Saturday, February 20, 2010

శ్రీ కృష్ణుడు-విశ్వరూపము

శ్రీ కృష్ణ భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపమును అర్ధము చేసుకొనుటయే సర్వ వేదముల యొక్కయు సర్వ శాస్త్రముల యొక్కయు సారమైయున్నది. శ్రీ కృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించక ముందు కూడ విశ్వరూపముతోనే యున్నాడు. విశ్వరూపమును ఉపసంహరించిన తర్వాత కూడ విశ్వరూపముతోనే యున్నాడు. అర్జునుని యొక్క దృష్టి మాత్రమే మారినది. సూర్యుడు ఎప్పుడును ప్రకాశించుచునే యున్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టగనే ప్రకాశములేని ఒక బింబమాతృనిగా గోచరించుచున్నాడు. ఆ కళ్ళ జోడు తీయగనే మరల చూచుటకు వీలుకాని మహా ప్రకాశముతో మండుచున్నాడు. నీవు నల్ల కళ్ళజోడు పెట్టినపుడు సూర్యుని యొక్క తేజస్సు సూర్యుని నుండి పోవుటలేదు. ఆ కళ్ళజోడు తీయగనే సూర్యునికి కొత్త తేజస్సు వచ్చుట లేదు. అందుకే విశ్వరూప ప్రదర్శనమునకు ముందు "దివ్యందదామి తేచక్షుః" అనగా నీకు దివ్య దృష్టిని ఇచ్చుచున్నాను అన్నాడు. అనగా నీ కళ్ళకు ఉన్న నల్ల కళ్ళజోడును తీసివేసి నీ యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో నన్ను తిలకించుము అని అర్ధము. కావున పరమాత్మ అవతరించునపుడు మనుష్య రూపమున ఉన్నట్లు మనకు గోచరించుటకు కారణము మనకున్న అజ్ఞానమే కాని ఆయన నిజముగా అజ్ఞానము చేత కప్పబడిలేడు. కొందరు పచ్చని వర్ణములో ఉన్నారు. వారి మధ్యకు ఎర్రని వర్ణము ఉన్న వ్యక్తి రావలసి వచ్చెను. వారు ఎరుపు వర్ణమును సహించలేరు. అప్పుడు ఆ పచ్చని వర్ణము కలవారి కండ్లకు పచ్చని వర్ణము కల కళ్ళజోళ్ళను పెట్టించినాడు. ఇప్పుడు వారి మధ్యకు ఎర్రని రంగు కలవాడు వచ్చినాడు కాని వారందరికిని వారి కళ్ళజోళ్ళ ప్రభావము వలన వాడు పచ్చగనే కనిపించుచున్నాడు. ఇప్పుడు వారిలో ఒకని యొక్క కండ్ల జోడు తీసివేసి వాని యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో తనను చూడమన్నాడు. అప్పుడు వానికి ఎర్రని రంగుతో ఈ వ్యక్తి కనపడినాడు. వారందరికిని ఎరుపు రంగు చూచిన భయము కాన వాడు భయముతో కేకలు పెట్టు నీవు మరల పచ్చగనే కనిపించమని ప్రార్ధించినాడు. అప్పుడు ఈ వ్యక్తి వానికి మరల పచ్చ కళ్ళజోడును పెట్టి పచ్చగా కనిపించినాడు. ఇదే విధముగా అర్జునుడు మాయ యను పచ్చ కండ్లజోడును పెట్టుకున్నంత కాలము కృష్ణునిగా కనిపించినాడు. సర్వ జీవులకును ఈ మాయయను కళ్ళజోడు జన్మ నుండి మరణ పర్యంతము ఉండుచున్నది. ఈ కళ్ళజోడే అహంకార, మమకారములను రెండు కంటి పొరలు. స్వామి యొక్క నిజ స్వరూపమును దర్శించకోరినపుడు స్వామి అర్జునుని యొక్క కళ్ళజోడును తీసివేసినాడు. అప్పుడు అర్జునుడు తన నిజ నేత్రములతో సత్యమైన దృష్టితో స్వామి యొక్క నిజ స్వరూపమును చూచినాడు. దానిని చూడలేక భయపడినందున మరల అర్జునునకు ఆ కళ్ళజోడును పెట్టినాడు. కావున పరమాత్మ అవతరించునపుడు తన యొక్క నిజ స్వరూపముతోనే క్రిందకి వచ్చినాడు. దానిని జీవులు చూడలేరు.

కావున మాయ జీవుల కండ్లకు స్వామి మనుష్యునిగ కనిపించు భ్రమను కలిగించు కళ్ళజోళ్ళను జీవుల కండ్లకు పెట్టినది. అవ = అనగా క్రిందకు, తర = అనగా దిగుట. ఒక వ్యక్తి మేడపై నుండి క్రిందకి దిగునప్పుడు తన నిజ స్వరూపముతోనే క్రిందకు దిగుచున్నాడు. అంతే తప్ప దిగునపుడు ఒక ముసుగు వేసుకొని దిగుటలేదు. కావున పరమాత్మ అవతరించునపుడు నిజముగ మనుష్య శరీరమును ఆశ్రయించిలేడు. ఆయన మనుష్య శరీరములో ఉన్నట్లు మనకు మాయ భ్రమను కలిగించుచున్నది. కావున అవతార పురషుని శరీరము లోపల మరియొక పరమాత్మ శరీరము ఉన్నదని భావించుట జీవుల యొక్క అజ్ఞానమే. పచ్చ కళ్ళజోడు పెట్టుకునప్పుడు ఎర్రని వ్యక్తిపై పచ్చ రంగు పూయబడలేదు. నీవు కళ్ళజోడు తీయగనే ఆ వ్యక్తి పచ్చరంగును నీటితో కడుకుని మరల ఎర్రగా కనిపించుట లేదు. అతడు ఎప్పుడునూ ఎర్రగానే ఉన్నాడు. కావున శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును విశ్వరూపముతోనే ఉన్నాడు. ఆయన యొక్క పరిమితమైన మానవాకారము మన యొక్క కంటి భ్రమయే. కావున అవతార పురుషుడు దివ్య దర్శనములను చూపుచున్నప్పుడు ఆయనలో ఎట్టి మార్పులేదు. ఆయన చేయుచున్నది మన యొక్క కంటి పొరలను కొంచెము ప్రక్కకు త్రోయుచున్నాడు. ఇదియే వేదాంతము యొక్క చిట్ట చివరి కొస. కావున గోపికలు శ్రీ కృష్ణుని బాహ్య స్వరూపము అంతః స్వరూపము అను రెండు స్వరూపములున్న వానిగా చూడలేదు. వారికి శ్రీ కృష్ణుడు సాక్షాత్తుగా పరబహ్మమే. వారి కండ్లకు మాయలేనే లేదు. కావున వారికి కృష్ణుడు ఎప్పుడును మానవునిగ గోచరించలేదు. వాళ్ళు కళ్లద్దములు లేనివారు. వారికి పసుపు, ఎరుపు అను రెండు రంగులు లేవు. ఒకే ఒక ఎరుపు రంగు నత్త్యము కనిపించుచున్నది. కావున వారికి కృష్ణుని పైనున్న విశ్వాసము ఒక క్షణకాలము కూడ చలించలేదు. వారికి ఈ మాయ లేకపోవుటకు కారణమేమనగా, వారికి ఎన్నడును అజ్ఞానము రాలేదు. ఏలననగా వారి జ్ఞానము అగ్నివలె ప్రకాశించుచున్నది. వారు ఎన్నో జన్మల నుండి నిద్రహారములు లేక ఏ ఇతర విషయమును మనస్సుకు రానీయక నిరంతరము భగవంతుని సత్సంగములో కోటాను కోట్ల జన్మలు గడిపిన బ్రహ్మర్షులు. వారికి కల ఆ నిశ్చలమైన శ్రద్ధయే వారి బ్రహ్మ జ్ఞానాగ్నికి కారణము. "శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం" అనగా శ్రద్ధయే జ్ఞానమునకు మూల కారణము. శ్రద్ధలేని కారణముననే జ్ఞానము బలహీనమై అజ్ఞానము ఆవహించుచున్నది. మిధిలా నగరము తగలబడుచున్నను బ్రహ్మ జ్ఞానము ఆస్వాదించు జనకుడు లేచిపోలేదు. ఆయన యొక్క శ్రద్ధ ఎంతయో ఆలోచించుడు. మనము సినిమా హాలులో కూర్చునప్పుడు నల్లులు పీకుచున్నను, దోమలు రక్తము త్రాగుచున్నను తలుపులు బంధించుట వలన ప్రాణవాయువు లేక శ్వాస ఆడక ఆయాసము వచ్చుచున్నను, ఇంత ఏల పిడుగులు పడినను చలించము. ఆ పిడుగు మూలకముగా సినిమా ఆగిపోయినపుడు ఈ లోకమునకు వచ్చి ఏమి జరిగినదని ఆలోచించెదము.

కాని సత్సంగము యున్నప్పుడు లేక పురాణమో భాష్య ప్రవచనమో వినుచున్నప్పుడు చీమ చిటుక్కు మన్నను ప్రక్కకు చూచెదము. అన్ని ముచట్లు అప్పుడే వచ్చును. ఏ పనియు లేకపోయినను కొంప మునిపోయినట్లు లేచిపోయెదము. పొయ్య మీద పాలు పెట్టివచ్చి క్షణమే అయిననూ అవి పొంగిపోవుటకు ఇంకనూ ఎంతో సమయమున్ననూ ఆ పొంగు సాకుతో వెంటనే లేచిపోయెదము. ఇటువంటి వీరికిని, రాజ్యము తగలపడినను లేవని జనకునకు ఎంత బేధము గలదు. కావున పరమాత్మ పై నిజముగా మనకు శ్రద్ధ లేదు. విలువ లేదు. లౌకికములకు ఉపయోగించునేమోయని, మరణానంతరము రక్షించునేమో అని, అదియును కొందరి విశ్వాసము. అనుమానముతో మనకు శ్రద్ధ లేకపోవుట వలన బ్రహ్మ జ్ఞానము మనలో ఇముడుటలేదు. ఇల్లు, వాకిలి, సంసారబంధము అను నీటితో చల్లారి అజ్ఞానమను పొగతో మనము చుట్టబడియున్నాము. ఇదే "ధూమేనా వ్రయతే వహ్నిః అశ్వతం జ్ఞానమేతేని" అని గీతలో చెప్పబడినది. ఈ అజ్ఞానము యొక్క పొరల వల్లనే మాధవుడు స్వస్వరూపమున క్రిందకు దిగివచ్చినను, మనము ఆయనను గుర్తించ లేక మానవునిగనే చూచున్నాము. మనకు ఆయన యొక్క మాధవ స్వరూపము గోచరించుట లేదు. కావున స్వామిని మాయకప్పి యున్నది. స్వామి స్వ స్వరూపమును ప్రకటించనక్కరలేదు. మన మాయ పొరలను తొలగించుకొన్నచో ఆయన యొక్క స్వ స్వరూపమును మనము చూడ గలుగుదుము. ఆయన యొక్క దివ్య దర్శనము కొరకు ఆయన ఎట్టి ప్రయత్నము చేయనక్కర లేదు. మనమే ప్రయత్నము చేయవలెను.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, February 15, 2010

జీవుడు

జీవుడు ఒక బురద నీటి పాత్రవలె ఉన్నాడు. పాత్ర జడ శరీరముగను నీరు శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము అగు జీవుడు. ఈ జీవుడే ఆత్మ దేహి శరీరి పురుషుడు, క్షేత్రజ్ఞడు, పరా ప్రకృతి అను శబ్దములచే చెప్పబడుచున్నాడు. ఈ బురద నీటిలో యున్న మట్టికణములే జీవస్వభావ గుణములు అగు అహంకార మాత్సర్యాదులు. ఇక ఒక సుగంధ నీటి మహా సముద్రమే ఈశ్వరుడు. ఈ సుగంధ జలములోని నీరే శుద్ధ చైతన్యము. బురద నీటిలోని శుద్ధ జలము అనగా బ్రహ్మము అనబడును. శంకరులు అవతరించిన సమయమున జీవులు నాస్తికులై అసలు ఈశ్వరుడు లేడు అన్నారు. అనగా బురద నీటి ముందు ఈ బురద పాత్రలచేత సుగంధ జలసముద్రము ఉన్నది అనిపించవలెను. దీనికి శంకరులు ఒక చిట్కా చేసినారు. ఓ బురద నీటి పాత్రా! (ఓ జీవా!) నీకును సుగంధ జలసముద్రమునకును (ఈశ్వరునకును) ఏమియు తేడా లేదు. నీలో శుద్ధజలమున్నది. సుగంధ జలసముద్రములోను శుద్ధ జలమున్నది. అనగా జీవునిలోను ఈశ్వరునిలోను శుద్ధ చైతన్యమను ఒకే జలమున్నది. కావున జీవుడే ఈశ్వరుడు. నీవు ఉన్నావు కావున, నీవు ఈశ్వరుడవు కావున ఈశ్వరుడున్నాడు గదా! జీవుడు బురద నీటి పాత్రలోను, సుగంధ జసముద్రములోను ఒకే శుద్ధ జలము ఉన్నంత మాత్రమున బురద నీటి పాత్ర సుగంధ జలము ఎట్లగును. బురద నీటి పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము చాలా తక్కువ. సుగంధ జల సముద్రములోని శుద్ధ జల ప్రమాణము చాలా ఎక్కువ. మరియును బురద మట్టి కణములు (జీవగుణములు) వేరు, సుగంధ జల గుణములు (కల్యాణ గుణములు) వేరు. కావున జీవునకు ఈశ్వరునకు అద్వైతము కుదరదు.

శంకరులు:- శుద్ధ చైతన్యమగు (శుద్ధ జలము) బ్రహ్మము మాత్రమే సత్యము. బురద మట్టి కణములు సుగంధ కణములు (గుణములు) సృష్టిలోని భాగము. సృష్టి మిధ్య. కావున మట్టికణములు, సుగంధ కణములు లేనట్లే. నీవు పాత్రలోని శుద్ధ జలము. ఈశ్వరుడు సముద్రములోని శుద్ధ జలము. కావున జీవుడవగు నీవు ఈశ్వరుడవే.

జీవుడు:- పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము చాలా ఎక్కువ . కావున రెండును శుద్ధ జలము (శుద్ధ చైతన్యము) అయిననూ ప్రమాణములో బేధముండుట చేత అద్వైతము సత్యము కాదు.

శంకరులు:- ఒక పాత్రలోని జలము తక్కువ భాగము ఖాళీ స్ధలమును ఆక్రమించుచున్నది. ఒక బిందెలోని నీరు ఎక్కువ ఖాళీ స్ధలమును ఆక్రమించుచున్నది. ఈ ఖాళీ స్ధలమునే ఆకాశము అనుచున్నాము. ఆకాశము పంచభూతములలో ఒకటి. పంచభూతములు సృష్టిలో భాగములు. సృష్టి మిధ్య అన్నప్పుడు పంచభూతములు మిధ్య కనుక ఆకాశము (ఖాళీ స్ధలము) మిధ్యయే. ఈ శుద్ధ జలము (అనగా శుద్ధ చైతన్యము అనగా బ్రహ్మము) సృష్టికి అతీతమైనది. కావున ఆకాశతత్త్వమునకు అతీతమైనది. కావున ఆకాశ తత్త్వముపై ఆధారపడిన ప్రమాణ తత్త్వము కూడ మిధ్యయే అగును. అనగా "అంతా" "ఇంత" అను ప్రమాణ బేధము మిధ్యయగును. కావున జీవుడన్నను, ఈశ్వరుడన్నను కేవలము శుద్ధ చైతన్యమే.

ఈ విధముగా శంకరులు జీవుడు, ఈశ్వరుడు ఒక్కరే అని ఇరువురు బ్రహ్మమే అని వాదించి నాస్తికుని చేత ఈశ్వరుడు ఉన్నాడు బ్రహ్మము ఉన్నది అని అంగీకరింప చేసినాడు. ఇక్కడ శంకరులు కొన్ని మాయలను చేసినారు. కాని జీవుల శ్రేయస్సు కొరకు చివరలో ఒక మంచి ఫలితమును సాధించుట కొరకు మాయ మాటలు చెప్పుట తప్పుకాదు. ఇచ్చట సత్యము చెప్పుట గురుతత్త్వము కాదు. పెడత్రోవ పట్టిన జీవులను సరియైన మార్గమున మరలించుటకు అవసరమైనచో కొన్న మాయ మాటలు చెప్పియైనను మరలించుటయే గురుతత్త్వము. సత్యమేదో నిష్కర్షగా చెప్పి వింటే వినండి లేకపోతే చావండి అని చెప్పుట గురుతత్త్వము కాదు. అవసరమైనచో సత్యమును దాచి మాయమాటలు చెప్పియైననూ శిష్యులను ఒక మెట్టు ఎక్కించుటయే గురువు యొక్క లక్ష్యమై యుండును. తల్లి పిల్లవానిచే అన్నము తినిపించునప్పుడు చందమామ రావే అని పాట పాడుచు ఈ ఒక్క ముద్ధ తిన్నచో జాబిల్లి దిగివచ్చునని మాయమాటలు చెప్పును. ఇచ్చట తల్లి అసత్యమును చెప్పుట పాపము కాదు. అసత్యము చెప్పియైనను పిల్లవానిచే అన్నమము తినిపించి ఉపకారము చేయుట పుణ్యమే. ధర్మ శాస్త్రములో సహితము సత్యము చెప్పుట కన్నను అహింసయే ఉత్తమ ధర్మమని చెప్పబడియున్నది.

ఒక్కొక్కసారి సత్యము చెప్పుట వలన పాపము కూడా వచ్చును. ఒక సాధువును కిరాతకులు తరుముకు వచ్చుచున్నారు. ఆ సాధువు ఒక పోదలోనికి పోయి దాగుకున్నాడు. అది సత్యవ్రతుడు అని మహర్షి చూచినాడు. ఆయన సదా సత్యమునే చెప్పు వ్రతము కలవాడు. కిరాతకులు పరుగెత్తుకు వచ్చిన వ్యక్తిని గురించి సత్యవ్రతుని అడిగినారు. ఆ వ్యక్తి ఆ పొదలో దాగుకున్నాడని సత్యవ్రతుడు చెప్పినాడు. కిరాతకులు ఆ పోదలోనికి పోయి ఆ సాధువును చంపినారు. సత్యవ్రతుడు మరణించిన తర్వాత ఆయనను యమభటులు నరకమునకు తీసుకొనిపోయినారు. అప్పుడు ఆయన "నేను పాపము చేయలేదు. ఎన్నడును అసత్యము చెప్పలేదు. నన్నేల తీసుకునివచ్చినారు" అని యమధర్మ రాజుని ప్రశ్నించినాడు. అపుడు యమధర్మ రాజు "నీవు సత్యమును పలికినందుకే నరకమునకు వచ్చినావు" అన్నారు. ఏలననగా సత్యము పల్కుట గొప్ప ధర్మము కాదు. ఇంత కన్నను అహింస పరమ ధర్మము. ఒక సజ్జనుడు హింసింపబడుట కన్నను సత్యము పల్కుట గొప్ప ధర్మము కాదు. కావున మాతృ వాత్సల్యము కన్న ఎక్కువ వాత్సల్యము గల గురువు అవసరమైన చోట కొన్ని మాయమాటలు చెప్పినను శిష్యులను ఉద్ధరించుటకే ప్రయత్నించును.

శంకరులు కేవలము సత్యమును స్ధాపించి వాదించుటకు వచ్చిన పండితుడు కాదు. ఆయన లక్ష్యము సత్యమును స్ధాపించుట కాదు. సత్యమును చెప్పినచో నాస్తికులు ఒక్క మెట్టు కూడ ఎక్కరు. చందమామ దిగిరాడన్న సత్యమును చెప్పినచో పిల్లవాడు ఒక్క ముద్ద కూడా తినడు. అప్పుడు ఆ బాలుడు అన్నము తినక శుష్కించి మరణించును. అది హింస యగును. కావున నాస్తికులు ఒక్క మెట్టు అయిననూ పైకి ఎక్కుట కొరకు శంకరులు ఎన్నో మాయ మాటలు గురుతత్త్వమును అనుసరించి చెప్పినారు. బురద మట్టి కణములు, సుగంధ కణములు మిధ్య అన్నారు. మిధ్య అనగా అత్యల్పమైన సత్యము దాదాపు లేనట్లే అన్నారు. అనగా జగత్తు దాదాపు లేనట్లే అని అర్ధము. ఇచ్చట శంకరులు చేసిన మాయ ఏమనగా జగత్తు మిధ్యయే. కాని ఎవరికి? జీవునకు కాదు. అది పరమాత్మ దృష్టిలో మిధ్య. జగత్తు పరమాత్మ యొక్క ఊహా స్వరూపము. ఒక వ్యక్తితో పోల్చి చూచినచో ఆ వ్యక్తి ఊహించు ఊహ మిధ్యయే. కాని ఊహలోని ఒక భాగమగు ఊహా స్వరూపుడగు వ్యక్తికి ఆ ఊహా ప్రపంచము సత్యమే అగుచున్నది. ఊహా లోకము నిజమైన వ్యక్తికి అసత్యము కాని ఊహా లోకములో ఒక భాగమగు ఊహ వ్యక్తికి అసత్యము కాదు. ఈ రహస్యమును బయిటపెట్టనిచో నాస్తికులు ఆ మొదటి మెట్టును ఎక్కరు. కావున ఎవరి దృష్టికి మిధ్య అని పూర్తిగా చెప్పకుండా గోడ మీద పిల్లి వాటముగా జగత్తు మిధ్య, దీనితో జీవుని దృష్టిలోనే జగత్తు మిధ్య యని జీవుడు భావించినాడు. జగత్తులోని భాగములగు బురద మట్టి కణములు, సుగంధ కణములు అసత్యమే. జగత్తులోని భాగమగు ఆకాశము అసత్యము కావున ఆకాశము యొక్క గుణము పరిమాణము కావున, పరిమాణము అసత్యమే కావున చిన్న నీటి గుంటయు, పెద్ద సముద్రము ఒక్కటే అగుచున్నవి. కావున సారాంశము చిన్న బురద నీటి పాత్రయు, పెద్ద సుగంధ జలసముద్రము రెండునూ ఒక్కటే. కావున జీవుడే ఈశ్వరుడు. ఈశ్వరుడే జీవుడు. ఈశ్వరుడగు నేను ఉన్నాను అని అన్నాడు జీవుడు. అనగా ఈశ్వరుడు ఉన్నాడు అని మొదటి మెట్టు ఎక్కినాడు. ఈ విధముగా శంకరులను మనము వాత్సల్య స్వరూపుడైన గురువుగానే చూడవలయునే కాని కేవలము సత్యమును స్ధాపించి తనకున్న పాండిత్యమును ప్రకటించు ఒక పండితునిగా చూడరాదు. జీవుడు బోధకుడైనచో అతడు కేవలము పండితుడు మాత్రమే అగును. ఏలననగా ఒక జీవునకు సాటి జీవులపై వాత్సల్యము ఉండదు. అతడు కేవలము తన పాండిత్యమును ప్రదర్శించి కీర్తిని పొందవలయునన్న కోర్కె కలిగి ఆత్మోద్ధరణకు మాత్రమే ప్రయత్నించును. కాని స్వామి బోధకునిగా వచ్చినపుడు ఆయనకు ఆత్మోద్ధరణము అక్కరలేదు. కీర్తితో అసలు పనిలేదు. కనీసము ఒక్క జీవునియైనను ఉద్ధరించుటకు ఆయన సర్వశక్తిని ఉపయోగించును. ఆయనకు జీవులపై అపార వాత్సల్యము కలదు. కావున స్వామి బోధకుడుగా అవతరించినపుడు మాత్రమే గురువు అనవలెను. పండితులకు గురు శబ్దము వాడరాదు. పరబ్రహ్మమగు స్వామియైన దత్తుడు ఒక్కడే గురువు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, February 1, 2010

హనుమంతుడు (జీవేశ్వరులు)

హనుమంతుడు సంజీవి పర్వతమును ఎత్తినపుడును కృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తినపుడును, ఈ రెండు సన్నివేశములలో గల తేడాను మనము గుర్తించినచో, జీవేశ్వరుల తేడాను మనము తెలుసుకొనగలము. బ్రహ్మ సూత్రములలో "అనుప్సత్తేస్తు శారీరః" ఇత్యాది సూత్రములలో శంకరులు కూడ జీవేశ్వరులకు గల బేధమును స్ధాపించినారు. హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు తన శరీరమును పర్వతము కన్న ఎక్కువ ప్రమాణములో పెంచియున్నాడు. అంత పెద్ద పరిమాణము గల శరీరములో ఇమిడియున్న శక్తి కూడ చాలా పెద్దది. కావున స్వల్ప శక్తి గల పర్వతమును ఎత్తుట మన బుద్ధికి అర్ధమై తర్కమునకు అందుచున్నది. ఒక పెద్దరాయి చిన్నరాయిని మోసినట్లు తర్క బద్ధమైన విషయమై యున్నది. కాని చాలా చిన్న శరీరము గల బాలకృష్ణుడు తన శరీర పరిమాణమును పెంచకయే పర్వతమును ఎత్తుట బుద్ధికి అందక తర్కాతీతమైన విషయముగా యున్నది. మానవునిలో శక్తి లలితములైన డెబ్బది రెండువేల నాడుల యందు ప్రవేశించుచున్నది. ఒక బాలుని శరీరములో ఈ శక్తినంతయు కలిపి చూచినచో ఆ బాలుడు చిన్న బండను మాత్రమే ఎత్తగల శక్తి కలిగి యున్నాడు. ఇంత కన్న ఎక్కువ శక్తి లలితములైన ఆ నరముల యందు ప్రవహించినచో ఆ నరములన్నియు మాడిపోయి శరీరము భస్మమగును. ఒక కొండ ఎత్తుటకు ఒక పెద్ద క్రేన్‌ యంత్రము ఉపయోగించినపుడు ఎంత విద్యుత్‌చ్ఛక్తి కావలయునో ఆలోచించుడు. ఇప్పుడు మన బాలకృష్ణుడు ఆ కొండ నెత్తినాడన్నచో అంత శక్తి ఆ బాలును నరములందు ప్రవహించుచున్నదని అంగీకరించక తప్పదు. కాని ఆ విద్యుత్‌చ్ఛక్తిలో కోటి వంతు ఒక మనిషికి తగిలినను ఆ మనిషి మాడిపోవుచున్నాడు. కాని హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు శరీరము యొక్క పరిమాణము పెరుగుట వలన ఆ శరీరము యొక్క శక్తి పెరిగినది కావున శక్తి చేత శరీరము ఏ మాత్రము బాధించబడదు. ఒక చెంబు పెద్ద బిందెగా మారినపుడు చెంబు నీటి కన్నను ఎక్కువ పరిమాణములో పది చెంబుల నీరు బిందెలో పట్టుచున్నది. కావున జీవునిగా ప్రవర్తించుచున్న హనుమంతుడు కొండ నెత్తుట తర్కమునకు అందుచున్నది. కాని గోవర్ధన పర్వతమును ఎత్తినపుడు కృష్ణుడు శరీరమును పెంచలేదు. కొండ నెత్తు శక్తి మాత్రము పెరిగినది. ఆ అధిక శక్తికి బాలుని శరీరము బాధపడలేదు. బిందెడు నీరు చెంబులో పట్టినవి. ఇది తర్కమునకు అందదు.

శ్రుతులు అన్నియును పరమాత్మ తత్వము తర్కాతీతమని ఘోషించుచున్నవి. "అతర్క్యః" "నైషతర్కేణ", "నమేధయా", "యోబుద్ధేపరతః", "యస్యానతమ్‌ తస్యమతమ్‌" అను శ్రుతులు ఎన్నటికిని ఎవరికిని అర్ధము కాని వాడు పరమాత్మ అని చెప్పుచున్నవి. గీతలో కూడా "మాంతువేదాన కశ్చన" అనగా నన్ను ఎవ్వడును అర్ధము చేసుకొనజాలడు అని చెప్పుచున్నది. కావున జీవుడు ఎన్ని అష్ట సిద్ధులను సంపాదించినను ఈశ్వరత్వము రాదు. అష్ట సిద్ధులు మానవుని తర్కమునకు అందకున్నను ఋషులు దేవతల యొక్క మేధాశక్తి యగు తర్కమునకు అందుచున్నవి. కావుననే ఋషులు దేవతలు అష్ట సిద్ధులను వింతగా చుడరు. మనము నిత్యము చేయు కర్మలకు ఎట్లు ఆశ్చర్యపడమో, దేవతలు ఋషులు అష్ట సిద్ధులకు ఆశ్చర్యపడరు. కావున పరమాత్మ తత్త్వము తర్కాతీతము అనుటకు పరిమితమైన నరాకారములోనే పరమాత్మ ఉన్నప్పుడు అది సాధ్యమగును. విశ్వరూపమును సందర్శించినపుడే అనాది అనంతమైన అకారమున స్వామి గోచరించినాడు. అంత పెద్ద ఆకారముతో ఈ అనాది అనంతమైన విశ్వమును భరించుటలో ఆశ్చర్యమేమున్నది? ఒక పెద్దకొండ ఏనుగును మోయునపుడు ఎట్లు ఆశ్చర్యము లేదు. అది తర్కమునకు అందుచున్నది. మరి శ్రుతులు పరమాత్మ తర్కాతీతుడనుచున్నవి. కావున ఈ విశ్వరూపము పరమాత్మ ఎట్లుగును? కాని పుత్రుడైన చిన్నబాలుడైన కృష్ణునిలో అనాది అనంత విశ్వమును యశోద దర్శించినది. అనంతమైన విశ్వరూపములో ఈ పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్ధమై తర్కమునకు అందుచున్నది. కాని బాలకృష్ణుని చిన్ననోటిలో ఇంత పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్ధము కాక తర్కాతీతమై యున్నది. కావున శ్రుతులు చెప్పిన దాని ప్రకారము పరమాత్మ విశ్వ రూపమా? లేక బాలాకృష్ణుడా? యుక్తి ద్వారా కూడా ఇదే సిద్ధించును. ఏలననగా, బ్రహ్మము అను శబ్ధమునకు అర్ధము ఏమి? గొప్పది అని అర్ధము. తర్కబద్ధమైన విశ్వరూపము గొప్పదా? తర్కాతీతుడైన బాలకృష్ణుడు గొప్పవాడా? ఇక అనుభూతిని తీసుకున్ననూ, "ఆశ్చర్యవత్‌ పశ్చ్యతి కశ్చిదేనమ్‌" అని శ్రుతి. అనగా పరమాత్మ దర్శనము ఆశ్చర్యమును కలిగించును అని అర్ధము. విశ్వరూపము భయమును కలిగించినది. "భీతభీతః ప్రణమ్య" అని గీత. "అధతస్య భయం" అను శ్రుతి అజ్ఞానము భయమును కలిగించునని చెప్పచున్నది. విశ్వరూపము తర్కబద్ధము కావున అజ్ఞానమే. ఇది యొక సిద్ధియే. కాని కృష్ణుని నోటిలో విశ్వము చూచినపుడు ఆశ్చర్యము చెందుటకు తర్కాతీత స్ధితియే కారణము. విచిత్రమే ఆశ్చర్యకారణము. ఈ విచిత్రమే మాయ. "మయవైచిత్ర్యే" కదా. ఈ విచిత్రము అనగా మాయ కలవాడే ఈశ్వరుడు. "మాయినంతు మాహేశ్వరమ్‌" అని గీత. కావున చర్మ చక్షువులకు గోచరించిన వసుదేవుని పుత్రుని స్వరూపమే పరబ్రహ్మము అని తెలియువాడు అసలు దొరకడని "వాసుదేవస్సర్వమితి" అను శ్లోకము చెప్పుచున్నది. "యత్సాక్షాదపరోక్షాత్‌" అను శ్రుతి పరబ్రహ్మము ప్రత్యక్షమగుచున్నది. "ఇహచేదవేదీత్‌" అను శ్రుతి ఈ లోకమున నున్న సత్యరూపమును కనుగొన్న వాడే సత్యముగా బ్రహ్మమును పొందినవాడనియు లేకున్నచో శాశ్వతముగ నష్టపోవునని చెప్పుచున్నది.

విశ్వరూప ప్రదర్శనము మహాతేజో దర్శనము. ఇది ద్రవ్యయజ్ఞము అయిన ఒక మహిమ. దీని కన్న జ్ఞాన యజ్ఞము గొప్పది. "శ్రేయా ద్రవ్యమయాత్‌" అని గీత. వసుదేవ పుత్రుని బ్రహ్మముగా తెలియుటయే బ్రహ్మ ప్రాప్తిని పొందును. "జ్ఞానావాన్మాం ప్రపద్యతే" అని గీత కదా. ద్వాదశాక్షరిలో కూడ "వాసుదేవ" శబ్దమే ఉన్నది. కృష్ణాది శబ్ధములు విశ్వరూపమునకు కూడ అన్వయించును. విశ్వరూపము ఆకర్షించునని చెప్పవచ్చును గదా. కానీ, వసుదేవ పుత్రుడను శబ్దము విశ్వరూపమునకు సమన్వయించదు. విశ్వరూపము వసుదేవునికి పుట్టినది కాదు కదా. "పరం భావమజానన్తః" అని గీత. ఈ వాసుదేవుడే జననమరణాది అనిత్య ధర్మములను కలిగి, పరమితుడై , అదే సమయమున అనాద్యమృతనిత్యుడై అనంతుడగుట చేత ఈ విచిత్ర తత్త్వమగు మాయను అర్ధము చేసుకొనలేని మూఢజనులు వాసుదేవుని నిర్లక్ష్యముగ చూచి పరాభవింతురు. దీనికి కారణము అసూయయే. ఈ అసూయ ఒకసారి సున్నా వచ్చి, మరి యొకసారి వందగా హెచ్చును. కావున అసూయ నిత్యనాశనము పొందినపుడే చిత్తశుద్ధి పూర్తియగును. అప్పుడే అసలు సిసలైన బ్రహ్మ స్వరూపము బోధకెక్కును. కావున చిత్తశుద్ధి లేనిదే జ్ఞానాధికారము లేదని శంకరులు అన్నారు. ఇట్టి వాసుదేవుని నరునిగా ఇంద్రాది దేవతలు, ఉదంకుడు మొదలగు ఋషులు సైతము తెలియక భ్రమలో పడినారు. కావున దేవతలు సైతము బ్రహ్మమును తెలియజాలరని యముడు నచికేతనునికి బోధించెను. నరుడు అనగా "నరీయతే" అను అర్ధము ప్రకారము నిత్యుడు అని అర్ధము. నారాయణడు నిత్యుడు కావున నారాయణుని నరుడు అనవచ్చును. కావున నరనారాయణ తత్త్వమును ఒకే పరబ్రహ్మము యొక్క లక్షణము. నారాయణుడనగా జ్ఞాన స్వరూపుడని అర్ధము. నరనారాయణుడనగా నిత్యమైన జ్ఞానస్వరూపుడని అర్ధము. నిత్యమనగా అంతములేనిది. అనగా అనంతము. నిత్యమే సత్యము కావున సత్యమైన అనంతమైన జ్ఞాన స్వరూపమే బ్రహ్మము. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అని శ్రుతి. ఈ విధముగా నరనారాయణ తత్త్వములు అవినాభావములు. అనగా వేరు చేయలేనివి. సూర్యుని యొక్క కాంతి, వేడి, అను రెండు లక్షణములను ఒక దాని నుండి యొకటి వేరు చేయుటగాని, సూర్యుని నుండి విడదీయుట గాని చేయలేము. ఇవి ఒక్క రూపాయి యొక్క రెండు తలముల వంటివి. నారాయణుడు ఎప్పుడును నరస్వరూపుడే ఇది కృష్ణుని గురించిన తత్త్వము. ఇక కృష్ణుని ప్రక్కనే ఉన్న అర్జునుడు కేవలము నరుడు. అనగా జీవుడు. జీవుడును తాను ధరించిన స్ధూల శరీరముతో పోల్చినచో నిత్యుడే. అంతే కాని నారాయణుని వలె నిత్యుడు కాడు. జీవుడు సృష్టికి పూర్వము లేడు. జీవుడు పరాప్రకృతి యనబడు సృష్టిలోని భాగము. కావున కేవలము స్ధూల శరీరము దృష్ట్యా మాత్రమే నిత్యుడు. "అజో నిత్యః హన్యమానే శరీరే" అని గీత చెప్పుచున్నది. అనగా స్ధూల శరీరము నశించినను జీవుడు నశించడు కావున జీవుడు నిత్యుడు అని చెప్పుచున్నది. కావున నారాయణుడు నరుడే కాని, నరుడు నారాయణుడు కాడు.

వజ్రము ఘన పదార్ధము. కాన ఘన పదార్ధములన్నియు వజ్రములు కావు. ఘన పదార్ధములలో శ్రేష్టమైనది వజ్రము. ప్రతి వర్గములోను నేనే శ్రేష్టుడను అని విభూతి యోగములో గీతలో స్వామి చెప్పినాడు. మనకు కనపడు ఈ సర్వ సృష్టి వస్తువుల యందు చైతన్యము కల ప్రాణి జడముల కన్నను శ్రేష్టమైయున్నది. ఆ ప్రాణులలో నరుడు మరింత శ్రేష్టుడు కావున స్వామి నరుడై యున్నాడు. ఐతే అందరు నరులు స్వామియని అర్ధము కాదు. ఉదాహరణకు "వైనతేయశ్చ పక్షిణం" అన్నారు స్వామి. అనగా పక్షులలో గరుత్మంతుడను అని అర్ధము. గరుత్మంతుడు పక్షియే కాని ప్రతి పక్షి గరుత్మంతుడు కాదు. ప్రతి పక్షి గరుత్మంతుడైనచో సర్వ పక్షులును నేనే అని చెప్పియుండెడివాడు. నారాయణుడు పురుషుడు. కాని ప్రతి పురుషుడు నారాయణుడు కాడు. "పురి, దేహే, శేత ఇతి పురషః" అనగా శరీరమును ధరించిన వాడు పురుషుడు అని అర్ధము. కావున నారాయణుడును శరీరధారియే కాని శరీరధారులందరు నారాయణులు కాదు. పురషులలో ఉత్తముడు నారాయణుడు కావున పురుషోత్తముడనబడుచున్నాడు. గీతలో "ప్రకృతిం పురుషం చైవ" అని శ్లోకములో సృష్టి ప్రకృతి పురుషుడు. సృష్టికర్త యగు పరమాత్మ అని చెప్పబడినది. ఇంత మాత్రమున ప్రతి పురుషుడు అనగా ప్రతి జీవుడు పరమాత్మ యని భావించురను సంశయమును నివారించుటకు "ఉత్తమ పురుషన్తన్యః పరమాత్రే త్యుదాహృతః అతోస్మి లోకే వేదేచ ప్రధితః పురుషోత్తమః" అని చెప్పబడినది. అనగా పురషులలో ఉత్తముడగు పరమాత్మ మామూలు పురుషుని కన్నను వేరు. కావున పురుషోత్తముడు అను దీని భావము. పురుషోత్తమ శబ్ధములో పురుష శబ్ధము ఆయన యొక్క బాహ్యమైన నరస్వరూపమును సూచించుచున్నది. ఉత్తమ శబ్ధము పరమాత్మయైన అంతఃస్వరూపమును సూచించుచున్నది. ఈ రెండునూ విడదీయలేని తత్త్వములు. విద్యుత్‌ తీగెలో ప్రవహించు సమయమున తీగె నుండి విద్యుత్‌ను వేరు చేయలేము. ఈ ప్రకరణమున శంకర, రామానుజ భాష్యములు ఇట్లున్నవి. శంకర భాష్యము ఇట్లు చెప్పుచున్నది. ప్రకృతి - పురుషుడు అను రెండు తత్త్వములున్నవి. ప్రకృతియే సృష్టి. పురుషుడే సృష్టికర్త యగు పరమాత్మ. ఈ పురషుడే ఉత్తముడు కావున పరమాత్మ యనబడుచున్నాడు. ఈ శంకర భాష్యమును శిష్యులు అపార్ధము చేసుకున్నారు. ప్రకృతి యనగా సృష్టి. పురుషుడు అనగా జీవుడు. ప్రతి జీవుడు పరమాత్మయే అని అర్ధమును తీసినారు. కాని శంకరుల హృదయము అది కాదు. అయన జీవులను పరాప్రకృతిగా, ప్రకృతిలోకే అనగా సృష్టిలోకే త్రోసివేసినారు. ఇక్కడ ఆయన చెప్పు పురుష శబ్ధము పురుషునిగా అనగా జీవునిగా కనిపించు పరమాత్మయే. జీవ శబ్దము కూడా పురుష శబ్దము వలె పరమాత్మకు అన్వయించ వచ్చును. అప్పుడు జీవ రూపమున కనిపించు పురుషోత్తముడే జీవుడని చెప్పవచ్చును. అపుడు "జీవో బ్రహ్మైవ" అనుట సత్యమే. ఈ అపార్ధమును నివృత్తి చేయుటకే శంకరులు మరల రామానుజుడుగా అవతరించి పురుషోత్తమ తత్త్వమును వివరించినాడు. పురష శబ్దము చేత ప్రతి పురుషుడు పరమాత్మ అనుకుందురేమో అను సంశయమును నివారించుటకు స్వయముగా గీతయే పురుషుల కన్న భిన్నుడు పురుషోత్తముడు అని "ఉత్తమ పురుషస్యన్యః" అని చెప్పుచున్నది. కనుక బాహ్య రూపమే పురుషుడు అంతస్వరూపమే పురుషోత్తముడు. బాహ్య రూపమే పక్షి. అంతస్వరూపమే గరుత్మంతుడు. అన్ని గద్దల వలే గరుత్మంతుడును ఒక గద్దయే. కాని ఆ గద్దలలో ఒక గద్ద మాత్రమే గరుత్మంతుడు. ఇదే పురషోత్తమ తత్త్వము.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad