమదియే ఓరి శుంఠా!" 7 రోజులలో ముక్తి నిచ్చు గ్రంధమేది యని పరీక్షిత్తు శుకుని ప్రశ్నించినపుడు, నీ చరిత్ర గల రామాయణమును చెప్పలేదు. గోపికల చరిత్రయుగు భాగవతమును చెప్పినాడు. పండితులు కూడా "విద్యావతాం భాగవతే పరీక్షా" అనగా భాగవతమును గురించి చెప్పినారు గాని, రామాయణము గురించి చెప్పలేదు. కావున నీవు ఏ మార్గమును వంకర మార్గమని ఆక్షేపించినావో, అదియే నీ మార్గము కన్న గొప్పదియని తెలుసుకొనుము. భాగవతము గాడిద బొమ్మలో ఉన్న కిలో పంచదారను గురించి చెప్పుచున్నది కాని గాడిద బొమ్మను గురించి కాదు. కావున భాగవతము ప్రియ భావమును గురించి బోధించుటలేదు. ప్రియ భావ మార్గమున ఉన్న భక్తి యొక్క బరువును గురించి బోధించుచున్నది. నీవు గాడిదను, చిలుకనే చూచినావు తప్ప ఆ బొమ్మలలో ఉన్న పంచదార బరువును చూడలేదు. కావుననే దుకాణము యజమానిని పంచదార గాడిద రు 100/- లు పంచదార చిలుక రు 50/- లు అన్నప్పుడు ఛీ ఛీ గాడిద ధర వంద రూపాయిలా అని గాడిదను ఆక్షేపించినావే తప్ప, వాడు ఆ బోమ్మలోని పంచదార బరువును పట్టి ధర చెప్పినాడని గ్రహించకున్నావు. కావున నీ ఆక్షేపణ నీ అజ్ఞానము నుండి జనించినది. కావున ఏ జీవుని ఆక్షేపించకుము. ఏ పుట్టలో ఏ పామున్నదో నీకేమి తెలియును. పాములను పట్టు వానికే తెలియును. వారి మార్గములో గొప్పతనము ఉన్ననూ నేను గోలోకము సృష్టించి యుండెడివాడను కాను. వారిని నా హృదయములో నుంచుకొని దాచుకొనెడి వాడను. ఈ చతుర్ధశ భువనాధిపత్యము కన్ననూ, నా హృదయ స్ధానము గొప్పది. కాని బహిరంగముగా అందరికిని కనపడునట్లు ఈ గోలోక సృష్టిని చేసినది నీకును నీవలె ఆక్షేపణము చేయు ఇతరులకు బోధించుట కొరకే అని పరమాత్మ తన ఉపన్యాసమును ముగించినాడు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, November 24, 2009

సాధన

సాధన అనగా నేమి? సాధన యనగా మంత్రమును జపించుట అని కొందరు, ధ్యానమును చేయుట అని మరి కొందరు, పూజలు చేయుట అని మరి కొందరు తలచుచున్నారు. ఇట్లు పలు విధములుగా తలచుచున్నారు. కాని వీటి వలన భగవంతుడు లభించును గాని, లభించిన భగవంతుడు నిలువజాలడు. ఇవి అన్నియును మనము స్వామిని పిలుచుట. పిలువగనే స్వామి వచ్చుచున్నాడు. కాని మన ఇంటిలోనికి రాగానే దుర్భరమైన కుళ్ళు కంపు కొట్టుచున్నది. దానికి మనము అలవాటు పడినాము. అది లేకుండ మనము జీవించజాలము. బురద గుంటయే పందికి పన్నీరు సరస్సు కాని ఆ బురద గుంట లోనికి మానవుడు ప్రవేశించగలడా? ఇక్కడ మన ఇల్లు అనగా మన శరీరము అని అర్ధము. మనము పిలువగనే మన శరీరము లోనికి దత్తుడు ప్రవేశించుచున్నాడు. దానికి ఎన్నోసార్లు జపము అక్కరలేదు. ఒక్కసారి నామోచ్చారణము చాలును. ఎన్నో సంవత్సరముల దానము అనగా తపస్సు అక్కరలేదు. ఒక్క క్షణము స్మరించిన చాలును దత్తుడు నీలో ప్రవేశించును. కాని ప్రవేశించిన వాడు నిలువలేకయున్నాడు. కారణము నీలో ఉన్న కంపు. ఆ కంపు నీలో ఉన్న మూడు బురద గుంటల నుండి వచ్చుచున్నది. ఆ మూడు గుంటలే అసూయ, అహంకారము, స్వార్ధము. ఈ మూడింటిని ఒక్క పరమాణువు మాత్రము కూడా లేకుండా తుడిచి వేయవలెను. అసూయ పోగానే అనసూయవగుదువు. ఏ జీవుడైనను అనసూయ కావచ్చును. ఇందు స్త్రీ పురుష బేధము లేదు. ఏలననగా జీవులందరును ప్రకృతి స్వరూపులగు స్త్రీలే. మాత్సర్యము యొక్క మరొక పేరే అసూయ. అసూయ పోగానే అనసూయ యైన జీవునిలోనికి దత్తుడు ప్రవేశించును. దత్తుడు అనసూయా గర్భస్తుడనుటలో అంతరార్ధమిదే. ఈ మూడు వరుసగా రజోగుణ, తమోగుణ, సత్వగుణములు. అసూయ తమోగుణము. అసూయ పోగానే తమోగుణి పతియగు శివుడు నీలోనికి ప్రవేశించును. తరువాత అహంకారము రజోగుణము. అహంకారము పోగానే రజో గుణాధిపతియగు బ్రహ్మ నీ లోనికి ప్రవేశించును. స్వార్ధము సత్వగుణము. దీనిలో మంచి చెడులు రెండును ఉన్నవి. లోకములోని వస్తువులను వ్యక్తులను నీవి నీవారు అనుకొనుట చెడు భాగము. ఏలననగా అవి, వారు అనిత్యములు ఈ జన్మ కాగానే ఈ జీవుడు వేరు వేరు జీవుల బంధములోనికి పోవుచున్నాడు. ఒక నటుడు ఒక సినిమా షూటింగ్‌ బంధముల నుండి మరియొక సినిమా షూటింగ్‌ బంధములోనికి పోవుట వంటిదే. కాని అన్ని షూటింగ్‌ల యజమాని యగు సినిమా నిర్మాతతో బంధము నిత్యముగా యుండును. అట్లే అన్ని జన్మములలోను జీవునకు సృష్టినిర్మాతతో బంధము నిత్యముగా యుండును. కావున అనిత్య బంధములు వదలి స్వామి నా వాడు అనుకొనుటలో విషయము స్వార్ధములో మంచి భాగమై యున్నది.

ఐతే స్వామి నా వాడు మాత్రమే అనుకొనుటలో మరల ఈ మంచి భాగము చెడు భాగమగుచున్నది. కృష్ణుని తన వాడుగా పోందుటకు సత్యభామ తన బంగారంతయు త్యజించినది కాని ఓడిపోవుటకు కారణము స్వామి నా వాడు మాత్రమే అనుకొనుట. కావున లోకబంధములన్నింటిని త్యజించి "స్వామి నా వాడు" అనుకొనుట మంచిదే. కాని స్వామి నాకు మాత్రమే దక్కవలయును అనుకొనుట తప్పు. రుక్మిణి స్వామి నా వాడు మాత్రమే కాదు అష్టభార్యలందరుకిని సమముగా దక్కవలయునని భావించినది. కావున సత్యభామ ఓడి రుక్మిణి గెలిచినది. కాని రుక్మిణి కూడా రాధ చేతిలో ఓడిపోయినది. రుక్మిణి అష్టభార్యలకు మాత్రమే స్వామి దక్కవలయును అనుకొనినది. కాని రాధ 16000 గోపికలకు దక్కవలయునని అనుకొన్నది. రాధకన్న మీర ఇంకనూ గొప్పది. స్వామిని గురించి సర్వ జీవులకు ప్రచారము చేసి, స్వామి సర్వజీవులకు దక్కవలయునని భావించినది. కావుననే స్వామి పూరీ జగన్నాధ దేవాలయములో మీరను సశరీరముగా తనలో ఐక్యము చేసుకున్నాడు. ఇట్టి సశరీర కైవల్యమును, రుక్మిణి, సత్యభామ, రాధలకు ఇవ్వలేదు. అట్లే శంకరాచార్యుడు సర్వజీవులు తరించవలయునని దేశమంతయును సంచరించి జ్ఞాన ప్రచారము చేసినాడు. కావున హిమాలయములోని దత్తాత్రేయగుహలో అదే సశరీర కైవల్యమును ఇచ్చినాడు. కావున దానము లేనిదే దత్తుడు లేడు. స్వార్ధము పోందే దత్తుడు రాడు. అహంకారము పోనిదే అసూయ పోదు. అసూయ పోనిదే అహంకారము పోదు. మీరా, శంకరులలో అసూయ పరమాణువు కూడా లేదు. వారితో మనము పోల్చుకున్నచో ఎంత దూరములో ఉన్నామో ఆలోచించుడు.

మీ ఇంటిలో కరెంటు పోయినదా అని ఎదురివారు అడుగగనే ఎదురువారిని మీ ఇంటిలో కూడా పోయినదా అని అడుగుదుము. వారింటిలో కరెంటు పోయిన వీరికి ఆనందము. మన యింటిలో కరెంటు పోయి ఎదురు వారింటిలో ఉన్నచో మన ముఖము అప్పుడే మండును. మన అసూయను పోగొట్టుటకు స్వామి ఒక్కొక్క నరావతారమున వచ్చి కొందరిని ఎన్నుకొని వారిని శుద్ధిచేయుటకు ఆరంభించును. మన మంచి కోసము ఆయన ప్రయత్నమును మనము గుర్తించము. మనము ఏమి మాట్లాడిన తప్పులు పట్టుచున్నాడని ఆయనను మనము నిందింతుము. శ్రీ రామ అన్నచో బూతుమాట అగుచున్నదే అని ఆయనను ఆక్షేపింతుము. కాని ఆయన మనలను పరిపూర్ణముగా శుద్ధిచేసి, మనలోనికి ప్రవేశించ తలచినాడని గుర్తించము. ఇట్లు ఆక్షేపించుటలో కారణము మన అహంకారము. స్వార్ధము పోవుట ఇంకనూ కష్టము.

ఒకసారి హనుమంతుడు శ్రీ రామునకు చామరముతో విసురు చున్నాడు. అక్కడ వున్న వానరుడు ఇట్లు తలచినాడు. ఈ మాత్రము సేవ నేను చేయలేనా? అని అనుకున్నాడు. శ్రీ రాముడు వెంటనే హనుమంతుని ఆపి ఆ వానరుని పిలచి ఆ చామరమును వానరున కిచ్చి విసర మన్నాడు. శ్రీ రాముని సంకల్పము చేత గాలి మందగించి ఉక్కపోయుట ఆరంభించెను. వానరుని చేతిలోని చామరము కొంచెము పైకి లేచెను. అనగా తనకు స్వామికి గాలి వచ్చునట్లు విసరుచున్నాడు. శ్రీ రాముని సంకల్పము చేత ఇంకా మందగించినది. ఉక్కపోయుట ఎక్కువైనది. అప్పుడు వానరుడు తన వరకే విసురుకొనుచున్నాడు. అప్పుడు స్వామి వాని వైపు చూచి చిరునవ్వు చిందించినాడు. ఇదే పరీక్షను హనుమంతునికి కిష్కింద గుహలో పెట్టినాడు. హనుమంతుని శరీరమంతయు చెమటలు కారుచున్నది. చామరము స్వామికి మాత్రమే విసరుచున్నాడు. దీని అర్ధమేమి? కావున అసూయ, అహంకారము, మమకారమనెడి స్వార్ధము ఈ మూడు నీలో నుండి పోయినపుడే త్రిమూర్తులు నీలోనికి ప్రవేశించుదురు. కాని త్రిమూర్తులకు మూలవిరాట్టు యైన దత్తుడు ప్రవేశించవలెనన్నచో నీవు దానమును ప్రారంభించవలెను. అనగా స్వామి నుండి నీవు పోందిన జ్ఞానాన్ని సర్వజీవులకు అందించి, వారు ఆనందించు చుండగా నీవు ఆనందించు సిత్ధికి రావలయును. ఇట్టి త్యాగము లేక దానము చేతనే దత్తుడు ప్రవేశించి స్ధిరముగ నిలచును. స్వామి నరాకారమున వచ్చినపుడు నీ విశ్వాసములోని లోపము చేతనే ఆయన నిన్ను పూర్ణముగా బాగు చేయలేక యున్నాడు. స్వామియే అను విశ్వాసము ఏర్పడిన తరువాత మరల స్వామి కాడేమో అని సంశయము వచ్చును. దీని వలన శ్రద్ధ తగ్గి అశ్రద్ధ ఏర్పడును. మరల ఒకవేళ స్వామి అయినచో అన్న అనుమానము వచ్చును. ఈ విధముగా విశ్వాసము ఊగులాడుట చేతనే యోగిరాజు నుండి నీవు యోగమును పూర్ణముగా పొందలేకున్నావు. విశ్వాసము యోగమునకు మూలాధారము.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Sunday, November 8, 2009

పరమాత్మను ఆరాధించు కరణములు

పరమాత్మను ఆరాధించు కరణములు అనగా పనిముట్లు. అవి మూడు 1)మనస్సు, 2)వాక్కు, 3)శరీరము చేత చేయబడు కర్మ . ఈ మూడింటిలోను మనస్సు రాజు. వాక్కు మంత్రి, కర్మ సేనాధిపతియై యున్నాడు. మనస్సుననుసరించియే వాక్కు కర్మలు యుండును. మనస్సు చేయు క్రియ మననము, వాక్కు చేయు క్రియ శబ్ధోచ్చారణము, శరీరము చేయు క్రియ గమనము, దానము మొదలగునవి. ఈ మనన క్రియయే మంత్రము అనబడుచున్నది. శబ్ధోచ్చారణములో శ్రేష్టమైనది సామవేదాత్మకమైన గానము. వచనము కన్న పద్యము, పద్యము కన్న గీతము శ్రేష్టము. "వచనమే యజుర్వేదము, పద్యమే ఋగ్‌వేదము, గీతమే సామవేదము". ఈ మూడు కలసి త్రయి అనబడుచున్నవి. సనాతన సంప్రదాయములో దత్తుని వెంట మూడు శునకములున్నట్లు చిత్రీకరించిరి. నాల్గవ వేదముగ అధర్వణవేదము ధనుర్వేదాత్మకమై శస్త్రాస్త్రములను సూచించుచున్నది. అనగా నాల్గవ వేదము పాణిపద శరీరమునకు సంబంధించిన క్రియయై శారీరక కర్మను సూచించుచున్నది. గానాత్మకమైన ఛందోమయమైన వాక్యమే గాయత్రీ మంత్రము. వాక్యము కావున యజుర్వేదము, చంధస్సులో బంధింపబడినది కావున ఋగ్వేదము, గానముతో మిళితము కాబడినది కావున సామవేదము. ఇట్లు గాయత్రీ మంత్రము వేదత్రయాత్మకమై యున్నది. ఈ గాయత్రీ మంత్రము శ్రవణము, పఠనము, మననము అను ముడు దశలుగా యున్నది. అనగా వినుట, పాడుట, పదేపదే మనస్సులో స్మరించుట. గాయత్రీ మంత్రము అనగా అందరును జపించు " తత్సవితుర్వరేణ్యమ్‌" మొదలగు పాదత్రయాత్మకమైన ఋగ్వేదము లోని మంత్రము కాదు.

గాయత్రి యనగా కేవలము ఒక ఛందస్సు మాత్రమే. గాయత్రి తిష్టుల్‌ భృహతి మొదలగు ఛందస్సులలో గాయత్రి ఒక ఛందస్సు మాత్రమే. గాయత్రి ఛంధః అని చెప్పుచున్నాము. కావున గాయత్రి మంత్రమనగా ఛందోబద్ధమై గానమిళితమై పరమాత్మ యందు ప్రేమను పెంపొందించు వాక్యమే. ఆ వాక్యము ఏ వాక్యమైనను కావచ్చును. ఆ వాక్యము మధురమై గానాత్మకముగా యున్నచో గాయత్రి అనబడును. అది మనస్సుకు ఆకర్షించి పదేపదే దానిని ఉచ్చరింప చేసినచో అదే మంత్రము అనబడును. ప్రతి దేవతకు ఒక్కొక్క గాయత్రి మంత్రము గలదు. దీనినే మంత్ర గాయత్రీ అనుచున్నారు. ఏ దేవతా రూపము మీదనూ గాయత్రీ మంత్రము గలదు. గాయత్రి అనగా ఒకే దేవతపై చెప్పుబడిన మంత్రము కాదు. వాక్కు, మనస్సు, కర్మల మధ్య యున్నది. వాక్కు, మనస్సు, కర్మల యొక్క సంధి స్ధానము శ్రవణము చేత మనస్సు నందు పరమాత్మపై ప్రేమ కలుగుచున్నది. ఈ ప్రేమయే వాక్కులో వ్యక్తమగుచున్నది. మనస్సులో పుట్టి వాక్కులో వ్యక్తమైన ప్రేమయే భక్తి అనబడును. ఈ రెండును పరమాత్మను సాధించుకొని పొందుట వరకే ఉపయోగించును. పరమాత్మ లభించగనే ఏ మాత్రమును మురిసిపోవలసిన అవసరము లేదు. లభించిన పరమాత్మను నిలుపుకొనుటయే సాధన యొక్క సారాంశము. పరమాత్మ స్మర్తృగామి. స్మరణ మాత్ర సంతుష్టుడు. నీవు మనస్సులో ఒక్క క్షణము స్మరించగనే, ఒక్కసారి వాక్కుతో పిలువగనే పరమాత్మ నీ సన్నిధి యందు నిలచుచున్నాడు. కావున పరమాత్మను పొందుటకు పెక్కుసార్లు మనస్సుతో, వాక్కుతో స్మరణము చేయనవసరము లేదు. మనస్సుతో, వాక్కుతో జపము పేరున పెక్కుసార్లు పిలువనేల. స్మరించగనే లభించుచున్నాడు. కాని లభించిన దానిని నిలుపుకొనుటకే నీవు ఎంతో సాధన చేయవలయును.

పరమాత్మను నీవద్ద శాశ్వతముగా నిలుపుకొనవలయున్నచో, నీ భక్తిని సత్యమైనది అని నిరూపించయలయును. ఆ నిరూపణయే కర్మ, లేక సేవ. కావున సేవ కర్మ లేక కేవలము మనస్సు, వాక్కుల చేత పరమాత్మను ఆరాధించి ఏ మాత్రము ప్రయోజములేదు. "రామ" అనగనే నీ వెంట కోదండపాణియై నిలుచున్నాడు. రెండవ సారి "రామ" యననేల? రెండవ సారి రామ యన్నచో వచ్చిన రాముని దూరముగా పొమ్మని మరల రమ్మని అర్ధము. ఒక గురువు "రామ" అని చెప్పుచూ భక్తులకు తీర్ధము నిచ్చుచున్నాడు. ఆ తీర్ధముతో భక్తుల కష్టములు తొలగుచున్నవి. ఒకనాడు ఆ గురువు గ్రామాంతరమునకు పోయెను. భక్తులు వచ్చినారు. ఆయన శిష్యుడు " రామ రామ రామ" అని మూడుసార్లు పలికి తీర్ధము నిచ్చినాడు. భక్తుల కష్టములు తొలగుచున్నవి. తరువార ఆ రాత్రికి గురువుగారు ఇంటికి వచ్చినాడు. శిష్యుడు తాను చేసిన పనిని గురువుకు చెప్పినాడు. గురువు వెంటనే వాని చెంప మీద కొట్టినాడు. గురువు ఇట్లు వచించినాడు. నీవు ఒక్కసారి "రామ" అన్నచో ఆ తీర్ధము కష్టములను తొలగించదా? మూడుసార్లు ఏల ఉచ్చరించితివి? అనగా నీకు రాముని పై విశ్వాసము లేదననియే గదా? అని బోధించినాడు. ఒకే రామ శబ్ధమును అనేక సార్లు ఉచ్చరరించుటలో వ్రాయుటలో అర్ధము లేదు. పరమాత్మ సర్వవ్యాపకుడు. కావున పరమాత్మ నీవు ఉన్నచోటనే ఉన్నాడు గదా. నీ ప్రక్కనే నీ తండ్రి నిలచియున్నాడు. "నాన్న"అని పిలచినావు. వెంటనే నీ వైపు తిరిగి "ఏమి"అనుచున్నాడు. పరమాత్మ కోటాకోట్ల తల్లితండ్రుల కన్న ఎక్కువ వాత్సల్యము గలవాడు గదా! నీవు ఒక్కసారి పిలచిన పలుకడా? నీవు పదేపదే ఆయనను పిలుచుట ద్వారా ఏమి అర్ధము చేసుకొనుచున్నావు. రామ రామ అని ఎన్నిసార్లు పిలచినను పలుకుట లేదు. నీ తండ్రి ఎన్నిసార్లు పిలచినను పలుకుట లేదు అనగా దాని అర్ధముమేమి? ఆయన నీ పై కోపముతో ఉన్నాడు. ఆయన ముఖము నీకు చూపించుట లేదు. అనగా పరమాత్మ కనబడుట లేదు, పలుకుట లేదు. నిజముగా నీయందు పరమాత్మకు ప్రేమ యున్నచో నీవు ఒక్కసారి "రామ" యన్ననే ఎదురుగ నిలచి ఏమి అనవలయును. ఈ రెండును జరుగుట లేదు. దానికి కల కారణమేమి అని విచారింపక, విచారించి సరిదిద్దుకొనక ఎన్నిసార్లు రామ మంత్రము జపించినను ఫలమే మున్నది?

ఎన్ని రాగములతో రాముని పై గానము చేసినను ప్రయోజనమే మున్నది? నీ తండ్రి వచ్చి నాయనా కాళ్ళు నొప్పులు పుట్టుచున్నవి కొంచెము సేపు పిసుకుము అని అడుగగా ఆయన సేవాకర్మను చేయక నాన్న నాన్న అని అక్షరలక్షలు జపము చేసిన ఫలమేమున్నది? లేక నాన్న యొక్క గుణగణములను పొగడుచూ సంగీత శాస్త్రములో ఉన్న రాగములలో నాన్న పై పాటలు పాడిను అవసరమైన పనిని చేయక వీటిని చేయుచున్నందుకు నాన్న కోపగించి నీకు ముఖమును చూపడు. నీతో పలుకడు. ఆచరణములో కర్మలో స్వామి పైన ప్రేమను నిరూపించిన హనిమంతుని ఆదర్శముగా తీసుకొనక నీవు రాముని ఎట్లు పొందగలవు. కావున రామకార్యములో పాల్గోని రామసేవను చేసినవాడు హనుమంతుడు. హనుమంతుడు రాముడు జీవించినంత కాలము ఎప్పుడును రామ మంత్రమును జపించలేదు. ఎప్పుడును రామును పై భజనలు చేయలేదు. రాముడు జీవించనంత కాలము చేసినవి రెండేరెండు పనులు. ఒకటి రామకార్యములో పాల్గోనుట. రెండవది రామకార్యము లేనపుడు రాముని యొక్క వ్యక్తిగత సేవలో పాల్గోనుట. అనగా పాద సంవాహనము, చామరవీజనము మొదలగు సేవలు. సేవలో రాముని కార్యము మొదటిది. రామ కార్యము ఉన్నప్పుడు రాముని వ్యక్తిగత సేవ చేయలేదు. రామకార్యము లేనప్పుడు మాత్రమే వ్యక్తిగత సేవ చేసేడి వాడు. వారధి నిర్మాణమునకు వ్యాకులుడై సముద్ర తీరమనన రాముడు కూర్చుని యుండగా, హనమమంతుడు వారధి నిర్మాణము నందు నిమగ్నుడైనాడే తప్ప, వారధిని పట్టించుకొనక కేవలము రాముని పాదములు పిసుకుచు రాముని ఎదురుగా కూర్చున లేదు. రామకార్యమంతయు ముగిసిన పిమ్మట రాముడు సింహాసనారూఢుడైన తర్వాత రామని వ్యక్తిగత సేవ చేసినాడు. తరువాత రాముడు కొంత కాలమునకు శరీరము చలించగా ఆనాటి నుండి రామనామ జపము రామ గానమును చేసినాడు. తరువాత రాముడు మరల కృష్ణునిగా మానవరూపమును తాల్చగా కృష్ణుని యొక్క కార్యమైన కురుక్షేత్ర యుద్ధమున పార్ధుని జండా పై నిలచి అదృశ్య రూపమున శత్రువులను సంహరించినాడు. అనగా మరల రామకార్యమున పాల్గోన్నాడు. నిజముగా కురుక్షేత్రమున శత్రువులను సంహరించినది రధమునకు ముందున్న కృష్ణుడు, మరియు రధము పైనున్న హనుమంతుడే. రామాయణమున, రాముడు హనుమంతుడు యుద్ధము చేయుచూ చేసినట్లు కనిపించినారు. కురకక్షేత్రమున కూడా నిజముగా ఆ ఇరువురు యుద్ధము చేసినారు. కాని కనిపించలేదు. కారణము స్వామి భక్తుడగు అర్జునునకు కీర్తి ఇచ్చుట కొరకే. ఈ కారణము వలననే కృష్ణుడు ఆయుధము పట్టను అన్నాడు. ఇట్లు హనుమంతుడు స్వామి ఎప్పుడు నరరూపమును తాల్చినను తాను కూడా స్వామి వెంట నుండి సేవలో పాల్గొనుచున్నాడు. సేవలేని జపములు, భజనలు వ్యర్ధములు . జపములు, భజనలు లేకపోయినను సేవ యున్నచో భక్తి నిరూపించబడినట్లే. తిన్నడు ఏ జపము చేసినాడు? ఏ భజన చేసినాడు? కేవలము తనకున్న దానితో సేవను చేసినాడు. ఇట్టి ఆచరణాత్మక సేవయే స్వామిని నీ వద్ద శాశ్వతముగా నిలుపును. జప తపములతో స్వామిని పట్టు చున్నావు. కాని క్షణములో జారిపోవు చున్నాడు. దీని వలన ప్రయోజనమేమి? నీ వద్దకు ఒక కోటి రూపాయిలు వచ్చి జారిపోయినచో నీవు కోటీశ్వరుడవు అగుదువా! లేదు లేదు. ఆ కోటి రూపాయిలు నీ వద్ద నిలచి నప్పుడే నీవు కోటీశ్వరుడవగుదువు.

జ్ఞానము, భక్తి స్వామిని సంపాదించునే తప్ప స్వామిని నిలుపజాలవు. స్వామి కంటి నుండి నెత్తురు కారినప్పుడు తన రెండు కన్నులను పెకిలించి స్వామికి అర్పించిన తిన్నడి యొక్క ఆచరణా రూపమైన సేవ ముందు కోటి రామ కోటియైనా తులతూగునా? ఒక్క తులసీ దళము ముందు ఎన్ని మణుగుల బంగారమైనను తుల తూగినదా? ఈ ఆచరణాత్మక మైన ప్రేమ నిరూపణమైన సేవ దత్త పరీక్షలలో బయిటపడును. దత్త పరీక్షలు అతి సూక్షముగా యుండును. ఒక్క క్షణకాలములో పరీక్ష పెట్టుట ఫలితములు ప్రకటించుట జరిగిపోవును. మనము చేయు చిన్న చిన్న పనులలో, మనము మాట్లాడు చిన్న చిన్న మాటాలలో, మన మనస్సులో మెదులు క్షణకాల భావములలో కూడా పరమాత్మకు మనము ఇచ్చు విలువ విషయములో ఓడిపోయి ఆ ఫలితములు చిత్రగుప్తుని గ్రంధములోనికి ఎక్కుచున్నవి. కావున పరమాత్మ విషయములో మనసా వాచా కర్మణా ఎంతో శ్రద్ధతో మెలుకువ యుండవలయును. రాజుగారి వద్ద ఎప్పుడు మనము ఎంతో జాగరూకతతో ఉందుము. ఆయన రాజు రారాజు. కావున ప్రతి క్షణము సేవలో ఎంతో జాగరూకత ఉండవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, November 5, 2009

త్యాగేనైకే అమృతత్వ మానసు

"త్యాగేనైకే అమృతత్వ మానసుః" అని శ్రుతి. త్యాగము చేతనే పరమాత్మ లభించును. త్యాగము అనగా దానము. దానమే దత్త శబ్దార్ధము.కావున స్వామి పేరులోనే స్వామిని చిక్కించుకునే మార్గము బోధపడుచున్నది. దానము అనగా ధనము యొక్క దానము మాత్రమే కాదు. స్వామి పరీక్షించినపుడు స్వామి బంధము నుండి అన్ని బంధములు తక్కువేయని నిరూపించవలయును. చివరకు నీ శరీరము పైన బంధము కూడా వదలి ప్రాణ త్యాగము చేయుటకు సిద్ధము కావలయును. నీ శరీర ప్రాణములపై బంధము కూడ ఒక బంధమే. ధర్మము మీద ఉన్న బంధమును సైతము స్వామి పరీక్షలో త్యజించవలయును అని "సర్వధర్మాన్‌ పరిత్యజ్య" అను గీతా శ్లోకము తెలుపుచున్నది. మానమును సహితము త్యజించవలెను. మానము అనగా అభిమానము అని అర్ధము. దీనిని ఆత్మాభిమానమందురు. అనగా తన పై తన కున్న అభిమానము. ఇది కూడ బంధమై అభయమిచ్చిన గయుని వదలినచో ఆత్మాభిమానమునకు భంగము కలుగును. పట్టుదలయును ఒక బంధమే. గయుని రక్షింతును పట్టుదల పట్టికాదు. అర్జునుడు ఆ పట్టుదలచే బంధింపబడినాడు. స్వామిపై తనకున్న బంధము కన్న ఆ పట్టుదలతో నున్న బంధము ఎక్కువ అని నిరూపించినాడు పార్ధుడు. స్వామి కొరకు ఎలాటి పట్టుదలనైనను త్యజించి ఆత్మాభిమాన త్యాగము చేయవలయునని స్వామి పార్ధునికి బోధించుటకై తన పట్టుదలను త్యజించినాడు. పట్టుదల ఎట్లు త్యజించవలయునో ఆచరించి చూపెట్టినాడు. పట్టుదల కూడ అజ్ఞానము యొక్క లక్షణమే. కావుననే పార్ధుడు అజ్ఞాని యగు ఆటవికునిగా తిన్నడుగా పుట్టినాడు. ఇదే సర్వ సాధన యొక్క సారాంశము. స్వామి సర్వాధికుడన్న భావము ఏక్షణములోనైనను నిరూపించుటకు సిద్ధముగా యుండవలెను. స్వామి నీ విశ్వాసమును పరీక్షించుటకు ఒక్కొక్కసారి అధర్మమును ఆచరించమని ఆజ్ఞాపించును. స్వామి చెప్పినదే ధర్మము స్వామి కన్న ధర్మము ఎక్కువ కాదు. ధర్మాచరణము యొక్క ఫలమేమి?

దానిచేత స్వామి ప్రసన్నుడగుననియే కదా? స్వామి ఆజ్ఞను పాలించినచో, స్వామి ప్రసన్నుడగును. కావున స్వామి ఆజ్ఞయే ధర్మము. స్వామితో పోటి పడినచో ధర్మమే తలవంచుచున్నది. ధర్మదేవత ధేను రూపమున స్వామి పాదముల వద్ద తలవంచి 'రక్ష రక్ష' అని యాచించుచున్నది. ధర్మమే తలవంచినప్పుడు, నీవేల తలవంచవు? ఇందులో అసలు రహస్యము ఏమనగా నీవు తలవంచక పోవుటకు కారణము నీ అహంకారము అది బయిటపడుట ఇష్టము లేక ధర్మ శాస్త్రములను వల్లించుచున్నావు. "పెద్దలు ఇట్లు చెప్పినారని" శిష్టాచారమును ఉదహరించుచున్నావు. శిష్టాచారమే కేవలము ప్రమాణమైనచో ప్రహ్లాదుడు తన తండ్రి తాతలు ఆచరించిన రాక్షస ఆచారములను ఏల నిరాకరించెను? కావున జ్ఞానముతో కర్మ చేయవలయును. "జ్ఞాతే కర్మన విజ్యతే" "సర్వం కర్మ దీనం పార్ధ జ్ఞానే పరిసమాప్తతే" " జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భక్తసాత్‌ కురుతే అర్జునా! బుద్ధ్యా యుక్తోయయా పార్ధా కర్మ బద్దం పయశ్యసి బుద్ధియుక్తో జహతీహ ఉభేసకృత దుష్యతే ఆత్మవంతం నకర్మాణి నిబదృంతి ధనుంజయా" ఇత్యాది శ్లోకములన్నియును జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేయుననియు, జ్ఞానము కర్మలను చూచి నవ్వుచున్నదనియు, జ్ఞానిని కర్మలు బంధించజాలవనియు బాధ పడుచున్నది. కావున ధర్మశాస్త్రము గాని పెద్దలు గాని కేవలము నీవు అడ్డుపెట్టుకొను సాకులే తప్ప నీ పట్టుదలకు కారణము నీలోని రజస్తమో గుణమైన అహంకారమే. శరణాగతి ధర్మమును పార్ధుడు అడ్డుపెట్టుకున్నాడే తప్ప పట్టిన పట్టుదల విడవక పోవుట అను క్షత్రియ రాజస అహంకారము దీనికి కారణము. తనకు తెలియకుండా తనలోనే పెరిగిన మాత్సర్యము మరొక కారణము. ఏమి కృష్ణుని ఆధిక్యము? ప్రతిమాట కృష్ణుడు చెప్పినట్లు వినవలసినదేనా? నేను ఆయనకు బానిసనా? అన్న అసూయ అహంకారములే గయుని విషయమున పట్టుదలకు కారణము కావున ఈ అసూయ అహంకారములు పరిపూర్ణముగా ఈ సాధన చేత నిర్మూలించుకున్న నాడే దత్తుడు జీవులకు చిక్కును. అంత వరకు చిక్కుచూ, జారుచూ ఉండును. దత్తుడు మీలో ప్రవేశించి, జారిపోకుండా శాశ్వతముగా నిలువవలయున్నచో అసూయను అహంకారమును నిర్మూలించుకొనుము.

ఎదుటి ఇంటిలో మంచినీటి బావి ఉన్నది. వాని ఇంటిలో ఉప్పునీటి బావి ఉన్నది. "తాతస్య కూపోయమితి బ్రలవాణాః క్షారం జలం కాపురుషాః పిబంతి" అని శాస్త్రవచనము. అనగా మాతండ్రిగారు తవ్వించిన బావియని మూర్ఖుడు ఉప్పు నీటినే త్రాగును. వాడు ఉప్పు నీటిని త్రాగుటకు అసలు కారణము తండ్రిపై అభిమానము గాదు. దానిని అడ్డు పెట్టు కొనుచున్నాడు. వానిలో అసలు కారణము ఎదుటి వారి బావిలో మంచినీరు పడినదను అసూయ. తాను నీటి కొరకు మరియొకరిని యాచించనేలనను అహంకారము. వానిని ఉప్పు నీరు త్రాగునట్లు చేయుచున్నవి. ఇట్టి అహంకారముతో, మూర్ఖత్వముతో, అజ్ఞానముతో, అసూయతో పట్టుదలకు చిక్కి దానిని సడలించుకొనలేక, దానిని బయిట పడకుండా కప్పుకొనుటకు సంప్రదాయములను, పెద్దలిట్లు చెప్పినారనియు సాకులుగా ఉపయోగించుకొనుచున్నారు. "ఇది ఆత్మవంచన" దీనిచే వారు నష్టపోదురు. అజ్ఞానులు చెప్పు అజ్ఞానవాక్యములను గుడ్డిగా విశ్వసించి, అజ్ఞానమయమగు అంధరాల శ్రమమని నరక లోకమున శాశ్వతముగా పడుచున్నారు. అనగా ఆట్టి వారు విచారణకు, జ్ఞానమునకు అవకాశము లేని పశుపక్ష్యాది జన్మలయందు శాశ్వతముగా పడుచున్నారు. గుడ్డివారిని గుడ్డివారు పట్టుకున్నచో గుంటలో పడుట తప్పునా? ఈ అజ్ఞానులు చెప్పు వాక్యములు "అవిచారిత రమణీయములు". అనగా విచారణ చేయనంత వరకు మనోహరములు. ఉదాహరణకు ఈ సృష్టిలో జరుగు ప్రతి పనియును ఈశ్వర సంకల్పమేనందురు. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమయైనా కుట్టదు అందురు. దీని ఆధారముగా చేసుకొని తమ అజ్ఞానమును సమర్ధించుకొను అహంకారమే కారణము. స్వామి నరసింహుని రూపములో వచ్చినపుడు హిరణ్యకశిపుడు స్వామీ! ప్రతిదీ నీ సంకల్పము చేతనే జరుగును కదా. కావున ప్రహ్లాదుని నేను హింసించుట నీ సంకల్పమే. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమ యైననూ కుట్టనప్పుడు నీ ఆజ్ఞ లేకుండా నేను ప్రహ్లాదుని ఇంత హింసించుట సాధ్యమా? కావున నన్ను సంహరించుట అన్యాయము. దానికి స్వామి సమాధానము ఏమని చెప్పును? ఓరీ! రాక్షసా! ఇప్పుడు నిన్ను చీల్చి చంపుటయు ఈశ్వరాజ్ఞయే. ఇదియు స్వామి సంకల్పమే. హత్య చేసాక వాడు న్యాయస్ధానములో ఇదే మాటను చెప్పినచో న్యాయమూర్తి నీకు ఉరి వేయుట కూడా ఈశ్వర సంకల్పమనియే చెప్పును. సృష్టిలో ప్రతి పనియును ఈశ్వరుని శక్తి చేతనే జరుగుచున్నది. నిజమే, కాని ఆపనిలో సంకల్పము ఈశ్వరునిది కాదు. సంకల్పము జీవునిది. సంకల్పించిన వారికే కర్మఫలముండును. సంకల్పము లేకుండా కర్మ చేసిన వారికి కర్మఫలము అంటదు. సంకల్పము ఫలము మీద ఉన్న ఆశ వల్లనే జరుగుచున్నది. ఫలాశ లేని వారికి సంకల్పము కలుగదు కావున కర్మ చేసినను ఫలము అంటదు. అని భగవంతుడు గీతలో పదేపదే ఘోషించినాడు. "మాఫలేషు కాదాచన, మాకర్మ ఫలహితుర్వా, అనాశ్రిత కర్మ ఫలం, సంగం చెత్త్వా ధనుంజయ" ఇత్యాది అనేక శ్లోకములు కలవు.

అడవిలో నున్న నిధిని పొందవలయునని ఆశతో ఒకడు గుర్రమును ఎక్కి అడవికి వెళ్ళినాడు. అక్కడ దొంగలు వానిని కొట్టినారు. వాడు అడవికి పోవుట అను కర్మ గుర్రము చేసినది కాని వారు గుర్రమును కొట్టలేదు. కర్మము జడము. జడము ఫలము నీయజాలదు. కావున సంకల్పము చేసిన వానికే ఫలము అందును. సంకల్పము లేకుండా రావణ శరీర స్పర్శ జరిగినను సీత అపవిత్రురాలు కాలేదు. అగ్ని రామునకు చెప్పినాడు. నర్మదానదిలో స్నానము చేయుచున్న గంధర్వుని చూచి రేణుక మనస్సు చలించననదది.గంధర్వుని కనీసము చేతితోనైనను సృశించలేదు. కావున కర్మ జరగలేదు అయినను శిరచ్ఛేధమను కర్మఫలమును పొందినది. కావున చేయుకున్నను సంకల్పము చేత కర్మఫలము లభించును. కర్మ చేసినను సంకల్పము లేనిచో కర్మఫలము అంటదు. ఎట్టి సంకల్పము లేక తల్లి ఆజ్ఞను అనుసరించి వ్యాసుడు అంబిక, అంబాలికల యందు పుత్రోత్పత్తిని కలుగచేసినాడు. కావున ఆ కర్మఫలము వ్యాసునకు అంటలేదు. ఇదే ధర్మశాస్త్రము యొక్క సారాంశము. కావున సర్వకర్మలను పరమాత్మయే చేయుచున్నప్పటికిని సంకల్పము మాత్రము జీవులవే కావున వాటి ఫలములను జీవులే పొందుదురు. జీవులే కర్తలు భోక్తలు. పరమాత్మ కేవలము సృష్టి సంకల్పమును చేసినా సృష్టి యను కర్మను చేసినాడు. దీనియొక్క ఫలము లీలా వినోదము. అట్టి లీలా వినోదమును ఫలమును తానే పొంోదుచున్నాడు. జగత్తును సృష్టించినంత వరకే స్వామి కర్త, దాని వినోదమును అనుభవించు వరకే భోక్త. ఈ జగత్తులో సృష్టి జరిగిన తర్వాత జరుగుతున్న అన్ని పనులకు పరమాత్మ సంకల్పము లేదు. వాటి సంకల్పము లన్నియు జీవులవే. తన తప్పును కప్పిపుచ్చుకొనుటకే ఈ మయావాదమును జీవుడు చేయుచున్నాడు. ఇట్లే జీవులందరును పరమాత్మయే లేక అన్ని జీవులలో పరమాత్మను చూడుము. ఈ వాక్యములు కూడా అవిచారిత రమణీయములే. సర్వ జీవులు పరమాత్మయే అయినచో పరమాత్మయగు తన తండ్రి జీవుని మాట ప్రహ్లాదుడు ఏల వినలేదు? పరమాత్మ యగు రావణ జీవుని రాముడు ఏల వధించెను? పరమాత్మ యగు తల్లి జీవుని శంకరులు ఏల త్యజించిరి? పరమాత్మలగు భార్యాపుత్రులను ఏల త్యజించెను? ఈ వాక్యమును తప్పు చేసిన వానిని సమర్ధించుకొనుటకు తెలివిగా ఉపయోగించు కొందురు. ఇది శంకరులు చేసిన అద్వైత వాక్యమని చెప్పుదురు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, November 3, 2009

ధనము

ధనము నీ శక్తి యొక్కయు నీ సమయము యొక్కయు స్వరూపమై యున్నది. నీ కాలము శక్తి వ్యయించబడి ధనముగా మారినది. కావున దుర్వినియోగము చేసినచో నీ కాల శక్తులను దుర్వినియోగము చేసినట్లే. నివు భగవంతునికి అర్పించదలచిన ధనము సద్వినియోగము చేసినచో సత్ఫలితమును పొందెదవు. నీవు ధనమును దైవ పూజకు వ్యయించుచున్నావు. పూజ అనగా శోడశోపచారములు ఇంకను రాజోపచారాది అనేక ఉపచారములు. ఉపచారములు అనగా నేమి? ఒకడు జ్వరముతో బాధపడుచున్నాడు వానికి ఔషధము నిచ్చి, పాలు మొదలగు ఆహారము నిచ్చి, విసని కర్రతో విసరుచు ఇట్టి సేవలను చేయుట ద్వారా వాని యొక్క ఆర్తి శాంతించి వాడు ఆనంద పడుచున్నాడు. ఆర్తి యనునది చైతన్యము కలిగిన ప్రాణికి ఏర్పడును. ఆర్తి జడములకు కలుగదు. బ్రహ్మము చైతన్యమని "ఈక్షతే నా శబ్ధం" అని బ్రహ్మ సూత్రము చెప్పుచున్నది. "స ఈక్షాం చకే" అను శ్రుతియు బ్రహ్మమును సృష్టి సంకల్పము చేసినది కావున బ్రహ్మము చైతన్యమేనని చెప్పుచున్నది. శ్రుతిలో సః అను శబ్ధము ఈశ్వరుడును చైతన్య స్వరూపుడే అని చెప్పుచున్నది. చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడు లేదా బ్రహ్మము అవతరించినపుడు చైతన్య స్వరూపమైన ప్రాణిగనే అవతరించును. మత్స, కుర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణాద్యవతారములు ప్రాణులే. పరమాత్మ అచేతనమైన జడముగా అవతరించునట్లు శ్రుతి స్మృతులలో ఎచ్చటను లేదు. కావున పరమాత్మ మనుష్య రూపమున వచ్చినపుడు అవతారములో పరమాత్మ మరియు జీవాత్మ మరియు మనుష్య శరీరము ఉండును. జీవాత్మ ఇతర జీవుల వంటి జీవుడు కాకపోవచ్చును. అనగా స్త్రీ గర్భమున శుక్రరేతస్సుల సంయోగము చేత చైతన్యమయమైన జీవపిండము ఏర్పడును. దీనినే సామాన్య జీవ స్వరూపమందురు. ఈ జీవ స్వరూపములొ వంశ లక్షణములు మాత్రము ఉండును. ఆ తరువాత కొంత కాలమునకు విశేష జీవ స్వరూపము ప్రవేశించును. కొందరి సిద్ధాంతము ప్రకారము పురుషుని రేతస్సు ద్వారానే విశేష జీవ స్వరూపము ప్రవేశించుచున్నది. విశేష జీవస్వరూపము అనగా సంచితము, ప్రారబ్ధము, ఆగామి కర్మఫలములతో కూడియుండును. అవతార పురుషుని శరీరములో ఇట్టి విశేష జీవ స్వరూపము ఉండదు. అవతారములోని జీవ స్వరూపము శుద్ధ చైతన్యమై సద్వంశ లక్షణములను మాత్రము కలిగి యుండును. ఒక్కొక్కసారి పరమాత్మ విశేష జీవ సహితమైన మానవశరీరమును ఆవహించవచ్చును. రామావతారములోని జీవస్వరూపము సామాన్య జీవస్వరూపము. పరుశురామునిలోని జీవస్వరూపము విశేష జీవస్వరూపము. ఏది ఏమైనను అవతారములో పరమాత్మ జీవాత్మ మనుష్య శరీరము అను మూడు ఉండును. జీవాత్మ మనుష్య శరీరములు కలసి ప్రకృతి అనబడును.ఇందు జీవాత్మ ప్రకృతి పరాప్రకృతి, శరీరము అపరా ప్రకృతి. పరమాత్మ పురుషుడు ఇట్లు అవతార పురుషుడు ప్రకృతిని ఆశ్రయించుటి. ఇదే "ప్రకృతిం స్వా మవష్టభ్య" అని గీతలో చెప్పబడినది.

కొందరి మతమున జీవాత్మయే పురుషుడు శరీరము మాత్రమే ప్రకృతి అనబడును. పరమాత్మ పురుషోత్తముడనబడును. ఏది యైనను సత్యమునకు భంగము లేదు. కావున ఉపచారములు పరమాత్మ ఆశ్రయించిన జీవాత్మ సహిత మనుష్య శరీరమునకే. ఈ ఉపచారములు పరమాత్మకు అవసరము లేదు కాని పరమాత్మ ఆశ్రయించి జీవాత్మను మనుష్య శరీరమును సంపూర్ణముగా వ్యాపించినను జీవ శరీరముల ప్రకృతి ధర్మము నశించవు. విద్యుత్‌ తీగె అంతయు వ్యాపించియున్నను సన్నగా ఉండుట వంకరలు తిరిగి యుండుట మొదలగు తీగె ధర్మములు నశించవు గదా. పైగా భక్తుల కర్మఫలములను అనుభవించుటకు ప్రకృతి ధర్మములు ఉండి తీరయలయునేగదా. సిద్ధులను ప్రదర్శింనప్పుడును శరీరము ప్రకృతి ధర్మములను గలిగియే యుండి భక్త కర్మఫల అనుభవ కర్మ ఆగక నిరంతరము జరుగుచునే ఉండును. ఎప్పుడో గోవర్ధన పర్వతోద్ధరణము మొదలగు మహా సిద్ధులను ప్రదర్శించు సమయమున మాత్రమే అవతార శరిరము దివ్యత్వమును పొండి దివ్యశక్తిమయమై ఉండును. కావున అవతార శరీరము క్షుత్పిపాసాది శరీర ధర్మములు కలిగియే యుండును.

కావున అవతార పురుషునకు ఉపచారములు అవసరము. అవతార పురుషుడు లభించనిచో మహాభక్తునకు, మహాభక్తుడు లభించనిచో ఆర్తులగు సజ్జనులకును ఈ ఉపచారములు అను త్యాగము లేక దానము చేయుట పరమాత్మకు సంపూర్ణ ప్రీతి కలిగించును.

రాముడు చిక్కకున్న హనుమంతుడు, హనమంతుడు చిక్కకున్న ఆర్తులు భక్తులైన సజ్జనులు ఈ ఉపచారములచే సేవనీయులు. జడములకు ఉపచారములు -1) కేవలము నీటితో కడుగుట - అనగా స్నానము. 2) పుష్పాలంకరణము వరకు చాలును. స్వామి లేనప్పుడు విగ్రహము, పటము మొదలగునవి దర్శించి భక్తిభావమును పొందవచ్చును గాన విగ్రహారాధనము ఆవశ్యకమే. కాని జడమైన విగ్రహమునకు ప్రాణియగు అవతార పురుషునకు చేయు ఉపచారములు అనవసరము. చీకటిగా నుండి విగ్రహము యొక్క దర్శనము స్పష్టముగా లేకున్నచో దీపోచారము అవసరమగును. కాని విగ్రహమునకు ధూప, దీప, నీరాజన ఉపచారములు అనవసరము. ధూపము ముమశిక్ష మక్షికాదులను తోలుట కొరకే. వాటి వలన విగ్రహములకు ఆర్తి కలుగదు. కాని వాటిచే నీకు ఆర్తి కలిగినచో ధూపమును వేసుకొని, నీవు స్ధిరాసనము సిద్ధించుటకు ఆ ఉపచారము నీవు చేసుకొన వచ్చును. ఇక నీరాజనమనగా విగ్రహము చుట్టును దీపమును త్రిప్పుట. ఇది విగ్రహము ఇంకనూ స్పష్టముగా కనిపించుట కొరకే. కాని నైవేద్య తాంబూలాల ఉపచారములు ప్రాణియగు అవతార పురుషునకు మాత్రమే. విగ్రహములకు వ్యర్ధము. అవతార పురుషునకు లేక మహాభక్తునకు లేక ఆర్తులైన సజ్జనులకు అన్ని ఉపచారములు సార్ధకము గావున చేయవచ్చును. కావున పట్టపగలు సూర్యకాంతిలో దీపము వెలిగించుట ధనమును దుర్వినియోగము చేయుట అగును. అట్లే మశిక మక్షికాదులు లేనప్పుడు దూపోపచారము వ్యర్ధము. సూర్య తేజస్సుతో లేక ఇంటిలోని దీపముతో దర్శనము స్పష్టముగా జరుగుచుండగా, కర్పూర నీరాజనాదులు వ్యర్ధము. నీవు విచక్షణ లేక ఇట్టి ఉపచారములు చేసినచో తైలము వత్తులు కర్పూరము అమ్ముకొని వ్యాపారము చేయువారికి పిచ్చివాడవై సాయపడుచున్నావు తప్ప అది ఉపచారము కాదు. ఉపచారము అనగా పూజలో చేసినది కాదు. ఏదియైనను ఆర్తిని పోగోట్టుటకు మనము చేయు ప్రయత్నము ఉపచారమనబడును. వారధి నిర్మాణము కొరకు స్వామి బాధపడుచుండగా నీవును ఒక బండ వేసి వారధి నిర్మాణమునకు సాయబడి స్వామి యొక్క ఆర్తిని తగ్గించుటయే ఉపచారము. అంతేగాని సముద్రములో బండవేయుట షోడశోపచారము, రాజోపచారములలో లేదు కావున చేయకుండుట అవివేకము. ఉపచారము అనగా ప్రాణి యొక్క ఆర్తిని తొలగించి ఆనందము కలుగచేయుట. ఐతే సమస్త జీవులు ఉపచారమునకు యోగ్యులు కారు. దుష్టులకు ఉపచారము చేయరాదు.

"పరోపకార పుణ్యయ పాపాయ పరపీడన" అని వ్యాసుడు చెప్పినాడు గదా. అనగా ఇతరులకు ఉపచారము చేసి బాధ తగ్గించుట ఉపచారము చేయుట పుణ్యము కావున సజ్జనులు దుర్జనులు అని చూడకుండా అందరుకి ఉపచారము చేయవలెనని అర్ధము చేసుకొనరాదు. ఇదే నిజమైనచో "పరిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కృతాం" అను శ్లోకమునకు విరోధము వచ్చును. అప్పుడు సజ్జనులకు దుర్జనులకు రక్షణము చేయవలయును గదా. సజ్జనులను రక్షించి దుర్జనులను నాశనము చేయుదునని గురువచనము. అట్లు చేయుట ధర్మమని "ధర్మ సంస్ధాపనార్దాయ" అను శ్లోకము చెప్పుచున్నది. కావున వ్యాస శ్లోకములో పర అను శబ్ధమునకు 'ఇతరులు' అని అర్ధము తీసుకొనరాదు. పర అను శబ్ధమునకు శ్రేష్టుడు, సజ్జనుడు అను అర్ధము తీసుకొనవలెను. కావున సజ్జనులకు ఉపచారములు చేయుట దుర్జనులను హింసించుట ఈ రెండును పుణ్యము. అట్లే సజ్జనులను హింసించుట, దుర్జనులకు ఉపచారములు చేయుట ఈ రెండును పాపములే అని తెలియవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad