Friday, July 31, 2009

‘‘మానవ సేవయే మాధవ సేవ’’ – సరియైన అర్ధము.

‘‘మానవ సేవయే మాధవ సేవ’’ అను వాక్యము సరిగా అర్ధము చేసుకొననిచో చాలా ప్రమాదకరము. అన్నము, వస్త్రము, ఔషధములను ఆర్తులకు ఇచ్చుటయే సేవ కాదు. ఆర్తుడు స్వామిచే విధించబడిన తన పూర్వపాప శిక్షలను అనుభవించుచున్నాడు. నీవు వాని పూర్వ పాపములను చూడలేదు. ఇప్పుడు శిక్షలను చూచి కరుణించుచున్నావు. నీవు వానికి శాశ్వత సహాయమును చేయలేవు. వానికి జ్ఞానము, భక్తిని దానము చేసి భక్తునిగా మార్చినచో వానికి భగవంతుడే శాశ్వత సహాయము చేయును. కావున అన్నాది దానమే సేవ కాదు. నీ అన్నమును భుజించినవాడు పాపములను మరల చేసినచో ఆ పాప భాగమును నీవు పొందెదవు. నీవు వానికి అన్నాదులతో పాటు జ్ఞానమును, భక్తిని కూడా దానము చేసినచో అట్టి కార్యము దైవ కార్యము కావున నీవు చేసినది మానవ సేవయే. ధనవంతులకును జ్ఞానము, భక్తిని దానము చేయుము. దారిద్ర్యము అనగా డబ్బు లేకపోవుటయే కాదు. జ్ఞానము, భక్తి లేక పోవుట కూడా. అన్న దానము ఈ దేహముతో నశించుచున్నది. జ్ఞానము, భక్తి లేనిచో జీవుడు శాశ్వతముగా పశు-పక్షి జన్మలయందు పడుచున్నాడు.

ఈ వాక్యము యొక్క అసలు అర్ధము వేరు. మానవుడు మాధవునిగా అవతరించినప్పుడు మానవునిగా కనిపించును. అట్టి వానిని ఆయన స్వభావమైన ఆనందప్రదమైన జ్ఞానము చేత గుర్తించి ఆయనను సేవించినచో అట్టి ఆ మానవుని సేవ మాధవ సేవ అగునని అర్ధము. స్వామి కృష్ణునిగా అవతరించినప్పుడు ఆయనను కొందరు మానవునిగా, మరికొందరు మాధవునిగా భావించినారు. కావున ఇది ఒక క్లిష్ట సమస్య అయినది. కరెంటు, లోహపు తీగను వ్యాపించినట్లు మాధవుడు ఆ మానవ శరీరమును వ్యాపించినాడు. కరెంటు, తీగవలె మానవుడు, మాధవుడు ఇద్దరు ఉన్నారు. ఈ సమస్యను శంకరాచార్యులు చర్చించి ఇద్దరూ ఉన్ననూ ఒక్కరే ఉన్నట్లు గ్రహించవలయునని అద్వైత సిద్ధాంతమును చేసినారు. కరెంటు, తీగ రెండూ ఉన్ననూ తీగను ఎచ్చట తగిలిననూ కరెంటు షాకు కొట్టుచున్నది. కావున తీగయే కరెంటు. ఈ విధముగా అవతరించిన మానవ శరీరమే మాధవుడు. కృష్ణుని స్పృశించినచో పరమాత్మను స్పృశించినట్లే. కాని ఈ సిద్ధాంతమును మానవులు వక్రముగా సర్వ మానవులకు విస్తరించి మానవుడే మాధవుడు అన్నారు. అందుకే శంకరులు కరిగిన సీసమును తాగి శిష్యులను కూడా తాగమని సత్యమును బోధించినారు. అనగా శంకరులే దైవము. కాని శిష్యులు కారని నిరూపించినారు. ప్రతి మానవుడు మాధవుడైనచో ఇంక ఈ సాధన ఎందులకు? అనగా మాధవునకు మోక్షము కావలయునా? ప్రహ్లాదుడు తన తండ్రిని కూడా మాధవునిగా ఏల అంగీకరించలేదు? నరసింహుడు హిరణ్యకశిపుడు ఇరువురును మాధవులే అయినచో నరసింహుడు హిరణ్యకశిపుని చంపినప్పుడు మాధవుని చంపినందున మాధవుడు ఆత్మహత్య చేసుకున్నాడా?

Thursday, July 30, 2009

గురుపూర్ణిమ సాయంకాల సందేశము (Part-2)

జ్ఞానము, కరుణ మెదలగు గుణములు సత్త్వగుణములు. అనగా సద్గుణములు. రజస్సు, తమస్సు అనునవి దుర్గుణములు. రుక్మిణి సత్త్వగుణము. సత్యభామ రజోగుణము. రాధ తమో గుణము. గుణముల వరకు చూచుకొన్నచో ఒకదాని కన్న మరియొకటి ఎక్కువ. కాని ఆ ముగ్గురిలో ఉన్న భక్తి తీవ్రతను చూచినచో రుక్మిణికన్న సత్యభామ, సత్యభామ కన్న రాధకు ఎక్కువ ఉన్నది. కావున మహాలక్ష్మి స్వరూపిణియగు రుక్మిణికి హృదయ స్థానమును, దానికన్న పై స్థాయి అగు మూతిపై వరాహఅవతారమున భూదేవి అగు సత్యభామకు స్థానమును, దాని కన్న పై స్థానముగా గోలోకమున తన తలపై రాధకు స్థానమును ఇచ్చినాడు. స్వామి భక్తికి విలువను ఇచ్చినాడే కాని గుణములకు కాదు. కామమును స్వామి సౌందర్యముపై అట్లే మోహమును స్వామి ప్రవర్తన ఎట్లు ఉన్ననూ స్వామి మీదనే ఉంచుము. మోహము అనగా గుడ్డి ఆకర్షణ. ఈ రెండు దుర్గుణములను పాత్రలలో రాధ తన ప్రేమను పోసినది. ఇక సాక్షాత్కరించలేదని కోపమును స్వామిపై చూపుము. సంసారమునకు కాలమును, శక్తిని వ్యయము చేయక దాచుటలో లోభివి కమ్ము. అవసరములకు కూడా ఖర్చు పెట్టని మహాలోభి గుణము కర్తవ్యయములకు సైతము కాలశక్తులను ఖర్చు చేయని మహాభక్తిగా మలచవలయును. ‘‘స్వామి భక్తుడను నాకేమి?’’ అను ధైర్యములో మదమును మలచవలయును. మహాభక్తులను చూచి మాత్సర్యము పొంది నీ భక్తిని పెంచుకొనవచ్చును. ఈ నాలుగు దుర్గుణములను పాత్రలలో దైవప్రేమను సత్యభామ పోసినది.

Sunday, July 26, 2009

గురుపూర్ణిమ సాయంకాల సందేశము (Part-1)

ప్రపంచములో ప్రతి మతము నీ దుర్గుణములను పూర్తిగా పోగొట్టుకున్నకాని ఆ మతములో చేరుటకు పనికిరావని చెప్పుచున్నది. ఇది ఆచరణలో అసాధ్యమగుచున్నది. ఏలననగా ఈ దుర్గుణములు అనేక పూర్వ సంస్కారమ పర్వతములు. ఈ స్వల్ప మానవ జన్మ వీటిని కదలించుటకు సైతము చాలదు. ప్రయత్నముచేత కొంతవరకు వాటిని నిగ్రహించవచ్చును. ఈ దుర్గుణములు ఋషుల మనస్సులలో కూడా నిప్పురవ్వలవలే మెరయుచున్నవి. ఎవరైననూ తనలో ఏ దుర్గుణము లేదని చెప్పినచో అది పరవంచన మరియు ఆత్మవంచనయే. ఇట్టి అసాధ్యమైన పనిని ప్రతి మతము కోరుచున్నందున అందరికి ఈ మతములపై ప్రీతి నశించుచున్నది. మత ప్రవక్తలు మతమును ఆధ్యాత్మికమును కలిపి గందరగోళము చేసినారు. మతము విశ్వములో శాంతి ధర్మములను స్థాపించుట. నీ దుర్గుణములు సజ్జనులను బాధించి, విశ్వశాంతికి భంగము కలిగించినచో స్వామి నిన్ను శిక్షించును. కావున పూర్తిగా తీసివేయుటకు సాధ్యము కాని నీ దుర్గుణములను కొంత నిగ్రహించుకొనుము. దీనితో మతము ఆగిపోవుచున్నది. కొన్ని మతములు ఇంతటితో ముగిసి, తరువాత భాగమగు ఆధ్యాత్మికమును అసలు బోధించుట లేదు.

ఇక ఆధ్యాత్యికము అనగా స్వామిని చేరుటకు చేయు సాధన. దీనిలో దుర్గుణములను నిగ్రహించవలసిన అవసరము కూడా లేదు. స్వామికి నీ దుర్గుణములను గురించి ఎట్టి ఆక్షేపణము లేదు. అవి సాధనకు అడ్డురావు. అంతేకాదు వీటిని స్వామి వైపు మరలించినచో అవి నీకు సాధనలో సాయపడును. సాధనలో సాయపడుటకే అన్ని గుణములను స్వామి సృష్టించినాడు. కావున గుణములను సృష్టించుటలో కల అసలు ముఖ్యోద్దేశము గ్రహించినచో నీకు సాయపడుచున్న ఏ గుణమునైననూ నిగ్రహించరాదు. ఎంతటి మూర్ఖుడైననూ సాయపడువానిని అడ్డుకొనడు. కావున ఏ గుణమైననూ సాధనలో సాయపడునప్పుడు సద్గుణమే అగును. అట్లు కానిచో దుర్గుణములగును. కావున ప్రపంచమువైపుకు మరలింపబడిన ఏ గుణమైననూ దుర్గుణమే. సాధనలో భక్తిని సంపాదించుటకు ప్రయత్నము చేయవలెను. కాని గుణములను నిగ్రహించుటకు, తొలగించుటకు కాదు. భక్తి, జ్ఞానము చేత లభించి వృద్ధి పొందును. బొంబాయి నగరము ఉన్నది అని తెలియగనె చూడగోరుదుము. కాని దాని విశేషములు ఇంకను తెలియు కొలదీ దానిని చూచు కోరిక వృద్ధి అగును. కావున జ్ఞానము పెరిగిన కొలదీ కోరిక లేక భక్తి పెరుగుచున్నది. కృష్ణుడు భూమిపై అవతరించి ఉన్నాడని రుక్మిణి ముందు తెలుసుకున్నది. నారదుని నుండి ఆ కృష్ణుని గురించిన విశేషములను మరీ మరీ తెలుసుకున్నకొలదీ కృష్ణునిపై ప్రేమ అపారముగ వృద్ధి చెందినది. నారదుడు అనగా జ్ఞానమును ఇచ్చువాడు అని అర్ధము. భక్తిచే భగవంతుడు లభించునని ‘‘భక్త్యాత్వనన్యయా’’ అని గీత చెప్పుచున్నది.

కావున దత్త మతములోనికి ప్రవేశించుటకు అర్హత: నీవు ఒక ప్రాణివై ఉన్నచో చాలును. ఎట్టి గుణములు ఉన్ననూ మృగములు సైతము దైవ ప్రేమల ద్వారా దైవమును చేరవచ్చును. ఏనుగు, సాలీడు, సర్పము కూడా శ్రీకాళహస్తిలో ముక్తిని పొందినవి. సర్పము చాలా దుష్టప్రాణి. దీని దుర్గుణములను వదులుకొమ్మని స్వామి దానికి బోధించలేదు. బోధించిననూ దానికి అర్ధము కాదు. అట్టి సర్పమునకే మోక్ష అర్హత ఉన్నప్పుడు ఒక దుష్ట మానవునకు ఏల అర్హత లేదు. మతములు విధించు ప్రవేశ అర్హతలో మానవులు నిరుత్సాహమును పొందిఉన్నారు. తల తెంచుకున్నకాని ప్రవేశార్హత లేదని ఒక సంస్థ చెప్పినచో ఆ సంస్థ లోనికి ఎవరు చేరగలరు? అట్లే మతములు దుర్గుణములను తొలగించుకొనుట అన్నది విధించినచో ఎవరికిని సాధ్యముకాదు. కాకున్న, లోకశాంతికి భంగము రాకుండా నిగ్రహించుకొన వచ్చును. అట్టి నిగ్రహము దత్తమతములో కూడా విధించబడియే ఉన్నది. కావున దత్తమతములో లోకశాంతి కొరకు నీ దుర్గుణములను నిగ్రహించుకొన్నచో, స్వామిని చేరు సాధనలో మాత్రము అవి అడ్డు కానందున, మరియు సాయపడుటవలన, సాధనలో వాటి నిగ్రహము కూడా అవసరములేదు.

సాధనలో సాయపడునట్లు దుర్గుణములను స్వామి వైపుకు ఎట్లు మరల్చవలయును? ప్రతి జీవునిలో కోట్ల జన్మల నుండి పేరుకుపోయిన ఆరు దుర్గుణములు ఉన్నవి. అవి కామ, క్రోథ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఇందులో క్రోథ, లోభ, మద, మాత్సర్యములు రజో గుణములు. కామ, మోహ ములు తమో గుణములు. స్వామి వైపుకు దుర్గుణములను మరలించు విషయములో ఒక చిన్న ఉదాహరణ: సినిమా పాటలలో ఉన్న ప్రేమను ఆ పాటలలో చిన్న మార్పుల ద్వారా స్వామి వైపుకు మరలించ వచ్చును. ఆ పాటలలో ఉన్న మధురమైన శక్తి వంతమైన లయ, రాగములు నిన్ను స్వామి వద్దకు తీసుకొని పోవు వాహనములుగా మారుచున్నవి. ‘‘చురాలియా హై తుమ్నే...’’ అను సినిమా పాటను తీసుకొని సనమ్ అను శబ్దమునకు బదులు హరే శబ్దమును పెట్టుము. ఇప్పుడు నీ ప్రేమ మాధుర్యము అంతయును విష్ణువగు కృష్ణునిపై కేంద్రీకరించబడి ఉన్నది! చూచితిరా! ఒక సినిమా పిచ్చివాడు తన దుర్గుణములలో ఎట్టి మార్పులను చేయనవసరము లేకయే మహాభక్తునిగా మారినాడు. ఈ పాటను వాడు ప్రార్ధనగా పాడుచున్నప్పుడు ఎట్టి బలవంతము లేక పాడును. బలవంతము లేని సహజమైన ఆరాధనయే సత్యము.

బిల్హణుడు అను కవి ప్రియురాలి మైకములో పోవుచుండగా దారిలో ఉన్న ఒక ఋషికి తన కాలు తగిలినది. ఋషి ఆగ్రహించినాడు. అప్పుడు బిల్హణుడు ఇట్లు అడిగినాడు: ‘‘ప్రియురాలి మైకములో ఉన్న నాకు, నా కాలు నిన్ను తగిలినట్లు తెలియలేదు. భగవంతుని మైకములో ఉన్న నీకు ఎట్లు తెలిసినది?’’ అప్పుడు ఋషి సంతసించి ఇట్లు చెప్పినాడు. ‘‘ నీ ధ్యానము అద్భుతము. కాని నీ లక్ష్యము మంచిది కాదు. నీ ప్రియురాలి స్థానములో కృష్ణుని ఉంచుకొన్నచో నా కన్న ముందు నీవు స్వామిని చేరుదువు’’. ఆ క్షణమునుండి బిల్హణుడు కృష్ణ భక్తునిగా మారి సంన్యాసి అయినాడు.
(contd... in part-2)

Friday, July 24, 2009

గురుదత్తుని పొందే మార్గము

“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అని వేదము. స్వామి సత్యమైన అనంతమైన బ్రహ్మము అని చెప్పుచున్నది. స్వామి అంటే గురు దత్తుడే. నీకు ఇష్టమైననూ, కాకున్ననూ దత్తుడు సత్యమునే భోధించును. ఇందుకే ఇంతవరకు దత్తుడు ప్రసిద్ధికి రాలేదు. అయితే ఇప్పుడు ప్రసిద్ధికి వచ్చుచున్నది. కారణమేమనగా ఈ మధ్య ప్రజలు సత్యము యొక్క విలువను గుర్తించుచున్నారు. సత్యము యొక్క ఫలము నిజముగా, శాశ్వతముగా యుండును.

సాధారణముగా దేవునితో జనులు వ్యాపార సంబంధమును పెట్టుకుంటారు. ఒక సమస్య పరిష్కారమనకు గానీ, ఒక లాభమును పొందుటకుగానీ, స్వామి వద్దకువచ్చి, ముడుపులను అనగా లంచమును యిస్తామని మొక్కుకొనుచున్నారు. దానిలో కూడ ఇప్పుడు తెలివి ముదిరిపోయినది. తిరుపతిలో దేవునితో “ముందు ఈ పని చేసిపెట్టుము పని జరిగిన తరువాత యీ పూజను చేయించెదను, లేక ఇంత డబ్బుయిచ్చెదను” అనుచున్నారు. అనగా పనికి ముందే డబ్బును ఇచ్చుటకు దేవుని కూడా శంకించుచున్నారు. ఇది అసలు దేవుని అస్తిత్వమునే అనుమానించుట అగుచున్నది. మరియొక మార్గము ఏమనగా బిచ్చగాడు అన్నము కొరకు యాచించినట్లు, దేవుని ధ్యాన, స్తుతులతో యాచించుట. ధనవంతుడైన భక్తుడు యీ మార్గములో యిట్లు దేవుని యాచించుటలో వాని ఆలోచన అంతరాంతములలో వానికి తెలియక ఇట్లు దాగియున్నాది. ఆ ఆలోచన ఏమనగా “దేవుడున్నాడో లేడో తెలియదు. ఉంటే, స్తోత్రములతో ప్రసన్నుడిని చేసుకుంటాను. ఒక వేళ లేకుంటే నాపని నా శక్తి చేతనే జరిగి ఉండి, దానిని దేవుడు చేశాడని భ్రమపడి దేవునికి డబ్బు యివ్వవలసి వచ్చును”. ఇట్టి ఆలోచన వాని మనస్సులో ఉన్నట్లు వాడు అంగీకరించడు. ఏలననగా ఈ భావము చాలా సూక్ష్మరూపములో ఉంటుంది. కావున మనస్సు గ్రహించలేదు. కావున ఆ భావము తనలో లేదనుకుంటాడు. కాని దత్తుడికి ఎంత సూక్ష్మమైనా తెలుస్తుంది. బిచ్చగాడి పద్ధతిలో పేదవాడు భగవంతుని యాచించుటలో తప్పు లేదు. కాని ధనవంతుడు అట్లు యాచించుట నీచము.

స్వామికి గురుదక్షిణ రూపంలో ధనమును అర్పించుట నిజముగా సత్యమైన ప్రేమకు పరిక్ష. ఇదే క్రియాత్మకమైన కర్మఫల త్యాగము. నీవు నీ భార్యా పుత్రులను నిజముగా ప్రేమించుచున్నావు. కాన వారికి నీ ధనము నిచ్చుచున్నావు. స్వామిని కూడా నిజముగా ప్రేమించుచున్నచో స్వామికి నీ ధనము నిత్తువు. నీ కర్మఫలమగు ధనమను త్యజించుటయే గీతలో ఘోషించబడిన కర్మఫల త్యాగము. ఐతే స్వామి నుండి సాయమును కోరుచూ లంచముగా గురుదక్షిణ ఇచ్చుట నీచము. ఈశావాస్య ఉపనిషత్తు మొదటి మంత్రములో ఈ ధనమంతయును స్వామిది. నీకు కావలసిన కనీస ధనమును తీసుకొనుము. నీవు ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరగి యిచ్చివేయుము. వేదము మరియు ఇట్లు భోధించినది. “సిగ్గుపడుతూ, భయపడుతూ ఇమ్ము”. ఏలననగా స్వామి అనుమతించని ధనమును దొంగిలించినావు. కావున గురు దక్షిణను ఎట్టి ప్రతిఫలమును కోరకుండా స్వామకి సమర్పించవలెను. లేనిచో ఆ దొంగిలించిన ధనము నీకు కష్టములను తెచ్చును.

వేదము “శ్రద్ధయా దేయం”అని, అనగా గురుదక్షిణను ప్రేమతో ఇమ్మని చెప్పు చున్నది. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. దీని ద్వారా స్వామితో నిత్యసంబంధము ఏర్పడుచున్నది. ఇందులో లెక్క ఉండదు. నీ ధనమును నీ పుత్రునకు ఇచ్చుచున్నావు. అతడు నీకు సేవ చేయుచున్నాడు. ధనము ఎంత? సేవ మూల్యము ఎంత? రెండు సమముగా అయినవా? లేదా? అను ప్రశ్నలు రావు. వానికి నీవీయ గలిగినంత ధనము నిచ్చినావు. వాడు నీకు తాను చేయగలిగినంత సేవ చేసినాడు. అలాగే నీ వీయ గలిగినంత గురుదక్షిణ స్వామికి ఇచ్చినావు. స్వామి నీకు అవసరము వచ్చినప్పుడు నీకెంత అవసరమో అంత వరకు సాయపడును. ఇందులో లెక్కలుండవు. శ్రీ కృష్ణుని వేలు కోసుకున్నది. వెంటనే ద్రౌపది తన చీరను చింపి వ్రేలికి కట్టినది. స్వామికి కావలసినది ఆ సమయములో ఆ చీర ముక్క మాత్రమే. అది ఆమె స్వామికి ప్రతి ఫలాపేక్ష లేకుండా సమర్పించిన గురుదక్షిణ. కావున దానిని గురించి మరచి పోయినది. దుశ్శాసనడు తన చీరెలను లాగు చున్నపుడు కూడా దాని విషయమును ప్రస్తావించలేదు. ఆ విషయమును ప్రస్తావించి యున్నచో, వడ్డీతో కలిపి ఒక చీర వచ్చి యుండెడిది. కాని ఆ సమయమున ఆమెకు అనంత సంఖ్యలో చీరెలు కావలెను. ప్రతి ఫలాశలేని సేవకు అనంత ఫలము ఉండును. ఏలననగా ఆ సత్య బంధంలో లెక్క ఉండదు కావున స్వామి ఆ చీరె ముక్కను అనంత సంఖ్యలో చీరెలుగా మార్చి అందచేసినాడు. ప్రేమలో అవసరమే కాని లెక్క కూడదు.

Tuesday, July 21, 2009

గణేష చతుర్ధి నాటి దివ్యవాణి (21.8.2001)

శ్లో|| ఇంద్రియా దీనాం అగ్రాహ్యం బ్రహ్మ
కించిత్ గ్రాహ్యం ఆశ్రిత్య విద్యుత్
తంత్రీవ అద్వైతం వర్తతే||

తాత్పర్యం: ఇంద్రియాదులకు అందని పరబ్రహ్మము వాటికి అందు ఒకానొక పదార్ధమును ఆశ్రయించి తీగ యందు వ్యాపించిన కరెంటు వలె దాని కన్న వేరు కాక అద్వైతమై యుండును.

శ్లో|| "ఇహ చేత అవేదీక్ అధ సత్య మస్తి
న చేత్ ఇహవేదీత్ అవేదీత్ మహతి వినష్టిః
ఇహ చేదవేదీ దధ సత్య మస్తి నచేది వావేదీ న్మహతీ వినిష్టిః" అని శ్రుతి

దీనిని గ్రహించి మనుష్య శరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమును బ్రహ్మముగా గ్రహించి ఉపాసించియు, వారు మరల తమ శరీరముతో సమానమైన మనుష్య శరీరము పై గల మాత్సర్యముతో మరల అద్వైతమును వదలి ద్వైతముగా చూచి అపార్ధమును ఆశ్రయించి ఆ నరావతారుని అవమానింతురు. ఇదే గీతలో శ్రీ కృష్ణభగవానుడు చెప్పినది.

శ్లో|| అవజానంతి మాం మూఢా మానుషీం తను మాశ్రితమ్
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్‌||

తాత్పర్యము: నా పరతత్త్వమును తెలియని మూఢులు, సర్వ భూతములకు ప్రభువును మానవదేహమును ఆశ్రయించిన నన్ను అవమానించు చున్నారు. మనుష్య శరీరమును ఆశ్రయించిన పరమాత్మను గ్రహించినవాడే నిజముగా పరమాత్మను పొందుచున్నాడు. ఇంత కన్న వేరు మార్గము లేదు. కాన అట్టి నరాకారమును త్యజించిన వాడు మహానాశనమును పొందుచున్నాడు. బ్రహ్మము ఆశ్రయించు పదార్ధములలో శిలాది విగ్రహముల కన్ననూ సంభాషణ, సహవాసములను అనుగ్రహించు నరాకారమే పరిపూర్ణమైన ఆనందము నిచ్చును. కావున అత్యుత్తమము.
ఐతే పరబ్రహ్మమును గుర్తించు మార్గమేది? బ్రహ్మమును గుర్తించుటకు అష్టసిద్ధుల ప్రదర్శనము ప్రధానము కాదు. జ్ఞానమే పరబ్రహ్మమును గుర్తంచు లక్షణము. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” జ్ఞాన సాగరుము ముందు అష్టసిద్ధులు అల్పాది అల్పములు. మండనమిశ్రుడు (సురేశ్వరులు) శ్రీ శంకరులను పరబ్రహ్మముగా గుర్తంచి జీవితాంతము శిష్యుడై సేవించుటకు కారణమేమి? అష్టసిద్ధుల ప్రదర్శనమా? కాదు. కాదు. ఆనాడు మండనమిశ్రుడు ఆబ్దీకము పెట్టుటకు జైమిని, వ్యాస మహర్షులను ఆ మంత్రణము చేయునప్పుడు, శంకరుల మూసియున్న తలుపులలోనుండి లోనికి ప్రవేశించుట అష్టసిద్ధుల ప్రదర్శనమే కదా! జైమిని, వ్యాసులకు ఆ ఆష్టసిద్ధులు క్రొత్తయా? వారేమి ఆశ్చర్యచకితులు కాలేదు. మరి మండనమిశ్రుడు ఆశ్చర్యచకితులైనారా? కాలేదు కాలేదు. పైగా “ఎవరు ఈ బొడి గుండు”అని శంకరులను సంబోధించినాడు గదా. కనుక పరబ్రహ్మమును గుర్తంచుటకు అష్టసిద్ధులు లక్షణము కానేకాదు. మరేమి? అంటే జ్ఞానమే లక్షణము. మండనమిశ్రుడు శ్రీ శంకరులతో 21 రోజులు నిర్విరామముగా జ్ఞాన చర్చ చేసి ఆనందించి, పరవశుడై, జైమిని, వ్యాసులు “భేష్‌ భేష్‌”అనగా ఆ జ్ఞానసముద్రములో మునక వేసి శంకరులను పరబ్రహ్మముగా గుర్తించి, శిష్యుడై సన్యసించి సురేశ్వరాచార్యులుగా జీవించియున్నంత కాలము శిష్యుడై సేవించితరించారు. కనుక జ్ఞానమే పరబ్రహ్మమును గుర్తించుటకు లక్షణము.

Sunday, July 12, 2009

గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: కర్మఫలత్యాగము-4

గురుదక్షిణలను ఇచ్చిన తరువాత దానిని సద్గురువు ఏమి చేయునని పరీక్షించరాదు. పూర్ణ విశ్వాసముతో ఇయ్యవలెను. ఆయనను సద్గురువుగా నిశ్చయించిన తరువాత మరల పరీక్ష ఏల? అగ్ని అని నిశ్చయించిన తరువాత దానలో మరల వేలు పెట్టి పరీక్షించరాదు. నీ విశ్వాసము పూర్ణము కానిచో కోతి పిల్ల తన తల్లి పొట్టను పట్టుకొన్టట్లు ఉండును. ఒక స్థలము నుండి మరియొక్క స్థలమునకు తీసుకొనిపోవు బాధ్యత మాత్రమే తల్లిది. పట్టు బాధ్యత పిల్లది. కావున పడిపోవచ్చును. ఇదే మర్కట కిశోర న్యాయము. విశ్వాసము సంపూర్ణమైనచో మార్జాల కిశోర న్యాయముగా పిల్లి తన పిల్లను నోట కరుచుకొని తీసుకొని పోవును. సాయిబాబా గురుదక్షిణ ఖర్చు గురించి ఏ ఒక్కరు సాయిబాబాను ప్రశ్నించలేదు. ఒక ఇన్ కంటాక్స్ అధికారి ప్రయత్నించి విఫలుడయ్యెను. కటిక పేదవాడగు మహల్సాపతికి సాయి ఏమియును ఇచ్చుట లేదని భక్తులు బాధపడినారు. సాయి మహల్సాపతియొక్క స్థిర భక్తిని పరీక్షించుచున్నాడని భక్తులకు తెలియదు. సాయము చేసినచో ఆ పరీక్ష పాడగును. పరీక్ష లేకున్నను నీ స్థితి స్వామికి తెలియును. కాని మీరు చాలా గొప్ప స్థితిలో ఉన్నట్లు ఊహాలోకమున విహరించుచున్నారు. స్వామి బోధించిననూ నమ్ముటలేదు. పరీక్షలలో నిరూపింపబడినకాని నమ్మరు. కావున దత్తపరీక్షలు నీశ్రేయస్సుకే కాని సర్వజ్ఞుడగు స్వామికొరకు కాదు. ఈ పూర్ణిమ చంద్రుడును మీరు కూడబెట్టిన ధనమునే కాదు, దానిని గురుదక్షిణగా ఇచ్చినప్పుడు మీకు ఉండవలసిన పూర్ణ విశ్వాసరూపమగు మనస్సును సూచించున్నాడు. చంద్రుడు ధనమును, మనస్సును కూడా సూచించున్నాడు. ‘‘చంద్రాంహిరణ్మయీం’’, ‘‘చంద్ర మామనసో’’ అని చెప్పుచున్నది. సాయి తనకు దక్షిణలను ఇచ్చువానిని నేరుగా తాను ఈయదలచుకున్నవారికి ఇప్పించి ఉండవచ్చును కదా! వీటిని తీసుకుని ఆయన రహస్యముగా పంచెడివాడు. అట్లు చేయుట ద్వారా తనకు గురుదక్షిణలను ఇచ్చిన వారి యొక్క పూర్ణ వాశ్వాసమును పరీక్షించెడివాడు.

Friday, July 10, 2009

గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: కర్మఫలత్యాగము-3

దానములో తొందర పనికిరాదు. సద్గురువు లభించువరకు ఓర్పుతో నీ ధనమును కూడబెట్టుకొనుచూ లభించగానే మొత్తమును గురుదక్షిణగా ఇమ్ము. ఆరోజే నిజమైన గురుపూర్ణిమ. ప్రతిరాత్రి ఒక్కొక్క కళతో చంద్రబింబము ఈనాటికి పూర్తి అగునట్లు నీవు కూడబెట్టిన ధనముతో నీ హుండి పూర్తి కావలయును. దానములో దేశము, కాలము, పాత్ర అను మూడు అంగములు ఉండును. పాత్ర చాలా ముఖ్యము. గురుపూర్ణిమ (కాలము) రోజు, కాశి (దేశము)లో దానము చేయుట ముఖ్యము కాదు. యోగ్యునకు (పాత్ర) దానము చేయుట ముఖ్యము. ఆ పాత్ర సద్గురువు అవునా? కాదా? అని నీవు విచారించుట లేదు. సద్గురువగు గురుదత్తుడు లభించినప్పుడు నీవు కూడబెట్టిన ధనమును గురుదక్షిణగా అర్పించిన ప్రదేశమే కాశి. ఆ రోజే నిజమైన గురుపూర్ణిమ.

సద్గురువు లభించనిచో దీనుడైన దత్తభక్తునకు దానము చేయము. నారద భక్తి సూత్రము ‘‘తన్మయాహితే’’ ప్రకారముగా స్వామి అవతార పురుషునిలోనే కాక భక్తులలోను ఉన్నాడు. అయితే భక్తులలోను ఉన్నాడు. అయితే భక్తులలో స్వామి బోధించినది ఆ జీవుడు బోధించి ఆచరిస్తాడు. అప్పుడు దోషములు రావచ్చును. ఉదాహరణకు నీవు ఒక భక్త సమాజమునకు గురుదక్షిణ ఇచ్చితివి. దానితో వారు శివరాత్రినాడు కాశీలో వంద మందికి అన్న దానమును చేస్తారు. అయితే సద్గురువు, పాత్రడైన ఒకనికి వంద రోజులు అన్న దానమును చేసి నీ గురుదక్షిణను పూర్ణ
ఫలమిచ్చును. సద్గురువు విషయములో శరీరములో స్వామి ఒక్కరే ఉంటారు. కావున ఆయన బోధలో కాని, పనిలో కాని ఏ దోషము రాదు. షిరిడీసాయి వచ్చిన గురుదక్షిణలను బీద భక్తులకు ఇచ్చేవారు. సర్వజ్ఞుడగు ఆయనను ఎవరు మోసగించలేరు. బిచ్చగాళ్ళు నిన్ను మోసగించగలరు.

Thursday, July 2, 2009

గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: కర్మఫలత్యాగము-2

శబరి శ్రీరామునికి ఆమె ఆహారమగు రేగిపండ్లను సమర్పించినది. తిన్నడు వేటాడి తెచ్చిన పచ్చిమాంసమగు పాపధనమును శివునికి సమర్పించినాడు. శివుడే విష్ణువని వేదము. కావున ఇరువురు ఒక్కరినే చేరినారు. ఇరువురిలోను భక్తి తీవ్రత సమానముగ ఉన్నది. నీవు పాపధనమును సైతము గురుదక్షిణగా స్వామికి ఇచ్చినచో నీ పాపము లెక్కింపబడుటలేదు. పాపముతో సంపాదించిన వేట మాంసము తాను తినక స్వామికి అర్పించిన తిన్నడు ముక్తుడైనాడు. తాను భుజించిన, పాపమును పొందును.
తిరుపతిలో స్వామికి నీ కష్టములో సాయము లభించిన తరువాత ధనమును గురుదక్షిణగా ఇచ్చుచున్నావు. ఆ ధనము స్వామిదే. నీవు దొంగిలించిన పెచ్చుధనమే దానిని క్షమాపణ కోరుచూవాపసు చేయుటకు బదులు దానితో స్వామితో పనిచేయించుచున్నావు. పని చేసిన తరువాతనే డబ్బు ఇచ్చుట! నీ విశ్వాసము ఇది! నాస్తికులు కూడా డబ్బు ఇచ్చి ఇతరుల చేత పని చేయించుచున్నారు. వారి కన్న నీవు ఏమి ఎక్కువ? ఆ స్వామిలో వేషధారిగా ఉన్న గురుదత్తుడు ఈ రోజు మీరు దిద్దుకొనుటకై సత్య జ్ఞానమును బోధించుచున్నాడు.ఈనాడు గురుదత్తుడు స్వామి ధనమునుండి దొంగిలించిన పెచ్చుధనమును స్వామికి గురుదక్షిణగా సమర్పించి నీ పాపముల గొలుసునుండి విముక్తిని పొందవలెనని బోధించుచున్నాడు. నీవు ఒక దుకాణము నుండి దొంగిలించిన ధనమును ఇచ్చివేయవలెను. కాని దానితో ఏ వస్తువును దుకాణములో కొనరాదు. నీవు క్షమాపణ చెప్పి ఇంటికి పోయినచో దత్తుడు ప్రసన్నుడై నీ ఇంటిలో వంద వస్తువులు ఉండునట్లు చేయును.

పాలుతాగి దొంగిలించిన కప్పును ఆ కప్పుయొక్క యజమానికే ఇచ్చివేయవలెను. అలాగే స్వామికే సమర్పించవలెను. ఇదే గురుదక్షిణ. దీనిని సమర్పించినప్పుడు క్షమాపణ, భయము ఉండవలెను. కాని గర్వము ఉండరాదు. ‘‘భియాదేయం’’ అని వేదము. అనగా భయముతో స్వామికి ఇమ్మని అర్ధము. ‘‘సంవిదాదేయం’’ అని వేదము. అనగా జ్ఞానముతో స్వామికి ఇమ్మని అర్ధము. అనగా జ్ఞానము అను గుర్తుతో స్వామిని గుర్తించమని అర్ధము. ‘‘శ్రద్దయాదేవం’’ అని వేదము. అనగా స్వామిని గుర్తించువరకు ఓర్పుతో వేచిఉండమని అర్ధము. దీని అర్ధము కప్పును దాని యజమానికే ఇచ్చునట్లు సమస్త ధనమునకు యజమానియగు స్వామికే నీవు దొంగిలించిన ధనమును గురుదక్షిణగా ఇమ్మని అర్ధము.