Friday, January 2, 2009

క్షీరాభ్ది ద్వాదశి సందేశము

[16.11.2002 శనివారము] జ్ఞానము త్రిపుటి స్వరూపముగా యుండును. గమ్యమును గురించిన జ్ఞానము, గమనమును గురించిన జ్ఞానము, గమనము చేయువాడగు జ్ఞాతను గురించిన జ్ఞానము. గమ్యము అనగా భగవంతుడు. అతడు నిరాకారుడా? సాకారుడా? లేక నరాకారుడా? ఇత్యాది విచారణయే జ్ఞేయము అనబడును. ఆ పరమాత్మను చేరు మార్గము జ్ఞానమా, భక్తియా, యజ్ఞయాగాదులా లేక ప్రాణాయామాది యోగమా? ఇత్యాది విషయములు మార్గ జ్ఞానము. ఇక గమనమును చేయు జీవుడు ఎవరు? ఈ శరీ్రమా? చైతన్యమా? బ్రహ్మ స్వరూపుడా? బ్రహ్మములోని అంశయా? బ్రహ్మము కన్న భిన్నుడా? ఇత్యాది విచారమే జ్ఞాత యొక్క జ్ఞానము. సర్వజ్ఞానము ఈ మూడింటికి సంబంధించియే యుండును. ఇందులో మొదటిది భగవంతుని గురించిన జ్ఞానము. భగవంతుడు ఎవరు? పురుషుడా? లేక స్త్రీ రూపమా? లేక తేజోరూపమా? భగవంతుని విషయములో భగవంతుని గురించి చెప్పిన వేదమే ప్రమాణము. ఆ వేదము యొక్క అర్ధము యుక్తికి సమ్మతమై యుండవలెను. మరియును ప్రత్యక్షముగా అనుభవములోనికి రావలయును. శ్రుతి, యుక్తి, అనుభవ ప్రమాణమైనదే బ్రహ్మజ్ఞానము. వేదములో సర్వత్రా “సః పురుషః” ఇత్యాది శబ్ధములచేత పరమాత్మ పురుష స్వరూపముగనే చెప్పబడు చున్నది. మరియు ఆయన యొక్క శక్తి, శక్తి, మాయ, ప్రకృతి మొదలగు శబ్దములచే చెప్పబడు చున్నది. ఈ శబ్దములు స్త్రీలింగ శబ్దములే తప్ప స్త్రీ స్వరూపమును బోధించవు. ఒక కవిలోని కవితా శక్తి స్త్రీ స్వరూపము కాదు. ఇది వ్యక్తి యొక్క సామర్ధ్యము. అనగా గుణము. ఈ పరమాత్మ యొక్క సామీప్యము నందున్న స్త్రీ స్వరూపమును ఉమగా శ్రుతి చెప్పుచున్నది. లోకములో పురుషుని స్త్రీ సేవించుచున్నది. కావున పరమాత్మ పురషుడుగాను, పరమాత్మ యొక్క సామర్ధ్యమైన మాయ శక్తిని నపుంసక లింగముగాను, పరమాత్మను సేవించు జీవుని స్త్రీగాను తీసికొనవలయును. జీవుడన్నపుడు జగత్తును కూడా తీసుకొనవచ్చును. జగత్తు అనగా ప్రకృతి. ప్రకృతి అనగా ప్రశస్తమైన కృతి. అనగా శ్రేష్ఠమైన కార్యము. ఈ ప్రకృతి అపరాప్రకృతి యను జడముగాను, పరాప్రకృతి యను చైతన్యముగాను రెండు భాగముల ఉన్నది. ప్రకృతి యనగా వ్యక్తమైన పరమాత్మ శక్తి. అనగా కార్యశక్తి. పరమాత్మలో అవ్యక్తముగా నుండి పరమాత్మ కన్న వేరు చేయలేని కారణశక్తియే మాయ. అగ్ని పరమాత్మ యైనచో కాల్చు గుణమే మాయ. బయిటకు వచ్చిన వెలుతురే ప్రకృతి. కవితా శక్తి మాయ. కావ్యము ప్రకృతి. పరమాత్మ యొక్క చిత్ర విచిత్ర నిర్మాణశక్తియే మాయ. చిత్ర విచిత్రముగా నిర్మింపబడన జగత్తే ప్రకృతి. ఈ పరమాత్మ యొక్క తత్వము వేదములకు సైతము అందరానిది. పరమాత్మను గురించి ఏమియు తెలియజాలమని తెలియుటయే జ్ఞానము అని “యస్య మతం తస్య మతం” అను శ్రుతి చెప్పుచున్నది. ఇతడు జ్ఞానస్వరూపుడై, ఆనందస్వరూపుడై, సకల కల్యాణ గుణ పరిపూర్ణుడై అనూహ్యమైన అనంతమైన మాహశక్తి యొక్క ఘన స్వరూపమై యుండును. “ప్రజ్ఞాన ఘనః, తనూంస్వామ్‌, ఆదిత్య వర్ణం” ఇత్యాది శ్రుతులు ఇదే చెప్పుచున్నవి. పరమాత్మ నిరాకారుడన్న వాదము సరికాదు. కాంతి మొదలగు జడశక్తులు విడిగా కనిపించు చున్నవి కాని ఒక వ్యక్తి ఆశ్రయము లేని చైతన్యము విడిగా లోకములో కనిపించుటలేదు. కావున చైతన్యమే బ్రహ్మము అనువారలు చైతన్యమునకు అధిష్టానమైన వ్యక్తిని అంగీకరించవలెను. దీనినే “బ్రహ్మ పుచ్చం ప్రతిష్టా” అని శ్రుతి చెప్పు చున్నది.
“ఆరూపమ్‌” మొదలగు శ్రుతులను పరమాత్మ నిరాకార స్ధితిని చెప్పును. “ప్రత్యగాత్మాన మైచ్చత్‌” “పరి పశ్యంతి” అను శ్రుతులు పరమాత్మ సాకారుడని చెప్పుచున్నవి. అయితే ఈ పరమాత్మ యొక్క స్వస్వరూపమును ఈ చర్మ చక్షువులు చూడలేవు. ఆయన దివ్య దృష్టిని అనుగ్రహించగా ఈ చర్మ చక్షువులే దివ్య శక్తిని పొంది దివ్యనేత్రములై ఆయనను దర్శించగలవు. అర్జనుడు ఆయన నిజ స్వరూపమును దివ్య చక్షువులతోనే దర్శించగలిగెను. ఆ దివ్యస్వరూపము ముందు ఈ జగత్తు అత్యల్పము. సూర్యునిలో ఒక కిరణము. ఒక మానవునిలోని ఊహ ఆయన యొక్క ఊహయే ఈ జగత్తు. ఈ జగత్తులోను ఒక పరమాణువు అగు జీవుడు ఆయనను ఎట్లు దర్శించగలడు? ఒక వ్యక్తి యొక్క ఊహ అంతయు కలసిన ఆ వ్యక్తి యొక్క రోమమును కూడా కదిలించ జాలదు. కావున ఆయన ఊహయగు ఈ జగత్తు ఆయన యొక్క రోమమును కూడా కదిలించ జాలదు. గోవర్ధనమును ఎత్తిన శ్రీకృష్ణుడు ఈ విశ్వమంతయు నాపై పడిననూ నావేలు అల్లాడదు అని చెప్పినాడు. కావున అటువంటి మహాశక్తి సంపన్నుని చూచుటయే దుర్లభమైనప్పుడు, ధ్యానించుట అసంభవము. ఇక స్పర్శ కలలో మాట. ఇక సహవాస సంభాషణములా? ఊహించుటకును వీలుకాదు. ఆయన ఈ నిజ స్వరూపమును అవ్యక్త స్వరూపమందురు. దానిని ఆరాధించుట కష్టము. అది దుఃఖకరము. అందుకే "అవ్యక్తాహి గతి దుఃఖం" అని గీత చెప్పినది. కావున “ప్రకృతిం స్వాం అధిష్టాయ”, “సంభవామి యుగే యుగే”, “ఆత్మమాయయా”, “మానుషీం తను మాశ్రితమ్‌” అను గీతల ప్రమాణముగా ఆయన ప్రకృతి స్వరూపమగు ఒక నరరూపమను ఆశ్రయించి అధిష్టించును. ఆయన సత్‌ అను శబ్ధము చేతను, ఈ నర రూపము న్యత్‌ అను శబ్ధము చేతను శ్రుతిలో “సచ్చత్యత్యాభవతు అసమ్నేవ సభవతి” ఇత్యాది మంత్రములలో చెప్పబడినది. దీనినే అవతార మందురు. తీగెను వ్యాపించిన కరెంటు వలె ఎక్కడ తగిలినా షాక్‌ కొట్టినట్లు ఈ నర రూపమంతయు సద్రూపమే అయియుండును. రవ్వ లడ్డూలో గోధుమ రవ్వతో కలసిన పంచదార వలె ఎక్కడ ఎంగిలి చేసినను తియ్యగనే ఉండును. ఇట్లు పరమాత్మ జీవులకు నిరంతరమము అనభవమునకు అందుచు ప్రత్యక్షమగు చున్నాడు. “యత్సాక్షాత్‌ అపరోక్షాత్‌ బ్రహ్మ” అను శ్రుతి దీనినే చెప్పుచున్నది. కావున ప్రత్యక్ష ప్రమాణమును విశ్వసించు నాస్తికుల సహితము పరమాత్మను ప్రత్యక్షముగానే అంగీకరించవలెను. ఈ విధముగా శ్రుతికి ప్రత్యక్ష ప్రమాణ బలము ఉన్నది. కావున శ్రుతిని కల్పనగా తీసుకొనరాదు.

కాలము-శక్తి-కర్తవ్యములు

[15. 11. 2002] కర్తవ్యములు: కర్తవ్యముల వరకు సంబంధించిన లౌకిక జ్ఞానము అవసరమే. అదియును సాధనలో ఒక భాగమే. ఏలననగా సాధన చేయుటకు అన్నపాన వస్త్రములు కావలయును. “శరీర యాత్రా పిచతే” అను గీత ప్రకారముగా ఈ మూడును కలిపి శరీర యాత్రా అనబడును. సంన్యాసికి సైతము ఈ మూడు కావలయును. ఇక గృహస్తునకు వీటితో పాటు గృహము మరియును దారాపుత్రులకు అన్నపాన వస్త్రములు కావలయును. మానవ జీవితము ఒక నిర్ధిష్టమైన ఆయుఃప్రమాణము కాలము కలిగి యుండును. కావున కాలము పరిమితము. ఇక తిను అన్నమును అరిగించి శక్తిని పుట్టించుటకు జీర్ణకోశము రోజుకు రెండు లేక మూడు సార్ల కన్న ఎక్కువ పని చేయదు. ఈ రెండు మూడు సార్లలో ప్రతిసారి పరిమితాహారమును గ్రహించి పరిమితమైన శక్తినే పుట్టించగలవు. ఈ విధముగా కాలశక్తులు పరిమితములై యున్నవి. ధనము వ్యర్ధమైనచో ఎంత ధనమునైనను మరల సంపాదించవచ్చును. కాని కాలశక్తులలో ఒక్కచుక్క వ్యర్ధమైనను మరల సంపాదించలేము. ఈ కాలశక్తుల గురించిన జ్ఞానమే అర్ధనారీశ్వర స్వరూపము. శివుడు కాలము, పార్వతి శక్తి. అదే కాలభైరవ స్వరూపము. అది గురుతత్వమై యున్నది. గురువు అనగా జ్ఞానము. కావున కాలభైరవుడు గురువు. అనగా కాలము యొక్క, శక్తి యొక్క విలువను తెలుసుకొనుటయే. ఇది తెలుసుకొని లాభపడుటయే కాలభైరవుని అనుగ్రహము. ఓ జీవా! కాలమును, శక్తిని వ్యర్ధ పరచకుము. కర్తవ్యములు పోను మిగిలిన కాలశక్తులను భగవదర్పణము చేయుము. కర్తవ్యముల పేరుతో లౌకికమును పొడిగించకుము.
1) సంన్యాసి వైనచో అన్నపాన వస్త్రముల వరకే కర్తవ్యము.
2) గృహస్తుడైనచో దారాపుత్రుల అన్నపానముల వరకే పరిమితము కమ్ము.
3) పుత్రికలు అత్తవారింటికి పోగా, పుత్రులు వారి వారి కాళ్ళపై నిలబడగా అప్పుడైనను వెనుకకు తిరుగుము. అంతే కాని తరతరములకుసరిపోవు ధనమును సంపాదించుట వలదు.
4) మనుమలు మనుమరాళ్ళ భాధ్యత నీకనవసరము. అంత్య కాలము కొన్ని ఘడియలలో యుండగా అప్పుడును మనుమలు మనుమరాళ్ళతో తైతక్కలాడి కాలశక్తులను వ్యర్ధము చేయుచున్నావు. ఈ జన్మయను సినిమా షూటింగు మిగియగనే నీవును, నీవారును శతృవులుగా యుద్ధము చేయు పాత్రలో చేరవచ్చును. లేక నీవే మరు జన్మమున కుక్కవైపుట్టి నీవారిని చూచుటకు పోగా నీవు లాలించిన మనుమలు మనుమరాళ్ళు నిన్ను నీ ఇంటిలోనికి రానీయక రాళ్ళతో కొట్టగా ఎంతో దుఃఖముతో నీవు విలపించుచు పోవుచుండగా పరమాత్మ దయతో ఒక సద్భక్తుని ఆవేశించి నిన్ను పిలచి నీకింత అన్నము పెట్టించును. ఇప్పటికి సిగ్గు తెచ్చుకున్నావని తెలిసి మరల నీకు మానవ జన్మ ప్రసాదించగా, మరల “కుక్క తోక వంకర” యును రీతిలో లౌకిక బంధమలలో మునిగి తైతక్కలాడుచున్నావు. ఇట్లు నాలుగు ఐదు సార్లు చూసి వీనికి ఇంక బుద్ధిరాదని శాశ్వతముగా పశుపక్ష్యాది జన్మలే ఇవ్వబడుచున్నవి. కాలశక్తులు ముచ్చట్లతోను, కధల పుస్తకములతోను, టివి సినిమాలతోను వ్యర్ధపరచువాడు శాశ్వతముగా నష్టపోవును. కనీసము కాలశక్తులను ధనార్జనలో వినియోగించువాడు ఒకనాటికైననూ తరించవచ్చును. ఒకనాటికైనను ఆ కాలశక్తులను వ్యయము చేసి సంపాదించిన ధనములో కొంత స్వామి సేవకు వినియోగించినప్పుడు ఆ కొంత ధనమును సంపాదించుటకు ఎంత కాలశక్తులను వినియోగించినాడో అంత కాలశక్తులను భగవత్పరము చేసినవాడగును. కావున తరించగలడు.
5) కావున అతి ముఖ్యమైన కర్తవ్యములు పోను మిగిలిన కాలశక్తులను దత్తసేవలో వినియోగించుము లేదా ఆ మిగిలిన కాలశక్తులతో ధనమును ఆర్జించుము. ఈ రెండింటికి కాక ముచ్చట్లు మొదలగు వ్యసనములతో కాలశక్తులు దుర్వినియోగ పరచి ఇహపరములకు దూరమగుచున్నావు.
6) ధనమును దత్త సేవలో వినియోగించు విధానము కూడా తెలియవలెను. చాలా మంది గుళ్ళు, ఆశ్రమములు నిర్మించి దైవసేవ చేసినామని తలచుచున్నారు. ఉన్న దేవళములన్నియు పాడు పడుచుండగా కొత్త గుడులు ఏల? పెద్ద దేవాలయములు ఎందుకు నిర్మించబడినవి? గుడి యొక్క ప్రధాన లక్ష్యము సత్సంగము జరుపుటకే గాని, అర్చనలు ప్రసాదముల వరకు కావు. దైవ ప్రతిమ గల గర్భాలయము చాలా చిన్నదిగా యుండును. ఈనాడు గుడిలో సత్సంగము యను మాటయే లేదు. కోరికల జాబితాతో క్యూలో నిలబడి దైవముతో వ్యాపారము చేయు వారితో గుడి కిటకిటలాడు చున్నది. కొత్త గుడులు వ్యాపారాభివృద్ధికై నిర్మించబడిన కొత్త దుకాణాల వలెయున్నవి. మరియు ఆశ్రమములు సామంత రాజుల రాజ్యములవలె యున్నవి. శ్రీ దత్తుడు చేసిన అద్భుతములను తానే చేశానని గర్వముతో మత్తెక్కి భక్తులు పొగుడుచుండగా తానే దత్తుడనని పలుకుచూ ఆశ్రమములను విస్తరించుకొనుచున్నారు. ఇట్టి వారిని గురువులుగా చేసికొని ఆజ్ఞానులగు జీవులు గుడ్డివానిని పట్టుకున్న గుడ్డివాని వలె భావిలో పడుచున్నారు.
7) కావున సత్సంగములను చేసి వాటిని గ్రంధములుగా ముద్రించి ఆ గ్రంధములు సంచార దేవాలయములుగా మారి జ్ఞానప్రచారము చేయవలెను.
8) అట్లే భజనలు పాడుచు కాసెట్ల రూపములో భక్తి ప్రచారము చేయవలెను. పూర్వకాలమున ముద్రణము లేనందున శంకరులు సత్సంగ చర్చలతో జ్ఞానప్రచారమము చేసెను. అట్లే ఆ కాలములో కాసెట్లు లేనందున మీరాబాయి భక్త బృందములతో పాడుచు భక్తి ప్రచారము చేసెను. శంకరులు గాని, మీర గాని దేవాలయములును గాని, ఆశ్రమములను గాని ఎచ్చటను ఎప్పుడును నిర్మించలేదు. ఇట్లు అంతరార్ధము తెలిసి సేవ చేసిననే జ్ఞానరూపుడగు శ్రీ దత్తునికి ప్రీతికలుగును.

కార్తీక శుద్ధ దశమినాటి దివ్యవాణి

[14.11.2002 గురువారము మధ్యాహ్నము 2.30 చిత్రభాను నామ సంవ్సరము కార్తీక శుద్ధ దశమి] ఎంతో జ్ఞానము కలిగిన పండితులకును భక్తి వచ్చుటలేదు. జ్ఞానము వలన భక్తి వచ్చును అన్నాము కదా! మరి వీరిలో జ్ఞానము భక్తిని ఏల పుట్టించుట లేదు. దీనికి కారణము వీరిలో బ్రహ్మజ్ఞానము వంటపట్టుట లేకపోవుటయే. ఎన్ని శాస్త్రములు చదివినను, ఎన్ని సత్సంగములు చేసినను బ్రహ్మజ్ఞానము వీరిలోనికి ఎక్కలేదు. తడుసిన కట్టెకు ఎన్నిసార్లు అగ్గిపుల్ల గీసి అంటించిననూ దానిలోనికి అగ్ని ప్రవేశించదు. కావుననే జ్ఞానయోగమునకు చిత్తశుద్ధి అవసరమని శంకరులు అన్నారు. చిత్తశుద్ధి అనగా ఎండిన కట్టె. కట్టె అనగా మనస్సు. ఈ లౌకిక జ్ఞానమే నీరు. మానవుని మనస్సు అను కట్టె లౌకిక జ్ఞానము అను నీరుతో చేరనపుడు ఎన్ని గ్రంధములు చదివినను, ఎన్ని సత్సంగములు చేసినను వ్యర్ధమే. లౌకిక జ్ఞానమును ఈ నీరు ఎన్నో విధములుగా మనస్సు అను కట్టెలోనికి ప్రవేశించుచున్నది. ఆ విధములను విచారించి వాటిని నిరోధించిన గాని ఈ కట్టె ఎండు కట్టె కాదు. ఈ విధములు ఏవి?

అనగా లౌకికులగు మానవులతో సంగము పెట్టుకొనుటయే. భార్య, భర్త, సంతానము, బంధువులు, మిత్రులు వీరందరును లౌకికులే. వీరితో కల బంధములన్నియు లౌకక బంధములే. అనగా సినిమా షూటింగులోని పాత్రల మధ్య బంధములే. ఈ బంధములు అసత్యములు కావున అశాశ్వతములు. చివరకు నటుడు వేసుకన్న వేషముతోటి బంధము కూడా అసత్యము అశాశ్వతము. నాటకము తర్వాత ఆ వేషమును తీసి విడిగా పెట్టినప్పుడు ఆ వేషము మరియొక నటుడు ధరించుచున్నాడు. ఈ శరీరమే ఆ వేషము. మరణానంతరము ఈ శరీరము పంచభూతములలో కలసి ఆ పంచభూతములు మరియొక జీవునకు శరీరముగా ఏర్పడుచున్నవి. కావున ఈ శరీరము మరియు సర్వ లౌకిక బంధములను అసత్యములై అశాశ్వతములై మరణానంతరము జీవునకు ఎట్టి శ్రేయస్సునూ కలుగ చేయజాలవు. ఈ లౌకిక బంధములు గల వ్యక్తులు ఎల్లప్పుడును బ్రహ్మజ్ఞానమునకు సంబంధించని లౌకిక విషయములనే మాటలాడుచు ఇంజక్షనుల ద్వారా లౌకిక జ్ఞానమను విషమును ఎక్కించుచున్నారు. ఈ విషములు చాలక పెండిడ్లు, పేరంటములు, మీటింగిలకు పోయి ఇంకను విషము నెక్కించుకొనుచున్నారు. అంతటితో ఆగక, ఇదియును చాలక టి. విలు, సినిమాలు, నవలలు చదువుట, వార్తాపత్రికలు వీక్లీలు చదువుట, పని కల్పించుకుని ఇతరుల గృహములకు వెళ్ళి ముచ్చట్లు చెప్పుకొనుచూ పూర్తిగా తడిసిన కట్టెలగుచున్నారు. వీరు సత్సంగమునకు వచ్చికూడా లౌకిక విషయములనే మాట్లాడు కొనుచున్నారు. చివరకు సత్సంగ ఫలము కూడ లౌకిక లాభములకే భావించుచున్నారు. ఇట్లు ఈ సంసార సాగరమున నిత్యము మునిగియుండు ఈ కట్టెలకు ఎన్ని బోధలను అగ్గిపుల్లలను గీచినను ప్రయోజనము లేదు. కాలభైరవుని శాసనము ననుసరించి వీరికి వచ్చు అనగా రాబోవు జన్మలన్నియు పశు, పక్షి, మృగ, కీటకాది జన్మలే అయియున్నవి. ఇది శ్రీ దత్తుని హృదయమునకు ఎంతో విచారము కల్గించుచున్నది. కావున లౌకికుల మాటలను వినుటయను శ్రవణమును వెంటనే ఆపివేయవలెను. శ్రవణము ద్వారా లౌకిక జ్ఞానము మనస్సునకు ఎక్కుచూ మననములు అను చింతలకు దారితీయుచున్నది. మననము పెరిగిన వాడు భాషణము చేయును. ఆ భాషణము వలన మరియొకని మనస్సునకు లౌకిక విషము ఎక్కుచున్నది. కావున దీని అంతటికిని మందు ఒక్కటే. లౌకికుల సంగమును పరిహరించుము. తప్పనిసరి అయినచో కుశల ప్రశ్నలు అడిగి తప్పుకొనుము. లౌకిక సంగమును పరిహరించినచో లౌకిక వాక్య శ్రవణము తప్పును. శ్రవణము తప్పినచో మనస్సునకు లౌకిక జ్ఞానము తగ్గును. అనగా కట్టెలోని తడి తగ్గును. క్రమముగా తడి తగ్గి ఎండిన కట్టె అగును. అట్లే క్రమముగా లౌకిక జ్ఞానము పూర్తిగా నశించగనే చిత్తము శుద్ధమై పరపూర్ణ చిత్తశుద్ధి ఏర్పడును. ఇప్పుడు ఎండు కట్టెకు అగ్గి పుల్లగీచి ముట్టించినచో అగ్ని స్వరూపమై ఆ ఎండు కట్టె మండును. అట్టి చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత జ్ఞానుల సత్సంగమున పాల్గోన్నచో జ్ఞానము వంటపట్టును. అప్పుడు ఆ జ్ఞానము భక్తికి దారి తీసి భగవత్ప్రాప్తిని కలిగించును. ఈ చిత్తశుద్ధి కొరకు చేయు ప్రయత్నములే యమము, నియమము. లౌకిక సంగమును పరిహరించుటయే యమ, నియమముల సారాంశము.
భార్యా, పతి, పుత్రాదులును లౌకిక బంధములే కావున వారితోను అతిముఖ్య కర్తవ్య విషయములతోనే మాట్లాడి లౌకిక విషయ చర్చలను తగ్గించుము. మీ ఇంటిలోని వారు మీ సొంతవారనియు, ఎదురింటివారు పరాయివారనియు భ్రమపడుచున్నావు. నాటకములో సుబ్బయ్యయనువాడు నీ పుత్రునిగా నటించినాడు. ఎల్లయ్యయనువాడు ఎదుటివాని పుత్రునిగా నటించినాడు. నాటకము ముగియగనే సుబ్బయ్య, ఎల్లయ్య ఇద్దరు సమమే కదా. సుబ్బయ్య నిజముగా నీ కొడుకు కాదు, ఎల్లయ్య నిజముగా ఎదురింటి వాని కొడుకు కాదు. నీ నిజ జీవితములో కష్టము వచ్చినప్పుడు సుబ్బయ్య ఆదుకొనక, ఎల్లయ్య ఆదుకున్నాడనుకొనుము, ఇప్పుడు చెప్పుము. ఈ రాత్రి నాటకములో నీకొడుకుగా నటించిన సుబ్బయ్య నీ ఆత్మీయుడా, లేక నీ నిజ జీవితంలో సాయపడిన ఎల్లయ్య ఆత్మీయుడా? అట్లే నీకు నిజముగా శ్రేయస్సును కలుగచేయు, సత్సంగమును కలిగించు జ్ఞానులు భక్తులే నీ ఆత్మీయులని తెలియుము. అట్టి వారిపై మమకారమును పెంచుకొనుము. వారే నిజముగా నీబంధువులు. వారిని సేవించుము. వారికి సాయపడుము. నీవు ధన్యుడ వగుదువు. తల్లిదండ్రుల బంధములు కూడా నాటక బంధములే. స్వర్గములో యున్న అభిమన్యుడు అర్జునుని చూచి “నీవే జన్మలో తండ్రివి” అని అడిగినాడు. కావుననే త్యాగరాజు తల్లిదండ్రుల, బంధువుల పేర్లు చెప్పక “సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి లక్ష్మణాదులు సో్దరులు హనుమదాదులు బంధువులు” అని చెప్పినాడు. ఇట్టి స్ధాయికి మానవుడు వచ్చినపుడే తప్ప, మానవుడు జ్ఞానయోగమును మొదటి మెట్టు ఎక్కలేడు.

పరబ్రహ్మ స్వరూప నిర్ణయము

పరబ్రహ్మము సాకారుడే. ఈ పరబ్రహ్మము “సః పురుషః” ఇత్యాది శబ్ధములచే శ్రుతులలోను పురుషోత్తముడని గీతలోను ప్రస్తావించబడియున్నది. కావున ఈ పరబ్రహ్మము సాకారమే కాక శ్రేష్ఠమైన పురుషాకారమైయున్నది. ఇంత మాత్రమున జీవులలో స్త్రీల కన్న పురుషులులెక్కువ అని భావించరాదు. జీవులందరు ప్రకృతి రూపులైన స్త్రీలే. జీవులలోనున్న పురుషులు, పురుష వేషమున ఉన్న స్త్రీలే యని భావించవలెను. పరబ్రహ్మమొక్కడే పురుషుడు. “పురుష ఏ వేదగం సర్వం”, “అధ పురుషోహవై నారాయణ” అను శ్రుతులు దీనినే చెప్పుచున్నవి. ఈ నిర్గుణ, యోగీశ్వరస్వరూపము కోటాను కోట్ల సూర్యుల తేజస్సుతో విరాజిల్లుతూ చర్మచక్షువులకు అగ్రాహ్యమైయున్నది. ఈ మూలరూపము కేవలము ఆ పరమాత్మ అనుగ్రహముచే దత్తమైన దివ్యనేత్రమునకే చూచుటకు సాధ్యము కావున కనపడడు అను శ్రుతులన్నియు చర్మ చక్షువులకు చూచుటకు వీలుగాని మూలరూపమును గురించి చెప్పుచున్నవి. కనపడును అన్న శ్రుతులన్నియు చర్మచక్షువులచే చూడబడు అవతార బాహ్యమనుష్య రూపమును గురించియు, లేక దివ్య క్షువులచే చూడబడు మూలరూపమును గురించి చెప్పుచున్నవి. ఇక బుద్ధికి కూడా అర్ధము కాని పరబ్రహ్మతత్త్వమును గురించి చెప్పిన శ్రుతులు మూలస్వరూపమునకును, అవతార స్వరూపమునకును వర్తించును. అనాద్యనంతమైన విశ్వమును సృష్టించిన మూలస్వరూపమును గురించిన తత్త్వము బుద్ధికి ఎటూ చిక్కదు. ఇక అవతార స్వరూపము కంటికి కనపడుచున్నను, దీని తత్త్వము కూడా బుద్ధికి చిక్కుటలేదు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కంటికి కనపడుచున్నను గోవర్ధన పర్వతమును చిటికిన వేలుపై నిలిపినపుడు ఆ కృష్ణతత్త్వము బుద్ధికి అగ్రాహ్యమై యున్నది కదా! ఇక మూలస్వరూపము సాకారము కాక నిరాకారము అని చెప్పినచో బాగుండునని కొందరు తలచుచున్నారు. వీరి మతము ప్రకారముగా ఆది అంతములు లేని ఈ విశ్వమును భరించు వస్తువు కూడా ఆది అంతములు లేనిదై యుండవలెను. ఇట్లు చెప్పినచో ఇది తర్క సమ్మతముగా యుండును. కాని పరబ్రహ్మతత్త్వము తర్కాతీతము కదా! కావున ఆది అంతములు కలిగి పరమితమైన ఒక రూపము ఆది అంతములు లేని అపరిమితమైన ఈ జగత్తును ధరించి ఉన్నదని చెప్పినచో ఇది తర్కమునకు అందని విషయమై యుండును. అనగా పరిమితాకారము కలిగిన కృష్ణుడు అపరిమితమైన జగత్తును ధరించియున్నాడు అన్నచో ఈ విషయము బుద్ధికి అందదు. అట్లు కాక అపరిమితమైన నిరాకార పరబ్రహ్మ స్వరూపము అపరమితమైన జగత్తును ధరించి ఉన్నది అన్నచో ఈ విషయము బుద్ధికి తర్కసహితముగా అందు చున్నది. తర్కసహితముగా బుద్ధి పరబ్రహ్మతత్త్వమును అందుకొనలేదని శ్రుతులు చెప్పుచున్నవి కదా! కావున పరిమితాకారము గల సాకారమైన యోగీశ్వర మూలస్వరూపమే అసలు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమనియు నిశ్చయించబడుచున్నది. ఉదాహరణకు పరమితాకారము కలిగిన బాలకృష్ణుడు తన చిన్న నోటిలో అనంత జగత్తును యశోదాదేవికి చూపుట చేత పరిమితాకారుడైన ఆ బాలకృష్ణుడే పరబ్రహ్మమని చెప్పుటలో తర్కమునకు అందని తత్త్వము స్పష్టమగుచున్నది.

పరబ్రహ్మ స్వరూపము

పరబ్రహ్మము ఇంద్రయములకును, మనస్సుకును, బుద్ధికిని, ఊహలైన తర్కములకును అందదు అని ఆనేక శ్రుతులు బోధించుచున్నవి కదా! ఉదాహరణకు 'న తత్ర వాగ్గచ్చతి', 'న మనోగచ్చతి', మరియు 'ఎ తోవాచో నివర్తంన్తే', 'అప్రాప్య మనసాసః', 'యో బుద్ధే పరతస్తు సః', 'న మేధయా', 'నైషాతర్కేణ', 'న చక్షుషా', 'న సందృసే', 'అతర్క్యః కధమే తత్‌ విజానీయామ్‌' అను శ్రుతులన్నియును ఈవిషయమునే చెప్పుచున్నవి. ఇట్టి బ్రహ్మము “యత్‌ సాక్షాత్‌” మరియు “ప్రత్యగాత్మాన మైక్షత్‌” ఇత్యాది శ్రుతులు పరబ్రహ్మము కంటికి కనబడుచున్నదని చెప్పుచున్నవి. వీటి సమన్వయము ఎట్లు చేయవలెను? కంటికి కనబడుచున్న బ్రహ్మము అవతారపురుషుడనియు, కంటికి కనబడని బ్రహ్మము అగ్రాహ్యమైన నిర్గుణ బ్రహ్మమనియు చెప్ప వచ్చునా? శ్రీకృష్ణుని అర్జునుడు చర్మ చక్షువులతో చూచుచునే ఉన్నాడు. అయితే శ్రీకృష్ణుని అసలు స్వరూపమైన యోగీశ్వర స్వరూపమును చూపమని అర్జునుడు అడిగినపుడు శ్రీకృష్ణుడు తన నిజ స్వరూపమును చర్మ చక్షువులతో చూచుటకు వీలు కాదనియు, దానిని దివ్యనేత్రములతో చూడమనియు చెప్పి సమస్త విశ్వమునకు కారణ, ధారణ, మారణ తత్త్వమైన తన పరబ్రహ్మ స్వరూపమును చూపినాడు. అనేక దేవతాముఖములతో జగత్తునంతయు పుట్టించి, భరించి, ఉపసంహరించి తన నిజస్వరూపమే సృష్టి, స్ధితి, లయ కారణమైన పరబ్రహ్మ స్వరూపమని చూపించినాడు. ఆ స్వరూపమునకు కాళ్ళు, చేతులు, ఉదరము, ముఖము మొదలగు అవయవములున్నవి. మరి ఆ నిర్గుణ పరబ్రహ్మము నిరాకారము ఎట్లగును? ఈ జగత్తుకు సృష్టి, స్ధితి, లయ కారణమైన పరబ్రహ్మము నిరాకారమని బ్రహ్మ సూత్రములు చెప్పుచున్నవి. “అరూప వ దేవ తత్ప్రధా నత్త్వాత్‌” శ్రుతియు “న రూపమస్త్యేహ” అనియు “అరూపమవ్యయం” అనియూ నిరాకార తత్త్వమును కూడా ప్రస్తావించుచున్నది. కావున ఈ శ్రుతులను, గీతలను, బ్రహ్మ సూత్రములను సమన్వయించి పరబ్రహ్మ స్వరూపమనను నిర్ణయించవలెను. ఈ నిర్ణయము ఈ విధముగా ఉన్నది.

శుద్ధావతారము - ఆవేశావతారము

రామకృష్ణాది అవతారములు శుద్ధావతారములు లేక నిత్యావతారములు అనబడును. ఇందులో స్వామి శుద్ధ చైతన్యముతో కూడిన తన సంకల్పముచే సృష్టించబడిన శరీరమును ఆశ్రయించి అవతార జననము మెదలు మరణము వరకు అందులో నిత్యముగా యుండును. ఆవేశావతారములో పరమాత్మ ఒక సామాన్య మానవుని ఆవేశించును. ఇట్టి ఆవేశములో సామాన్య మానవుని శరీరముతో పాటు జీవుని కూడా వ్యాపించి యుండును. ఇట్లు వ్యాపించిన సమయమున శుద్ధావతారమునకు, ఆవేశావతారమునకు ఎట్టి భేదము లేదు. ఒక లోహపు తీగెను కరెంటు వ్యాపించి యున్నను, రెండు లోహముల మిశ్రమమైన తీగెను కరెంటు వ్యాపించియున్నను, కరెంటు ప్రవహించుచున్నంత వరకు ఆ రెండునూ కరెంటు తీగెలె. కావున ఆవేశావతారమైన పరశురాముడు దశావతారములలో చేర్చబడినాడు. పరశురాముడు ఒక ముని కుమారుడు. అతని శరీరములో సంస్కారమయుడైన జీవుడున్నాడు. ఆ శరీరము అతనికి కర్మఫల లబ్ధమే. ఆ శరీరము ఒక వృక్షము వంటిది. ఆ శరీరములో ఉన్న ఆ జీవుడు ఒక పక్షి వంటివాడు. ఆ జీవుడు అనేక జన్మలు పరమాత్మకై తపించినవాడు. ఆట్టి ఆ జీవుని శరీరమును పరమాత్మ ఆవేశించుట పరమాత్మ అను మరొక పక్షి ఆ శరీరమున వాలి ఆ జీవునితో కలసి గూఢముగా కూర్చున్నది. ఈ శరీరములో ఉన్న పరమాత్మ దుష్ట సంహారమను అద్భుతమహిమను చేసి, ఆ కీర్తిని పరశురామునికి ఇచ్చినది. ఈ ఆవేశావతార విషయమునే “ద్వా సుపర్ణా సయుజా” అను శ్రుతి చక్కగా వివరించుచున్నది. గీతలో కూడా “ప్రహ్లదశ్చాస్మి” అను గీతలు ప్రహ్లాదుడను జీవపక్షితో పరమాత్మపక్షి చేరి హిరణ్యకశిపుడు సంహరించుటకు ఎంత ప్రయత్నించిననూ, ఆ ప్రయత్నములన్నియు విఫలములగునట్లు చేసి ప్రహ్లదునకు కీర్తి నిచ్చినది. ఈ శ్రుతిలో ”సఖాయ” అను శబ్ధము తపస్సు ద్వారా జీవపక్షి, పరమాత్మపక్షికి ఇష్టుడగుట సూచించుచున్నది. “సయుజ” అను శబ్ధము దానికి సంతోషించిన పరమాత్మపక్షి, జీవపక్షిలో చేరుటను సూచించుచున్నది.
“స్వాదు అత్తి” అను శబ్ధములు జీవపక్షి కీర్తి ఫలమును భోగించుటను సూచించుచున్నది. “అనశ్నన్‌” అను శబ్ధము ఆ కీర్తి పరమాత్మ గ్రహించక జీవపక్షికి ఇచ్చుటను సూచించుచున్నది. ఐతే ఈ మహిమను పరమాత్మ చేసినాడని గ్రహించక, పరశురామ జీవపక్షి తానే చేసితినని అహంకరించెను. ఇట్టి ఈ అహంకారమును నిత్యావతారమైన రామ పరమాత్మపక్షి పోగోట్టినది. ఇట్టి అవేశావతారమే హనుమంతుడు కూడా. అయితే సముద్రలంఘనమను మహిమను చేసిన తర్వాత హనుమంతుడు అహంకరించక ఇది రామ శక్తియేనని ప్రకటించినాడు. అట్టి భక్తునికు ఆ కీర్తిని శాశ్వతముగా అంటగట్ట తలచి రామాంజనేయ యుద్ధమున రాముడు ఓడిపోయి ఆంజనేయుని గెలిపించి తన కన్న ఆంజనేయుడే గొప్పవాడానియు, తన కన్న హనుమంతుడే మహామహిమాన్వితుడనియు ప్రకటించుటకై రాముడు ఎట్టి మహిమలను చేయక, తాను సామాన్యునివలె నటించెను. రాముడే మహిమలను చేసియున్నచో హనమమంతుని సముద్ర లంఘనము రాముడే చేయించినాడని లోకము భావించి యుండెడిది. ఈ నిత్యావతారము చేయవలసిన కార్యము యొక్క స్ధాయిని బట్టి కళావతారముగను, అంశావతారముగను ఉండుచుండును.

ప్రకృతిం స్వాం అధిష్టాయ

బృహదారన్య ఉపనిషత్తు మరణం గురించి చెప్పుచున్నది. పరమాత్మ అవతరించినపుడు తనకు అతి సన్నిహితమైన ఆత్మీయమైన ప్రకృతిని ఆశ్రయించును. “ప్రకృతిం స్వాం అధిష్టాయ” అన్న గీతార్ధమిదే. ఆత్మీయమైన ప్రకృతి సత్వగుణ స్వరూపము. అనగా ఈ ప్రకృతి పంచభూతమయమైన శరీరముతో పాటు శుద్ధ చైతన్యమును (చేతన) కూడా కలిగి యుండును. ఈ శుద్ధ చైతన్యము తాను జీవించుచు శరీరమును జీవింప చేయునది కావున జీవుడు అని పిలవబడుచున్నను ఇతర మానవులయందున్న జీవ స్వరూపములకు భిన్నముగా యుండును. “జీవతి, జీవయతి ఇతి జీవః” అని జీవ శబ్దమునకు అర్ధము. అనగా శుద్ధ చైతన్యము. ఇతర మానవులలో ఈ శుద్ధ చైతన్యము పుణ్యపాప కర్మల సంస్కారములతో కలుషితమై పంచదార మరియు మురికి కరిగిన శుద్ధ జలము వలెయుండును. అవతార పురుషుని శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము ఎట్టి కర్మల సంస్కారము లేక శుద్ధ జలము వలెయుండును. ఇట్టి శుద్ధ చైతన్యము ఎట్టి ప్రత్యేకతయు లేక శరీరములో ఒక భాగముగానే యున్నది. కావున ఇచ్చట ఈ శుద్ధ చైతన్యము శరీరము కన్న భిన్నమైన జీవునిగా వ్యవహరింపబడుటలేదు. ఇతర ప్రాణులలో ఈ శుద్ధ చైతన్యము సంస్కారములతో కలుషితమై శరీరము కన్న భిన్నముగా ఒక ప్రత్యేకత కలిగి జీవుడుని పిలువబడుచున్నది.

అవతార పురుషుని శరీరము కార్యము ముగిసిన తర్వాత ఇచ్చట త్యజింపబడినపుడు పరమాత్మను వదలి పంచభూతములలో కలియుచున్నది. ఈ శుద్ధ చైతన్యము మనోమయమై తేజస్సు యొక్క రూపము కావున అగ్ని అను భూతమునందు ఇచ్చటనే కలియుచున్నది. “మనోమయ”, మరియు “తేజఃసతి” అను శ్రుతులు దీనికి ప్రమాణములు. ఇతర ప్రాణులు మరణము నందు ఈ శుద్ధ చైతన్యము సంస్కారములచే కలుషితమై నందున జీవుడు అనబడుచు “జాయస్వ”, “మ్రియస్వ”అను శ్రుతి ప్రకారముగా ఆయా కర్మ ఫలములను పొందుచు పుట్టుచు, గిట్టుచు ఉన్నాడు. ఇక పరమాత్మ అవతరించినప్పుడు ఆయన వెంట వచ్చిన భక్తులగు సేవకుల గతి ఏమి? వీరు మరణానంతరము పరమాత్మను పొంది “పురుషాయణాః పురుషం ప్రాప్యా” అను శ్రుతి ప్రకారముగా పరమాత్మలో అవ్యక్తస్ధితిలో ఉండి “న విదుః సతి” అను శ్రుతి ప్రకారముగా నిద్ర, విశ్రాంతినికొని మరల పరమాత్మతో పాటు అవతరించుచున్నారు. ఇట్టి వీరి యొక్క జీవశరీరము ఎట్లుండుననగా జ్ఞానము, విశ్వాసము, భక్తి మెదలగు పుణ్య సంస్కారములతో కూడిన శుద్ధ చైతన్యముగా కేవలం పంచదార కలసిన శుద్ధ జలము వలెయుండును. వీరికి పరమాత్మకు వలె జన్మించునపుడు బద్ధ నరక దుఃఖము కాని, మరణించునపుడు మరణ వేదన కాని యుండదు. ఇట్టి జనన మరణ దుఃఖము నుండియే మోక్షము. అంతే తప్ప జనన మరణములు లేవని కాదు. పరమాత్మయే అవతారముల ద్వారా జనన మరణములను గ్రహించుచున్నాడు. ఇట్టి జనన మరణములు పరమాత్మకు కాని, ఆయన సేవకులకు గాని కేవలము కట్టిన వస్త్రమును వదలి శుద్ధ వస్త్రమును గ్రహించిన రీతిగా ఉండును. “వాసాంసి జీర్ణాని” అను గీతార్ధముఇదే. “నివసిష్యసి మయ్యెవ" మరియు "ప్రవేష్ఠుంచ పరంతప” అను గీతలు స్వామి ఆత్మీయులైన భక్తులు మరణానంతరము స్వామిలోనికి ప్రవేసించి అణు ప్రమాణ జీవరూపులుగా నివసించెదరని చెప్పుచున్నది.

బ్రహ్మజ్ఞాన సారము

[వృషనామ సంవత్సరము మార్గశిర బహుళ దశమి మంగళవారము ఉదయం 6 గంటలకు శ్రీ దత్త దివ్యవాణి.] పంచ భూతమయమైన మనుష్య శరీరమును ధరించిన బ్రహ్మర్షులు సైతము యుగ యుగముల తపించి, పంచభూతమయ సృష్ఠికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపమును గ్రహించుట అసాధ్యమని తెలిసి, వారి కొరకు పంచభూతమయమైన మనుష్య శరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమైన కృష్ణావతారములో గోపికలుగా పుట్టి సేవించి తరించిరి. “మానుషీం తనుమాశ్రితమ్‌” అన్న గీతార్ధమిదే. మరియు శ్రుతి “యత్‌ సాక్షాత్‌ అపరోక్షాత్‌ బ్రహ్మ” అని చెప్పుటలో అర్ధమేమి? పరబ్రహ్మము పరోక్షముగా ఉన్నపుడు అగ్రాహ్యము కావున మనకు అది అందదు. కావున లేని దానిగా పరిగణించవచ్చును. మనకు ఉన్న పరబ్రహ్మము, మనకు అందిన శిలావిగ్రహ రూపమున దర్శన, స్పర్శనలిచ్చి అందుచున్నది. కావున ఉపాసనకు యోగ్యములే కాని అవి సహవాస సంభాషణాదులను అనుగ్రహించ లేనందున పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము కాజాలవు.

“ఆదిత్యం బ్రహ్మేతి ఉపాసీత” అనగా సూర్యుని పరబ్రహ్మముగా ఉపాసించుము. సూర్యుడు దర్శన, స్పర్శన యోగ్యుడే కాని సహవాస, సంభాషణా యోగ్యుడు కాడు. కావున కేవలం ఉపాసన మాత్రుడేనని ఈ శ్రుతికి అర్ధం. ఇక మహావాక్యములలో “అయమాత్మా బ్రహ్మ” అని అనగా మనుష్య శరీరమును ఆశ్రయించిన ఒకానొక విశిష్ట జీవస్వరూడైన రామకృష్ణాది అవతారపురషుడే పరబ్రహ్మము అని ఈ శ్రుతికి అర్ధము. “ప్రజ్ఞానం బ్రహ్మ” అనగా విశిష్టమైన జ్ఞానసంపన్నుడైన గురుస్వరూపుడైన అట్టి విశిష్ట మానవుడే పరబ్రహ్మమని గుర్తించవలయును. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ”, “రసోవైసః” ఇత్యాది శ్రుతులు అట్టి అవతారపురుషుడు జ్ఞానానందాది కళ్యాణ గుణతత్త్వసంపన్నుడై ఉండుననియు, అట్టి దానిని అవతార పురుషుని గుర్తించు లక్షణమనియు శ్రుతి బోధించుచున్నది. శ్రీకృష్ణుని భగవద్గీత ద్వారా పరబ్రహ్మముగా ఋషులు గుర్తించినారు. కాని ఆయన చూపిన సిద్ధుల వల్ల కాదు. అట్టి సిద్ధులు ఆయన సంకల్ప మాత్రములే. ఏలననగా సిద్ధులు సృష్టిలోని భాగములు. సృష్టియును ఆయన సంకల్ప స్వరూపమే. అట్టి సిద్ధులను కంసాది రాక్షసులు కలిగి యుండెను. అట్టి అవతార పురుషుని “తత్త్వమసి”అను మహావాక్యముతో గుర్తించవలెను. “తత్త్వమసి “అనగా 'తత్‌'=ఆ అందని పరబ్రహ్మము, 'త్వం'= అందిన మానవాకారమైన నీవు, 'అసి'= అయి ఉన్నావు. ఇట్టి ఉపాసనకు అద్వైతము ఆధారమైయున్నది. ఒక తీగెను విద్యుత్‌ అంతయు ఆక్రమించినప్పుడు ఆ కరెంటు తీగెను కరెంటు అందురు. అట్లే ఆపాదమస్తకము ఆ కృష్ణ స్వరూపము పరబ్రహ్మముచే వ్యాపించబడియున్నది. కరెంటు తీగెను ఎచ్చట ముట్టుకొన్ననూ కరెంటు షాకు తగులుచున్నది. ఈ అద్వైతమును అవతార పురుషుడు కూడా “అహం బ్రహ్మాస్మి” అను వాక్యముతో బోధించును. కృష్ణ భగవానుడు అట్లే “అహం సర్వస్య జగతః ప్రభవః ప్రళయః తధా మత్తః పరతరం కించిత్‌ నాన్యదస్తి ధనంజయా” అని చెప్పినాడు కదా. కావున మహా వాక్యములన్నియు అవతారపురషుడే పరబ్రహ్మమనియు అతనిని ఇచ్చట సేవించి ఆనందించి తరించు స్ధితియే జీవన్ముక్తి అనియు, పరోక్షముగా ఏమియు లేదనియు, అంతయు ఇచ్చటనే కలదనియు, అంది వచ్చిన దానిని కాదన్న వాడు మహా వినాశము పొందుననియు “మహతి వినష్ఠిః" అని శ్రుతి చెప్పుచున్నది. “న విదుః సతి” అను శ్రుతి మరణము కేవలము ఏమి తెలియని గాఢనిద్ర వంటి విశ్రాంతి, విరామమైన అజ్ఞానావస్ధ అనియు చెప్పుచున్నది. ఈ శ్రుతి కూడా పై శ్రుతినే బలపరచుచున్నది.

Thursday, January 1, 2009

శ్రీ దత్త జయంతి సందేశము - 2

బ్రహ్మ విష్ణు శివ ముఖములతో యున్న దత్తుని స్వరూపమును చూచుచున్నారే గాని ఆ స్వరూపము యొక్క అంతరార్ధమును మీరు గ్రహించుట లేదు. దత్తుడనగా అందరాని పరబ్రహ్మము మనుష్యాకారములో అందివచ్చిన అవతారపురుషుడే భక్తులకు దత్తమైనాడని అర్ధము. ఆయన మూడు ముఖములు త్రిగుణములను సూచించుచున్నవి. సత్వగుణము మంచిగుణము. రజస్సు, తమో గుణములు చెడ్డ గుణములు. అనగా ఆ మనుష్య శరీరములో అన్ని గుణములు ఉన్నవనియే అర్ధము. గీతలో కూడా ప్రకృతియే మాయ యనియు, ప్రకృతి త్రిగుణములు అనియు, మాయ కలవాడే ఈశ్వరుడనియు, అట్టి ఈశ్వరుడు అవతరించినప్పుడు మాయ సహితుడై యుండుననియు చెప్పుచున్నది. ఈ మాయ సత్వ గుణమేనని చెప్పుట సరికాదు. త్రిగుణమయమైన ఈ బ్రహ్మాండమంతయు అవతార పురుషుని యొక్క పిండాండములో ఉన్నట్లుగా విశ్వరూప ప్రదర్శనమున స్పష్టమగుచుండగా అవతార పురుషునిలో త్రిగుణములు ఉన్నవి అనియే అర్ధము. ఈ రజస్తమో గుణములు కూడా అవతార పురుషుని క్రీడలోను, మరియు భక్తులను పరిక్షించుటలోను ఉపయోగపడుతుంది. శ్రీ రాముడు సహితము జాబాలిని కోపగించుట అను రజోగుణమును, బంగారు లేడిని వెంబడించుట అను తమోగుణమును కలిగియున్నాడు. ఈ గుణముల వల్లనే దత్తుడు కోపముతో యున్న చండలాది రూపములలో కనబడుచుండును, అయితే ఈ త్రిగుణ మాయ అవతారపురుషుని వశములోయుండును. కావున అతడు వశీకృతమాయుడు. దత్తుని యొక్క ఆరు చేతులు, స్వీకరించిన మనుష్య శరీరము పుట్టుక మొదలగు ఆరు వికారములను కలిగియే ఉండునని సూచించుచున్నది. శంఖము, ఢక్క శబ్ధమును, జపమాల వాక్యమును సూచించగా ఆయన జ్ఞానమున బోధించుట చెప్పుచున్నది. చక్రము, శూలము శక్తితోనున్న మంత్రజలముకల కమండలము ఆయన యొక్క శక్తి మంతములైన సిద్ధులను చెప్పుచున్నవి.
మొదటి మూడును ప్రధాన దక్షిణార్ధమగు గురు స్వరూపమును, రెండవ మూడును వామార్ధమగు భగవత్స్వరూపమును మనుష్యావతారమున ఉండునని చెప్పుచున్నవి. కావున త్రిముఖ షడ్బుజ దత్తుడు అనగా త్రిగుణములతోయున్న మాయా మానవఆవతార పురుషుడేనని తాత్పర్యము. అట్టి అవతార పురుషుని సేవించక దత్తచిత్రములను, శిల్పములను సేవించి ప్రయోజనమేమి? శిలావిగ్రహములు కేవలము ప్రతీకలే అనగా ప్రతినిధులే. “ఆదిత్యం బ్రహ్మేతి” అను శ్రుతి సూర్య మండలమును పరమాత్మగా ధ్యానించమని చెప్పగా, మందమతులు, సూర్యుడినే పరమాత్మయని భావించినారు. అందుకే వేదము"నేదంతత్‌” అని మరల యీ జడగోళము అగు సూర్యమండలము పరమాత్మకాదని బోధించినది. విగ్రహములు దర్శన, ధ్యాన యోగ్యములే కాని నైవేద్యాది సేవా యోగ్యములు కావు. త్రివర్ణ పతాకము భారతదేశ ప్రతీక. అనగా ఆ పతాకము భారత దేశము కాదు. భారత దేశమును సూచించు ప్రతినిధియే. ఇక గోవు విషయము. దత్తుని వెంట గోవు వచ్చుచున్నది. ఆవు ధర్మదేవత యొక్క రూపముగా చెప్పబడుచున్నది. దీనిలోని అంతరార్ధము ఏమనగా ఆయన నడకను ఆవు అనగా ధర్మము వెంబడించుచున్నది కాని ఆయన ధర్మమును అనగా ఆవును వెంబడించి నడచుటలేదు. అనగా ఆయన నడచిన మార్గమే ధర్మమని అర్ధము. ఆయన గోపాలుడు అనగా ధర్మ రక్షకుడు. ఆయనచే రక్షింపబడు ధర్మము కన్న ధర్మమును రక్షించు ఆయనయే గొప్పవాడు.
కుక్కలు: అట్లే ఆయన పాదముల వద్ద వేదములు కుక్కలుగా పడియున్నవి. పాదములు అనగా ఆయన శ్లోక రూపముగా బోదించుచున్న జ్ఞానములో శ్లోకములోని నాలుగు పాదములు అను అర్ధముతో ఆ నాలుగు పాదములను అనుసరించి వేదములు ఆయనపై ఉండవలసిన స్ధిర విశ్వాసమునకు ప్రతీకలుగా నిలచియున్నవి. అనగా ఆయన చెప్పు జ్ఞానవాక్యములను వేదములే అనుసరించుచున్నవి. అనగా ఆయన చెప్పిన ప్రతిమాటయు వేదమే అని అర్ధము. పండితులు వేదమును అనుసరించి వాక్యములను పలికెదరు. ఆయన వేదకర్త వేదము ధర్మమూలము. కావున ఆయన చెప్పినది వేదము. ఆయన చేసినది ధర్మము అని తాత్పర్యము. “అస్య మహతో భూతస్య వేదోఖిలో ధర్మమూలం” అను ప్రమాణములు ఆయన వేదకర్తయనియు, వేదము ధర్మమూలము అని చెప్పబడినది గదా.

అవతార పురుషుడు జ్ఞానబోధ చేయునప్పుడు మామూలు స్ధితిలో ఉన్నట్లుగాను, మహిమలను చేయుచున్నప్పుడు ఎక్కువ శక్తితో చేరి ఉన్నాడని మీరు తలచుట చాలా పొరపాటు. అవతారపురుషులు జ్ఞానబోధ చేయునప్పుడు పరిపూర్ణమైన పరమాత్మతో పూర్ణశక్తితో చేరియున్నాడు. అట్టి స్ధితిలో అవతార పురుషుడు 100 వాట్స్‌ బల్బుతో సమానము. మహిమలను చేయునప్పుడు అత్యల్ప శక్తితో కూడిన '0' వాట్స్‌ బల్బువలెయుండును. కావున క్షుద్ర జనులు కూడా ఆ సిద్ధులను సాధించగలుగుచున్నారు. కాని బ్రహ్మజ్ఞానమును సాధించుటలేదు. శ్రీ కృష్ణుడు కౌరవులకు బోధ చేయునప్పుడు మరియు అర్జునకు బోధ చేయునప్పుడు పరిపూర్ణమైన విశ్వరూప స్ధితిలో నున్నతన స్వరూపమును చూపినాడు. కావున జ్ఞానబోధ చేయునప్పుడు పరిపూర్ణమైన శక్తి స్వరూపుడైన పరమాత్మయే చేయగలడు. కేవలము గ్రంధస్ధమైన జ్ఞానమును బోధించు పండితులు కూడా '0' వాట్స్‌ బల్బుల వంటివారే. కావుననే పరమాత్మ చెప్పు జ్ఞానము ప్రజ్ఞానమని “ప్రజ్ఞానం బ్రహ్మ”అని వేదము చెప్పుచున్నది. ప్రజ్ఞానము అనగా జీవులకు సాధ్యము కాని ప్రకృష్టమైన అనగా అతి విశేషమైన జ్ఞానము అని అర్ధము. ఇట్టి ప్రజ్ఞానము చేతనే పండితులగు గురువుల నుండి సద్గురువగు అవతార పురుషుని వేరు చేయవలయును. సత్‌ అనగా పరబ్రహ్మము. సద్గురువు అనగా గురుస్వరూపమున ఉన్న పరబ్రహ్మము అని అర్ధము. అజ్ఞానము పతన కారణము మరియు అమితమైన బలము కలది. జ్ఞానము ఉద్ధరణ కారణము అనగా క్రింది నుండి పైకిపోవుట. దానికి బలము తక్కువ. అజ్ఞానము స్వభావ సిద్ధమైనది. కావున బోధించు ప్రయత్నమక్కరలేదు. నీరు స్వభావ సిద్ధముగాఎంతో వేగముతో పై నుండి క్రిందకు పడి పతనము చెందును. అదే క్రింద పడిన నీరు స్వయముగా పైకి పోవుటకు వేగము కలిగియుండదు. దానిని పైకి తెచ్చుటకు ఎంతో బాహ్యప్రయత్నము అవసరము. అట్లే అజ్ఞానులను ఉద్ధరించుటకు సద్గురువు ఎంతో శ్రమ పడుచుండును.

శిలా విగ్రహములకు తైలాభిషేకము చేసి తైలము వ్యర్ధము చేయుచున్నారు. నరాకారములో వచ్చిన సద్గురువు అగు పరమాత్మ యొక్క తలకు తైలము అంటుటయే నిజమైన తైలాభిషేకము. విగ్రహములు కేవలము దర్శన యోగ్యములే. వాటిపై దుమ్ముపడకుండా నీటితో కడిగి శుభ్రపరచుట అను స్నానోపచారము ఒక్కటి చేసిన చాలునని చెప్పియే యుంటిని గదా! పరమాత్మ మానవ శరీరమును ఆవహించి అవతరించును. విద్యుత్‌ తీగెను ఆశ్రయించి వ్యాపించి యున్నది కదా. కనక తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున విద్యుత్తును తీగెను వేరు చేయలేము. విద్యుత్తే తీగె, తీగెయె విద్యుత్తు. అయితే ఇంత మాత్రమున విద్యుత్‌ తీగెగా మారలేదు. విద్యుత్‌ పోయిన తర్వాత తీగెను ముక్కలు చేసినను విద్యుత్‌ ముక్కలు కాలేదు. ఇదేవిధముగా పరబ్రహ్మము మానవ శరీరమును ఆశ్రయించి శ్రీకృష్ణునిగా అవతరించిది. పరబ్రహ్మము మానవ శరీరమును ఆపాదమస్తకము వ్యాపించియున్నది. “అంతర్బహిశ్చ తత్సర్వం” కావున శ్రీకృష్ణుడే పరబ్రహ్మము, పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. ఐతే శ్రీకృష్ణుని నిర్యాణ సమయమున పరబ్రహ్మమైన నారాయణుడు శ్రీకృష్ణుని శరీరము నుండి నిష్క్రమించగా ఆ కృష్ణుని శరీరమునకు పార్ధుడు దహనసంస్కారము చేసెను. ఇంత మాత్రమున దానిచేత నారాయణుడు దహింపబడలేదు. ఏలననగా నారాయణుడు నర శరీరమును ఆశ్రయించినాడే కాని నారాయణుడు నరునిగా మారలేదు. ఇది తెలియక అజ్ఞానులు నారాయణుడు మరణించెను, దహింపబడెను అని తలచెదరు. ఈ విషయమే గీతలో “మానుషీం తనుమాశ్రితమ్‌” అనగా పరమాత్మ మనుష్య శరీరమును ఆశ్రయించి అవతరించును. వేదములో చెప్పినట్లు “అవ్యక్తం వ్యక్తమాపన్నం” అనగా పరమాత్మ నరశరీరముగా మారి అవతరించినాడు అని ఆజ్ఞానులు తలచెదరు. కావున శ్రీకృష్ణుడు జీవించినంత కాలము సాక్షాత్తు నారాయణుడే కాని నిర్యాణానంతరము శ్రీకృష్ణ శరీరము మామూలు నరశరీరమే.

శ్రీ దత్త జయంతి సందేశము-1

అత్రి అనసూయలకు మానవ స్వరూపంలో అందరాని పరబ్రహ్మము అందినరోజే దత్త జయంతి. జయంతి అనగా ఆ మానవాకారము సంభవించిన రోజు. అనగా సాక్షాత్కరించిన దినము. అనగా అట్టి మానవాకారములో ఉన్న సద్గురువు నీకు లభించిన రోజు. అట్టి సద్గురువును దర్శించు ప్రతిదినము దత్త జయంతే. అట్టి సద్గురువు సాన్నిధ్యములో ఉండి ఆయనను నిత్యము సేవించు ప్రతిరోజు దత్త జయంతియే. దత్తుడనగా లభించిన వాడు అని అర్ధము. జయంతి అన్ననూ అదే అర్ధము. మార్గశీర్షము అనగా మార్గము నందు శీర్షమును ఉంచుట. అనగా భగవంతుని చేరు సత్యమైన మార్గము నందు బుద్ధిని ప్రసరింప చేయుట అని అర్ధము. నేడు మృగశిరా నక్షత్రము పూర్ణిమతో చేరినందున మార్గశీర్షమైనది. మృగశిర అనగా మృగము యొక్క శిరస్సు. అనగా పశుబుద్ధి అని అర్ధము. నక్షత్రములు అనగా అల్పజ్ఞానము గల అల్పజీవులు అని అర్ధము. పూర్ణచంద్రుడు అనగా వారి మధ్య పూర్ణజ్ఞానము గల సర్వజ్ఞుడగు పూర్ణచంద్రుడే అవతార పురుషుడని అర్ధము. అట్టి అవతార పురుషుని లోకమునకు అందించబడిన పరమాత్మయే కావున దత్తుడనబడుచున్నాడు. అయితే అట్టి అవతార పురుషుని లోకమునకు అందించిన వాడు ఎవరు? అందించబడిన వాడే అందించినవాడు. అనగా స్వయముగా తనను తాను దత్తము చేసుకొనిన వాడు అని అర్ధము. ఇట్లు పరమాత్మ తనను తాను అందించుకున్న స్వరూపమును అసూయ అహంకారములతో విడిచి పెట్టి ఒక మానవుడు ఊహించి చెక్కిన శిల్పములను, గీచిన చిత్రములను సేవించుట ఎంతటి వెర్రితనము. ఇవి అన్నియు ఊహా చిత్రములే కాని కనీసము తీసిన ఫోటోలు కూడా కావు. కావున మానవుడు అందించిన ఊహరూపములగు జడములను సేవించుట పామర లక్షణము. భగవంతుడు నిర్మించిన రూపములగు ప్రాణులలో సాత్వికులగు సాటి మానవులకును, పశుపక్ష్యాదులకును సేవ చేయుట ఉత్తమ ధర్మమగు ప్రవృర్తి మార్గము.

ఇక నివృర్తి మార్గములో ఇట్టి చైతన్య సహితములగు విగ్రహములలో ఒకానొక స్వరూపముతో పరమాత్మయే అవతరించియున్నాడు. అట్టి అవతార పురుషుని గుర్తించి, సేవించు మోక్షమార్గమే నివృర్తి అనబడుచున్నది. ప్రవృర్తి అనగా సర్వసాధు ప్రాణి వర్గమును సేవించి లోకమునకు శాంతిని అందించుట. నివృర్తి అనగా ప్రాణులలో ఒకానొక ప్రాణి రూపమున ఉన్న పరమాత్మను సేవించి తరించుట. మానవుడు సాటి మానవుని ద్వేషించుచున్నప్పుడు, ఇక మానవరూపములో యున్న పరమాత్మను ఎట్లు గుర్తించి సేవించగలడు? కావున ప్రవృర్తియే తెలియని వానికి నివృర్తి ఎట్లు లభించును? ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గమునకు ఎక్కునా? దీనికి గీతలో “ప్రవృర్తించ నివృర్తించ”అని చెప్పుచున్నది. ఈ ప్రవృర్తికి నివృర్తికి మధ్య అడ్డుగోడలే అసూయ అహంకారములు. అసూయ లేని జీవుడే అనసూయ. మూడు గుణముల అహంకారము లేని వాడే అత్రి. చైతన్య స్వరూపమైన జ్ఞానగర్వమే సాత్వికాహంకారము. శక్తి స్వరూపమైన బలము యొక్క మదమే రాజస అహంకారము. జడమైన శరీర దర్పమే తామస అహంకారము. అట్లు అసూయ అహంకారములు లేని సాధకుడే అనసూయ, అత్రి స్వరూపుడు. అట్టి సాధకుడే సాటి మానవ రూపములో యున్న సద్గురువును పొందగలడు. అట్టి వానికే సద్గురువు దత్తమైనాడు లేక లభించినాడు. ఇట్టి అంతరార్ధమును తెలుసుకొనక ఆచరించక అత్రి, అనసూయ అను దంపతులకు ఒక శిశువు జన్మించు ఉత్సవమును పిండి వంటలతో చేసుకొనుట పసిబాలుర వినోదము కొరకు చెప్పబడిన ఒక అవిచారిత రమణీయమైన కల్పన. ఇట్టి కల్పనల స్ధాయికి ఉత్తమ సాధకులు కూడా దిగజారుట వారికే ఎంత అవమానమో వారకే తెలియకున్నది. ఉద్యోగములో పై పదవి నుండి క్రింద పదవికి లేక ఒక విద్యార్ధి పైతరగతి నుండి క్రింది తరగతికి దిగజారుట అను డిమోషన్‌ ఎంత అవమానమో ఇదియు అంతే.

కావున ఇట్టి మానవాకారమున అంది వచ్చిన దైవ స్వరూపములను సేవించుట తప్ప మరియొక మార్గము లేదు అను శ్రుతి “నాన్యః పంధా” అని చెప్పుచున్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టు జ్ఞాన సూర్యడుగా సద్గురువును వేదప్రమాణముల ద్వారా తెలుసుకొనవలెనని వేదము "వేదాహ మేతం పురుషం” అని చెప్పుచున్నది. అట్టి సద్గురువును గుర్తించుటకు వేదము, గీత, భాష్యములను ఆధారముగా తీసుకొనవలయును. ఇందులో మొదటి మూడు మహావాక్యములు ఆయన బాహ్యాకారము ఇతర మానవులవలె మానవస్వరూపము అని చెప్పుచున్నవి. “అహం బ్రహ్మస్మి”, “తత్వమసి”, “అయమాత్మ బ్రహ్మ”. నాలుగవ మహావాక్యము”ప్రజ్ఞానం బ్రహ్మ”. ఆయన ఇతర జీవులకు సాధ్యం కాని అతివిశిష్ట బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అని చెప్పుచున్నది. “సత్యం జ్ఞానం, ఆనందో బ్రహ్మ” అను శృతులు ఆయన బోధించు బ్రహ్మజ్ఞానము ఇతర పండితులవలె చెప్పు శిరోవేదనాకరమగు జ్ఞానము కాదని అర్ధము. గీత కూడా “మానుషీం తనుమాశ్రితమ్‌” అని మానవుల కొరకు పరమాత్మ మనుష్య శరీరమును ఆశ్రయించి వచ్చునని చెప్పుచున్నది. మరియును గీత “భూతే జ్యాయంతి భూతాని” అను శ్లోకములో జడములగు పంచభూతముల స్వరూపములగు విగ్రహాదులను సేవించువారు జడములగుదురు. అనగా జడములగు పాషాణాది జన్మములలో జన్మింతురనియు, నరాకారమును గుర్తించి సేవించిన నరజన్మమును పొందుదురనియు చెప్పుచున్నది. విగ్రహములు, పటములు కేవలము దర్శన యోగ్యములే కాని సేవా యోగ్యములు కావు. దూర దేశమున ఉన్న బంధువుల ఫోటోల వంటివే. అట్టి ఫోటోలను దుమ్ము దులిపి శుభ్రముగా ఉండునట్లు విగ్రహములకు స్నానోపచారములు తప్పు మిగిలిన ఉపచారములు అక్కరలేదు. శివ లింగము అన్ని విగ్రహములకు మూల పదార్ధము అగు శిలను సూచించు చున్నది. దానికి అభిషేకము తప్ప ఇంకొకటి అక్కరలేదు. కావున విగ్రహాదులు సాధనలో పరమిత ప్రయోజనము కలిగియున్నవి. వాక్కులకు, మనస్సుకు, బుద్ధికి, ఊహకు కూడా పరమాత్మ అందడని వేదములు ఘోషించు చున్నవి. "న తత్ర వాగచ్చతి”, “న మనోగచ్చతి”, “అప్రాప్య మానసాసః”, “నమేధయా”, “నైషాతర్కేణ”, “నచక్షుషా” అట్టి పరమాత్మ మనుష్య శరీరమును ఆపాదమస్తకము వ్యాపించి భక్తులకు దర్శనము, స్పర్శ, సంభాషణము, సహవాసములను అనుగ్రహించుటకును, బ్రహ్మజ్ఞానము భోధించుటకును, తన భక్తుల పాప కర్మఫలములను తానే అనుభవించి అటు ధర్మదేవతకు న్యాయము చేయుచూ, ఇటు భక్తులను కర్మ విముక్తులను కావించుటకును, మానవ రూపంలో అవతరించి దత్తుడనబడుచున్నాడు. వాతావరణములో కంటికి కనిపించని ఎలక్ట్రానులే అందరాని పరబ్రహ్మ స్వరూపము. ఆ ఎలక్ట్రానులే ఒక తీగెలో వ్యాపించి ప్రవహించునప్పుడు ఆ విద్యుత్‌ తీగెయే అవతారమైన దత్తుడు. విద్యుత్‌ తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున ఆ విద్యుత్‌ తీగెయే మనకు స్పర్శనందించు అనుభవమును ఇచ్చు విద్యుత్‌. విద్యుత్తుకు, తీగెకు అద్వైతమే ఉన్నది. కావున విద్యుత్తే తీగ, తీగయే విద్యుత్తు. అట్లే మానవరూపియగు దత్తుడే పరమాత్మ. పరమాత్మయే మానవరూపుడైన దత్తుడు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, ఏసు, మహమ్మద్‌, బుద్ధుడు, మహావీరుడు, గురునానక్‌, శ్రీ పాద శ్రీవల్లభుడు, శ్రీ నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, స్వామి సమర్ధ, సాయిబాబా మొదలగు పురుషులే ఈ లోకమునకు అందించబడిన మానవ రూపులగు దత్త స్వరూపములు. ప్రతి మనుష్య తరమునకు ప్రతి దేశప్రాంతమునకును, అందరికినీ సులభముగా నుండుటకు ఈ దత్త రూపములు గురువులుగా అవతరించుచునే యున్నవి. ఒక మానవ తరమునకే ఒక దేశ ప్రాంతమునకే పరమితమైనచో పరమాత్మకు పక్షపాత దోషము వచ్చును. ఈ అంతరార్ధమును తెలుసుకొని ఆచరణలో తెచ్చుకున్న పవిత్ర దినమే నిజమైన దత్త జయంతి.