Monday, May 17, 2010

జ్ఞానము, ప్రేమ, ఆనందము

జ్ఞానము బ్రహ్మ, ప్రేమ విష్ణువు, ఆనందము శివుడు. ఇదే త్రిమూర్తి తత్త్వమైన వైదిక కళ్యాణ గుణ సంపద. ఈ మూడు గుణముల చేత త్రిమూర్తి స్వరూపుడైన గురుదత్తుని సులభముగా గుర్తించవచ్చును. కాని పామరులు, అష్టనిద్ధులగు మహిమల ప్రదర్శనము ద్వారా గురువుగా, దైవముగా గుర్తించుచున్నారు. ఈ పామర జనులు శిశువుల వంటి వారు. ఎవడు కిరీటము ధరించి రాజు వేషములో వచ్చునో, వాడినే రాజుగా తలచు అజ్ఞానులు. ఈ సిద్ధులు కొన్ని యంత్ర, తంత్ర, మంత్రముల ద్వారా ఎవరైనను సాధించుకొన వచ్చును. అనగా ఎవడైనను రాజు వేషమును వేయవచ్చును. కావున ఇట్టి పామరులు అట్టి క్షుద్ర మాంత్రికులు, రాక్షసులు శిష్యులుగా మారి, గుడ్డి వానిని గుడ్డి వారు పట్టుకొని వానితో సహా నిత్య నరకమను కూపములో పడుచున్నారు. వాడు కొన్ని సిద్ధులను సంపాదించినవాడే కాని జ్ఞానాంధుడు. ఇట్టి గురువులే "బాధిత గురువులు" ఈ బాధిత గురువులు అంతరార్ధమును వివరించి జ్ఞాన మార్గములో నడిపించ లేనివారు. వీరు కేవలము బాహ్యదృష్టితో భౌతికార్ధముతో ద్రవ్య తత్త్వమైన అజ్ఞానాంధకార మార్గములో శిష్యులను నడిపింతురు. వీరు యజ్ఞములను చేయించుటకు, చందాలు వసూలు చేసి ఆ ధనములో 90 శాతము వారు సంగ్రహించి, మిగిలిన 10 శాతమును నేయిగా మార్చి అగ్నిలో దగ్ధము చేయుదురు. ఈ యజ్ఞము వలన నేటి విజ్ఞాన శాస్త్రము ప్రకారముగా వాతావరణ కాలుష్యము పెరిగి అతివృష్టికి, అనావృష్టికి దారి చేయుచున్నది. ఈ గురువులు యజ్ఞములోని అంతరార్ధమును వివరించలేరు. ఈ శిష్యులు కూడ వారి వారి లౌకిక కార్యములు నెరవేరుటకు చందాలనిచ్చుచున్నారే గాని విశ్వ కళ్యాణమునకు కాదు. ఆ చందాలను వాడు కాజేసి పారిపోవగా ఈ శిష్యులు వానిని పోలీసులకు పట్టించుచున్నారు. వాడు చేసినది అధర్మమే. కానీ వీరు చేసినది అధర్మము కాదా! నాకు కాంట్రాక్టు రావలయునని, పదివేల రూపాయలు చందాగా యిచ్చుచున్నాడు. ఆ వచ్చిన కాంట్రాక్టులో పది లక్షల ప్రజాధనమును అపహరించుచున్నాడు. వీడు కూడ ప్రజల నుండి చందాలు వసూలు చేసి ధనమును దొంగిలించిన వాడు కాదా! వీరి దొంగతనము నిర్విఘ్నముగా నెరవేరుటకు దైవమునకు పదివేల రూపాయలు లంచము నిచ్చినాడు. వానిని పోలీసుల కన్న కఠినులగు యమభటులు పట్టుకొందురు. నారాయణుని పాలనలో ఎవరును దేనిని తప్పించుకొనజాలరు. మనుష్యజన్మ కడు దుర్లభము. మనుష్య జన్మ వచ్చినను భగవంతుని చేరయలయునని శ్రద్ధ ఉండుట ఇంకనూ దుర్లభము. ఈ రెండు ఉన్ననూ, మూడవది మరీ మరీ దుర్లభము. అది ఏమనగా నారాయణుడే నర రూపములో వచ్చి గురువుగా లభించుట. ఆట్టి పురుషునే అవతార పురుషుడు, మహా పురుషుడు లేక పురుషోత్తముడు అందురు.

"మనుష్యత్వం ముముక్షత్వం, మహాపురుష సంశయః" అనగా మనుష్య జన్మ దుర్లభము. మోక్షాసక్తి మరీ దుర్లభము. మహా పురుషుడు లభించుట మరీ మరీ దుర్లభము అని అర్ధము. ఇట్టి బాధక గురువులు జ్ఞాన తత్వము లేని వారైనందున జ్ఞాన యజ్ఞమును చేయలేక కేవలము ద్రవ్య యజ్ఞములతో గురువులుగా కీర్తి పొందుటకు ప్రయత్నించెదరు. వీరికి అంతర్ముఖ దృష్టి లేక కేవలము బాహ్యదృష్టితో ఆడంబరముగా యజ్ఞములు చేయుట, గుడులు ఆశ్రమములు కట్టించుట విచక్షణారహితముగా అన్నదానము చేయుట మొదలగునవి చేయుచుందురు. ఏ విధమైన పనియు చేసి సంపాదించుకొనుటకు చేతగాని, పసి బాలుడు, వృద్ధుడు, వికలాంగుడు మరియు రోగగ్రస్తుడు ఈ నలుగురు మాత్రమే అన్నదానమునకు అర్హులు. కాని ఈనాడు జరుగు అన్నదానములను చూచినచో, కోటీశ్వరులు కూడా వచ్చి, ప్రసాదము తినిన గాని వారి పనులు నెరవేరవని తలచి నాలుగు మెతుకులు నంజుకొని మిగిలినది పారవేయగా ఆ విస్తళ్ళను మురికి కుండిలలో పడవేయగా ఆ ఆహారము వలన రోగకారకములైన అనేక క్రిములు వర్ధిల్లుచున్నవి. చివరకు అన్నదానము రోగములను కలుగ చేసి ప్రాణులను హింసించు సూక్ష్మ క్రిములగు రాక్షసులకు చేరును. ఈ విధముగా ఈ అంధ గురువులు చేయు స్వకీర్తి కామముతో కూడిన ఆడంబరములతో కూడిన బాహ్య భౌతిక దైవ కార్యములతో గురువులకు గాని, శిష్యులకు కాని విశ్లేషణ విచక్షణ లేవు. దీనికి కారణము బ్రహ్మతత్త్వ గుణమగు జ్ఞానము లేకపోవుటయే. ఈ అజ్ఞానము చేత చేయు పనులన్నియు మహా పాపమునకు దారి తీయుచున్నవి. కాన వీరందరును, శాశ్వత నరకమున పడుదురు. "సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజ్నం సంతరిష్యసి" అని గీత. అనగా ఈ మహా పాపమను సాగరమును దాట దలచినచో, జ్ఞానము అను పడవను ఆశ్రయించుము.

గోటిచుట్టుపై రోకటి పోటు అన్నట్లు కొందరు పరమ మూర్ఖులు ఒకసారి గురువును ఎన్నుకున్నచో మరల మార్చరాదని వాదించుచున్నారు. దుష్టుడైనచో, భర్తనైనను విడాకులిమ్మని చట్టము ఘోషించుచున్నది. అట్లే దుష్టురాలైన భార్యను త్యజించమని మను స్మృతి చెప్పుచున్నది. "సజ్జస్వ ప్రియ వాదిని" అని మనుస్మృతి. అనగా ప్రేమతో నుండక ద్వేషముతో హింసించుచున్నచో అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తనైనను భార్య, బార్యనైనను భర్త త్యజించమని ధర్మ శాస్త్రములు చెప్పుచుండగా నిత్య నరక శాశ్వత హింసకు దారితీయు గురువును ఏల త్యజించరాదు? స్కూలులో ఒక విద్యార్ధి చేరినపుడు ఆ స్కూలు టీచరును గురువుగా భావించినాడు. ఆ తరువాత ఆ విద్యార్ధి కాలేజిలో చేరినపుడు కాలేజి లెక్చరరును గురువుగా భావించుచున్నాడు. ఆ తర్వాత యూనివర్సిటిలో చేరినపుడు అచ్చటి ప్రొఫెసరును గురువుగా భావించుచున్నాడు. గురువును త్యజించరాదని నేను గురువుగా స్వీకరించిన స్కూలు టీచరును వదిలి పెట్టనని, కాలేజి లెక్చరరు అగు మరియొక గురువును స్వీకరించనని కాలేజీలో చేరని వాడు ఎంత మూర్ఖుడో తన సాధన యొక్క దశ వృద్ధి అగుచున్న కొలది గురువులకు గురువైన గురుదత్తుని గురువుగా స్వీకరించక మొదట ఓనమాలు దిద్ది పెట్టిన గురువునే పట్టుకొని వేళ్ళాడు మూర్ఖులను గురించి ఏమందుము? గురు శబ్ధము కేవలము పరబ్రహ్మము నందే వర్తించును. ఏలయనగా జ్ఞానము చేత అజ్ఞానాంధకారమును పోగొట్టు వాడే గురువు శబ్ధమునకు అర్ధము. జ్ఞానము స్వరూపముగా కలవాడు "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అని శ్రుతి చెప్పుచున్నది. కావున గురు శబ్ధము పరబ్రహ్మమునకే వర్తించును. సృష్టి, స్ధితి, లయ కారకుడగు దత్తాత్రేయుడే పరబ్రహ్మము కావున దత్తుడు ఒక్కడే గురుశబ్ధముతో పిలువబడవలసిన వాడు. గురువే బ్రహ్మము, బ్రహ్మమే గురువు. ఈ రెండు వాక్యములకు తేడా కలదు. కఠినముగ ఉన్నది వజ్రము. వజ్రము కఠినముగా ఉన్నది అని రెండు వాక్యములలో ఉన్న బేధము గ్రహించిన చాలును! మొదటి వాక్యము ప్రకారము కఠినముగా ఉన్న రాయి కూడా వజ్రము కావలసి వచ్చును. రెండవ వాక్యము ప్రకారము వజ్రము కూడ కఠినముగా ఉండును. అనగా ప్రతి గురువు దత్తుడు కాడు. కాని దత్తుడు మాత్రము గురువే. అనగా నర రూపములో ఉన్న కృష్ణుడు నారాయణుడే. కాని నర రూపములో ఉన్న ప్రతి గోపాలుడు మాధవుడు కాదు. కావున గురువును ఎన్నుకొనునప్పుడే ఎంతో వివేకముతో ఎన్నుకొనవలెను. అనగా నారాయణ లక్షణములను తెలిసి నరరూపములో నారాయణుని గురువుగా ఎన్నుకొనవలెను. అంతే కాని కంటికి కనిపించిన ప్రతి శుంఠను కూడా గురువు, స్వామీ అని పిలచుట పరిపాటి అయినది. ఈనాడు రిక్షావాడు కూడా గురువు గారు బండి ఎక్కుతారా? అని అడుగుచున్నాడు. అట్లే నల్ల వస్త్రములను ధరించి నలుబది రోజులు కూడా సిగిరెట్లు, సారాయి వదల లేని వానిని అయ్యప్పగా, స్వామిగా పిలుచుచున్నారు. కావున నరరూపమున ఉన్న గురుదత్తుని మాత్రమే గురువుగా ఎన్నుకొనవలెను. నీవు ఆయనను వెతుక నక్కరలేదు. ఆయన పై విశ్వాసముతో ఆరాధించు చుండుము. ఆయన ఒకే సమయమున ఎన్నో రూపముల నెత్తగలడు. ఆయనయే స్వయముగా మీ ఇంటికి వచ్చును. ఆయనను గుర్తించి గురువుగా స్వీకరించిన తరువాత వదలిపెట్టకుము అనియే ఆ మాటకు అర్ధము. ఏలననగా ఆయన బహుమాయా ప్రదర్శకుడు. ఆయన మాయలో పడి విడిచివేయుదువేమో అని ఆ వాక్యము నిన్ను హెచ్చరించుచున్నది. గురువును వదలకుము అన్న వాక్యమును విచారించుము. గురుసాక్షాత్‌ పరబ్రహ్మ. గురువు అనగా శ్రీ దత్తుడే. కావున ఈ వాక్యమునకు, చివరకు ఏమి అర్ధము సిద్ధించినది? "శ్రీ దత్తుని వదలకుము" అని అర్ధము సిద్ధించినది. ఈ మాట చెప్పుటకు కారణమేమనగా, ఆయన మాయను చూపి జారిపోవును. కావున ఈ విధముగా శబ్ధములను, వాక్యములను, క్షుణ్ణముగా చర్చించి సత్యమును తెలుసుకొనుటయే "సదసత్వివేకము" అనబడును.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, May 10, 2010

శ్రీ దత్తాత్రేయుడే సద్గురువు

శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
ఈ శ్లోకము త్రిమూర్త్యాత్మకుడగు శ్రీ దత్తాత్రేయుడే గురువుని స్పష్టముగా చెప్పుచున్నది. "గు" కారము అనగా అంధకారము "రు" కారము అనగా ఆ అంధకారమును పారద్రోలు ప్రకాశము అనగా అజ్ఞానమను అంధకారమును జ్ఞానము అను ప్రకాశము చేత పోగొట్టు వాడని అర్ధము. శ్రుతి కూడ "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అనగా అనంతమైన సత్యమైన జ్ఞానమే బ్రహ్మమనియు, "ప్రజ్ఞానం బ్రహ్మ" అనగా ప్రశస్తమైన ఉత్తమమైన జ్ఞానమే బ్రహ్మము అని చెప్పుచున్నది. జ్ఞానము అను శబ్ధము చైతన్యము అను అర్ధములో పండితులు తీసుకొనుచున్నారు కాని ఈ అర్ధము సరికాదని మా అభిప్రాయము. ఏలననగా లోకములో ఎవరును చైతన్యమును జ్ఞానము అని పిలుచుట లేదు. చైతన్యము కలిగిన ఒక ప్రాణిని "జ్ఞాని" అని పిలుచుట లేదు. జ్ఞానము అను శబ్ధము ఒక విషయము అను అర్ధములోనే ఉపయోగపడుచున్నది. చైతన్యము కలిగి జ్ఞానము లేనివానిని అజ్ఞాని అని పిలుచుచున్నాము. కావున చైతన్యము వేరు, జ్ఞానము వేరు. జ్ఞానము చైతన్యము కల ప్రాణి వద్దనే ఉండును. ఆచేతనము వద్ద ఉండదు. జ్ఞానము ఉన్న ప్రతిచోట చైతన్యము ఉండవలెను. కాని చైతన్యము ఉన్న ప్రతిచోట జ్ఞానము ఉండనక్కరలేదు. సూర్యుడు ఉన్నచోట కాంతి ఉండును. కాని కాంతియున్నచో సూర్యుడు ఉండవలయునని నియమములేదు. రాత్రిపూట దీపకాంతి యున్ననూ, సూర్యుడు లేడు కదా. కావున జ్ఞానము అనగా, తర్క జ్ఞానము, వేదాంత జ్ఞానము, వ్యాకరణ జ్ఞానము మొదలగు శాస్త్రములలో ఉన్న విషయమే. లోకమును గురించిన జ్ఞానమే లోక జ్ఞానము. బ్రహ్మమును గురించిన జ్ఞానము బ్రహ్మజ్ఞానము. అన్ని జ్ఞానములలోను బ్రహ్మజ్ఞానమే గొప్పది. ఏలననగా బ్రహ్మము తెలిసినచో, సర్వము తెలిసినట్లేయని "సర్వం విజ్ఞాతం భవతి" అని శ్రుతి చెప్పుచున్నది. కావున సర్వజ్ఞానములలో బ్రహ్మ జ్ఞానము అనగా వేదాంత జ్ఞానమే గొప్పది. కావుననే దానిని "ప్రజ్ఞానం" అని అన్నారు. ప్రజ్ఞానము అనగా ప్రశస్తమైన జ్ఞానము అదియే అనంతమైన సత్యమైన జ్ఞానము. ఇచ్చట ప్రజ్ఞానం అనగా ప్రజ్ఞాని అని తీసుకొనవలయును. వ్యాకరణ శాస్త్రము ప్రకారముగా, ఎక్కువగా ప్రజ్ఞానము కలవాడు అనగా ప్రజ్ఞాని, ప్రజ్ఞానము అను శబ్ధము చేతనే పిలవబడును. కావున జ్ఞాని అనగా జ్ఞానము కలవాడు జ్ఞానము అనియే పిలువబడవచ్చును. కావున ఈ శ్రుతుల అర్ధము బ్రహ్మము అనగా సత్యమైన, అనంతమైన, శ్రేష్టమైన జ్ఞానము కలవాడే అని వచ్చును. కావున అతి శ్రేష్టమైన వేదాంత తత్త్వము యొక్క జ్ఞానము కల గురుస్వరూపమే పరబ్రహ్మ అని వేదార్ధము. ఇట్టి పరమ పవిత్రమైన బ్రహ్మ జ్ఞానమైన వేదాంతమును గీత ద్వారా చెప్పియుండుట చేత కృష్ణుడు జగద్గురువైనాడు. "కృష్ణం వందే జగద్గురుం" అని చెప్పబడినది. గీతలలో వివరించిన ముగ్గురు ఆచార్యులును జగద్గురువులే. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. కావున ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రములు రెండును భగవద్గీత యందే లీనమైయున్నవి. ఈ బ్రహ్మ సూత్రములను వ్రాసిన వ్యాసుడు కూడా జగద్గురువే. ఆయన యొక్క జన్మతిధి యగు ఆషాఢ పూర్ణిమనే "గురుపూర్ణిమ" అనుచున్నాము. ఐతే వ్యాసుడు ఉపనిషత్తుల యొక్క సమస్వయమును చూపినాడు. కాని కృష్ణుడు ఉపనిషత్తుల సారమును పిండినాడు. వ్యాసుడు విష్ణువు యొక్క అంశ. కృష్ణుడు బ్రహ్మవిష్ణుశివాత్మకమైన దత్తావతారము. కావున వ్యాసుడు గురువైనచో కృష్ణుడు జగద్గురువైనాడు. కృష్ణుడే దత్తుడు. దత్తుడే కృష్ణుడు. కావున కృష్ణుడు దశావతారములలో పేర్కొనబడలేదు. దశావతారములలో ఏకమూర్తియైన విష్ణువు యొక్క స్వరూపములు. కృష్ణుడు త్రిమూర్తి స్వరూపుడై మూల విరాట్పురుషుడగు దత్తుడే. దత్తుడు గురువులకే గురువు. అందుకే ఆయనను "గురోర్గురుత్తరాయ నమః" అని చెప్పుచున్నారు. దత్తుని యొక్క పరిపూర్ణ తమావతారమే కృష్ణుడని భాగవతము చెప్పుచున్నది. అట్టి కృష్ణుడు పార్ధునకు బంధువుగా, చెలికానిగా, రధసారధిగా చిక్కి చివరకకు గీతను బోధించి గురువుగా లభించినాడు. అర్జునుడు కృష్ణుని పాదములపై "శిష్యస్తేహం శాధిమాం త్వం ప్రసన్నమ్‌" అనగా ఓ కృష్ణా! నీకు నేను శిష్యుడను. నీకు ప్రపత్తిని చేసి శరణాగతుడనై పాదములపై బడి ప్రశ్నించు చున్నాను అని చెప్పినాడు. పార్ధుడు తనను శిష్యునిగా చెప్పుకొని పరిపూర్ణ శరణాగతుడై అడిగినపుడు స్వామి గురు స్వరూపముతో గీతను బోధించినాడు. దీని అర్ధమేమి? శ్రద్ధతో, ప్రపత్తితో జ్ఞానదాహము గలవారికి జ్ఞానామృతము నీయవలయును. కావుననే కృష్ణుడు మరి ఎవ్వరికిని గీత చెప్పలేదు. అంతే కాదు అదే అర్జునుడు యుద్ధము ముగిసిన తర్వాత చక్కని విందు ఆరగించి, తాను తాంబూలము వేసుకొని, కాలక్షేపము కొరకు, కృష్ణుని మరల గీతను చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునా! ఆనాటి స్ధితి వేరు. ఈనాటి స్ధితి వేరు. మరల ఇప్పుడు గీతను చెప్పలేను అన్నాడు. దీని అర్ధమేమి? ఆనాటి కృష్ణుడు, ఈనాటి కృష్ణుడు ఒక్కడే. కాని ఆనాడు జ్ఞాన దాహముతో తపనతో జ్ఞానమును అర్ధించిన అర్జునుడు వేరు. ఈనాడు కాలక్షేపము కొరకు జ్ఞానమును అర్ధించు అర్జునుడు వేరు. కావున శ్రద్ధ లేనిదే జ్ఞానమును బోధింరాదు. కాని ఈనాడు జ్ఞాన శ్రవణము చేయు జీవుల శ్రద్ధ పరమ హాస్యాస్పదముగ ఉన్నది.

గుడిలో పండితుడు చక్కగా భాష్యమును వివరించుచు బ్రహ్మజ్ఞానమును బోధించుచుండగా, పట్టుమని పది మంది కూడ అచ్చట ఉండరు. ఉన్న నలుగురిలో కూడ ఒకరు ఒత్తులను చేసుకొనుచుందురు. మరియొకరు కునికిపాట్లు పడుచుందురు. మిగిలిన ఇరువురు అమ్మాయి పురిటికి వచ్చినదా అని కబుర్లు చెప్పుకొందురు. ఈ బ్రహ్మజ్ఞాన శ్రవణము కూడ ఇంటి పనులన్నియు ముగిసి భోజనము చేసి నిద్రపోయి లేచి, తీరికగా యుండు సాయంకాల సమయము. ఆ సమయమునకు కూడ మరియొక నియమము ఉన్నది. ఆ రోజు సాయంకాలము, టి.విలో ఏ సినిమా వేసి ఉండకూడదు. ఆ రోజు ఆ సమయమున సినిమా ఉన్నచో శ్రోతలు రాకపోవుటయే కాదు ఆ శాస్త్రిగారు కూడ వచ్చుటలేదు. ఈ శ్రద్ధలకు బ్రహ్మ సాక్షాత్కారము కావలయును. ఈ లోకము వదిలిన మరుక్షణమే శాశ్వత బ్రహ్మలోక నివాసము కావలయును. చేతిలో ఉన్నది ఒక్క పైసా పదునాలుగు అంతస్తుల భవనము కొనుటకు బేరము చేయుచున్నాడు. యాజ్ఞవల్క్యుడు తత్త్వమును బోధించుచుండగా జనకుడు వినుచున్నాడు. ఆయన రాజ్యమగు మిధిలానగరము మంటలలో కాలిపోవుచున్నదని భటులు పరుగెత్తుకొని వచ్చి చెప్పినారు. దానికి జనకుడు మిధిల పోయినచో పోనిండు. ఈ శరీరమే ఒకనాటికి అగ్నిలో భస్మమగు. ఈ సృష్టిలో నిశ్చలముగా నిలుచు పర్వతములు కూడా, చివరకు ప్రళయాగ్నిలో భస్మముకావలసినది. ఇంత చక్కటి జ్ఞానామృతము ఎచ్చట లభించును అని అచ్చట నుండి లేవలేదు. కొంతసేపటికి సత్సంగము ముగిసిది. మరల భటులు పరుగెత్తుకొని వచ్చినారు. అయ్యా! బూడిద నుండి మిధిలా నగరము సర్వ జనులతో పాటు యధాప్రకారముగా లేచి సృష్టించబడుటయే కాదు. అగ్నిలో కాలిన బంగారము వలే ద్విగుణీకృతమైన శోభతో వెలుగుచున్నదని చెప్పినారు. ఈ పరమ మూఢాతి మూఢులైన జీవులకు తెలియదు. పరబ్రహ్మమే ఇహపరములకు ఆధారము అని. ఈ సమస్త లోకమును సృష్టించిన వాడు పరమాత్మయే. ఈ సమస్త లోకములలో యున్న ప్రతి పరమాణువు ఆయన యొక్క సంకల్పవశమై యున్నది. ఈ జీవుడు తన మేధాశక్తిని అహోరాత్రులు ఉపయోగించి, కొన్ని సంవత్సరములు ప్రయత్నించిననూ, అణుమాత్రము పరిష్కారమునకురాని సమస్యలు ఆ పరమాత్మ సంకల్పము చేసిన క్షణకాలములో పరిష్కరించబడును. పరమాత్మ యందు మనస్సును లగ్నము చేయక లోక విషయములందు నిరంతరము మనస్సును లగ్నము చేసి సాధించునది క్షణకాల విజయములే. కాని పరమాత్మ యందు మనస్సును లగ్నము చేసినచో, ఇహపరములందు శాశ్వత విజయము కల్గును. వేరుకు నీరు పోసినచో చెట్టు మొత్తము పచ్చగా యుండి కళకళలాడుచుండును. వేరుకు నీరు పోయక, కొమ్మలను ఆకులను నీటితో తడిపిన ప్రయోజనము లేదు. ఒక్క క్షణకాలము చల్లగ నుండును. కాని చెట్టు మొత్తము ఎండిపోవుచున్నది. లోక విషయములందు మనస్సు కేంద్రీకరించు, లౌకికుడు కొమ్మలను ఆకులను తడుపు తెలివి తక్కువవాడు. వేరుకు నీరు పోయువాని వలె చూచుటకు చాదస్తునిగా కనిపించు ఎండిపోవుచున్న కొమ్మలను తడపక, వీడు నేల మీద నీటిని పోయుచున్నాడు అని వానిని మూఢులు విమర్శింతురు. భూమిలో ఆ చెట్టు వేరు దాగియున్నది. అతడు భూమిలో పోసిన నీరు వేరుకు చేరి వేరు ద్వారా చెట్టులోనికి ఎక్కుచున్నది. అసలు వేరు కనపడుట లేదు. కావున వానిని తెలివి తక్కువవానిగా భావించుచున్నారు. అట్లే ఇహపరములు అను కొమ్మలు ఆకులు గల ఈ సృష్టి వృక్షమునకు ప్రాణమూలమైన ఆధారమైన వేరు అగు బహ్మము మన కంటికి కనబడదు. ఆ బ్రహ్మము నరావతారము నెత్తిన గురుస్వరూపములో దాగియుండును. గోపికలు వ్యవసాయము, ఆవుల పనులను వదలివేసి నిరంతరము కృష్ణుని సంగములో యుండెడివారు. దాని వలన లౌకిక కార్యములు చెడకపోగా ఎంతో వృద్ధితో ఉండెడివి. గోవులకు ఏ రోగములు వచ్చెడివి కావు. చక్కగా రెండింతలు పాలు ఇచ్చెడివి. పంట పదదిరెట్లు పండెడిది. "ఏషాం సతయుక్తాన్నాం యోగక్షేమం వహామ్యహం" అని స్వామి గీతలో ప్రతిజ్ఞ చేశాడు. సతత యుక్తులు అనగా స్వామిని ఒక్క క్షణము కూడ వదలక ఉండెడి వారని అర్ధము. అట్టి వారి యొక్క యోగక్షేమములను స్వామియే చూతునని అర్ధము. యోగము అనగా పరలోకమున రక్షణము. క్షేమము అనగా ఇచ్చట లౌకిక సమస్యలు తీరుట. అయితే ఇది నారాయణుడే నర రూపములో వచ్చిన శ్రీ కృష్ణును విషయము. ఇట్టి నరావతారములే 'బోధక గురువులు' ఇట్టి నారాయణ అవతారమును నారాయణ తత్త్వముతోనే గుర్తించవలయును. నారాయణ శబ్ధమునకు అర్ధమేమి? "నారాం జ్ఞానం ఆయనం యస్యసః నారాయణః" అనగా జ్ఞానమునకు, ఆశ్రయమైన వాడు నారాయణ అని అర్ధము. కావున జ్ఞాన తత్త్వము చేతనే నారాయణుని గుర్తించవలెను. ఈ నారాయణుడు సకల కల్యాణ గుణ సంపన్నుడు. వేదములో చెప్పిన మొదటి కల్యాణ గుణము జ్ఞానము. అదే "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" ఇక వేదములో చెప్పిన రెండవ కల్యాణ గుణము "ప్రేమ". అదే "రసోవైసః" అని శ్రుతిలో చెప్పబడినది. ఇక వేదములో చెప్పబడిన మూడవ కల్యాణ గుణము "ఆనందము". అదే "ఆనందో బ్రహ్మేతి వ్యయానాత్‌" అని శ్రుతి చెప్పుచున్నది.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, May 4, 2010

జ్ఞానమే వేదము

గురు దత్త నామములో గురు శబ్దము జ్ఞానమునకు దత్త శబ్దము దానమునకు నిలచియున్నది. జ్ఞానమే వేదము. వేదమే విద్య. విద్య యొక్క ఫలమే వినయము. మరియు జ్ఞానము సత్వగుణము వలన పుట్టును. "సత్వాత్‌ సంజాయతే జ్ఞానం" ప్రకారముగా జ్ఞాన కారణమే సత్వగుణము. సత్యగుణము యొక్క తత్వము అహంకారరాహిత్యమే. అనగా వినయమే. కావున గురుదత్త శబ్ధము వినయముతో కూడిన దానమును సూచించుచున్నది. రజోగుణముతో కూడిన దానము అహంకారముతో కీర్తి ప్రతిష్టల కొరకు స్వార్ధముతో కూడి యుండును. కాని గురుదత్తుని తత్త్వము గుప్తదానమైయున్నది. అనగా దానము చేసి తన పేరును బయిటకు రానీయకుండుట. ఇదే సాత్విక వినయము. ఈ సృష్టిలో ఏ మంచి కర్మ జరిగినను, ఏ మహిమ జరిగినను దాని యొక్క కర్త గురుదత్తుడే. కాని ఆయన తన పేరును రానీయక వాటి కీర్తి ప్రతిష్టలను దేవతలకును భక్తులకును ఇచ్చుచున్నాడే తప్ప తన పేరును ప్రకటితము కావించుటలేదు. లక్ష్మణుడు మూర్ఛపోవగా రాముడు ఏద్చుచున్నాడు. హనుమంతుడు సంజీవి పర్వతమును తెచ్చి లక్ష్మణుని బ్రతికించినాడు. ఇచ్చట రాముని శక్తియే హనుమంతుని ద్వారా సంజీవిని పర్వతమును తెచ్చినది. ఆ కీర్తి తనకు రాకుండా ఆడిన నాటకమే లక్ష్మణ మూర్ఛ సమయమున రాముడు అసమర్ధునిగా విలపించుట జరిగినది. తనకన్న హనుమంతుడు గొప్పవాడని రామాంజనేయ యుద్ధమున నిరూపించి ఆ కీర్తి ప్రతిష్టలను హనుమంతునికి బలవంతముగా అంటకట్టి తాను గుప్తముగా యున్నాడు. అనగా స్వామి తన శక్తిని హనుమంతునకు గుప్తదానము చేసినాడు. ఇదే దత్త తత్త్వము. దత్త సేవకులును దత్త సేవ చేయునపుడు తాము స్వామికి సహకరించినా మన్న భావమును కలిగియుండక తమ పేరు ప్రతిష్టలు ఆశించక సేవ చేయవలెను. అట్టి గోరంత సేవకే దత్తుడు కొండంత ఫలము నిచ్చును. అట్లుకాక తమ పేరు ప్రతిష్టలను సేవను చేసినచో కొండంత సేవకు గోరంత ఫలమునే దత్తుడు ఇచ్చును. నిజముగా నీవు చేసిన సేవ ఒక సత్కర్మ. సత్కర్మను ఎప్పుడును దత్తుడే చేయును. కావున నీ ద్వారా దత్తుడు చేసిన ఈ సత్కర్మ యొక్క పేరు ప్రతిష్టలు దత్తునకే చెందవలెను. కావున నీ సేవను జనులు ప్రశంసించునపుడు "నేను నిమిత్తమాత్రుడను స్వామియే నా ద్వారా ఈ మహత్తర కార్యమును చేసినాడు. నేను తీగెను మాత్రమే. నేను ఫ్యానును తిప్పలేదు. నా ద్వారా ప్రవహించు కరెంటు మాత్రమే ఫ్యానును తిప్పినది అని చెప్పవలెను. ఇట్లు నీవు చెప్పుటలో అసత్యమేమియు లేదు. ఆ పనిని నీవే చేసి నీ యొక్క వినయము వలన దాని కీర్తిని స్వామికి ఇచ్చుచున్నానని భావించకుము. ఏలననగా అట్లు నీవు భావించినచో అది అసత్యమే కదా.

కావున నీవు వినయముతో పలుకుచున్నను అది సత్యమేనని గ్రహించుము. ఏలననగా కొందరు ఇట్లు పలుకుచు తమ వినయమునకు తామే మురిసిపోవుదురు. ఇది వినయము అన్న ముసుగులో దాగిన అహంకారము. కావున త్రికరణ శుద్ధిగా దత్తుడే చేసినాడని పలుకుము. ఇచ్చటనే వినయముతో మాట్లాడు వారు కూడ అహంకార సర్పము యొక్క నోట పడుచున్నారు. దీనినే సాత్విక అహంకారమందురు. అనగా నేను అహంకారము లేనివాడను అని అనుకొను అహంకారము. నిజముగా దత్తుడే చేసినపుడు దత్తుడే చేసినాడని చెప్పుటలో నీవు ఎందుకు పొంగి పోవుచున్నావు. నీ పొంగుకు కారణము నిజముగా నేను చేసిన పనిని నా వినయగుణము వలన దత్తునకే కీర్తిని అంటకట్టుచున్నాను అని భావించుట తెల్లని పాలగ్లాసులో యున్న చిన్న నల్లని నలుసు కణము వలె అహంకారము సంచరించుచున్నది. దీనినే ఆత్మాహంకారము లేక ఆత్మాభిమానము అందురు. ఇక రెండవది రాజసాహంకారము. ఇందులో దేహమే నేను అను అధ్యాస భావముతో ఈ దేహము యొక్క బలము శక్తి నేను అని భావించి నేను ఈ సత్కర్మను చేసినానని తన కీర్తి ప్రతిష్టలకు ప్రాకులాడుటయే రాజసాహంకారము. ఇక మూడవది తామసాహంకారము. ఇందు దేహము యొక్క శక్తియే కాక తన ధనము తన బంధువులు మొదలగు వారి శక్తి మొదలగు వాటి శక్తిని కలుపుకొని భావించుట. ఈ మూడు అహంకారములు లేని జీవుడే అత్రి. కావున రాజస తామస అహంకారములు లేకపోయినను శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ తానని భావించి ఆ ఆత్మ శక్తితో తాను చేసినానని తలచు సాత్వికాహంకారము కూడ దాటి తన ఆత్మ యొక్క ఈశ్వరుడగు పరమాత్మ యొక్క శక్తిచేతనే తాను చేసినానని తలచిన గాని అత్రి తత్త్వము సిద్ధించదు. కాని ఈనాడు అనేకులు తాము దత్తావతారములమని చెప్పుకొనుచు తమ తమ ఆశ్రమములగు రాజ్యములను నిర్మించుకొనుచు దత్తుడు తమ ద్వారా చేసిన సత్కర్మలను, మహిమలను తామే చేసినామని చెప్పుకొనుచు అనేక విధములుగా చిట్ట చివరి కీర్తికాంక్ష యను మహాకాల సర్పము యొక్క నోటిలోపడి పరమపదసోపాన పటమున జారి క్రిందకు పడుచున్నారు. వీరు 99 మార్కులు తెచ్చుకొని చిట్టచివరి ఒక్క మార్కులో పరీక్ష తప్పినవారు. భక్తులు వీరి చుట్టును చేరి నీవే పరబ్రహ్మవు అని గాలి పంపును కొట్టుచున్నారు. దానికి కారణము వారి స్వార్ధమే. ఒక మాహాత్ముడు తన శక్తిచేత ఒకరి రోగమును పోగొట్టినాడు. ఆ శక్తిని ఉపయోగించి తన రోగమును కూడ పోగొట్టుకొనవలెనని దాని కొరకు ఆ భక్తుడు ఆ మహాత్ముని ఆశ్రయించి నీవు పరమాత్మవు అని ప్రశంశించుచున్నాడు. మొదట మౌనముగా యుండి ఆ మహాత్ముడు అర్ధాంగీకారము తెలుపుచున్నాడు. ఆ తరువాత భక్తుల సంఖ్య పెరిగిన కొలది ఆ మహాత్ముడు నేనే దత్తావతారమని పదిమందిలో ప్రకటించుచున్నాడు. ఆ తరువాత మాయపొరలు దట్టము కాగా ఈ తరములో నేనొక్కడినే దత్తావతారమని ప్రకటించుచున్నాడు. కృష్ణుడు కూడా తాను పరమాత్మను చెప్పుకున్నాడు. కాని తాను పరమాత్మనని ఎప్పుడును అందరి ఎదుట మైకులో ప్రకటించలేదు. కేవలము అర్జునునకు మాత్రమే ఏకాంతముగా గీతాబోధ సమయమున అర్హుడైనందున ప్రకటించియున్నాడు. కావున అర్హత లేనివారికి, దత్తుడు ఎప్పుడును తాను దత్తుడనని ప్రకటించడు. అట్లు తనను తాను ప్రకటించినపుడు దానిని అర్ధము చేసుకొని అంగీకరించుటకు ఎన్నో జన్మల తపస్సు వలన కలిగిన చిత్తశుద్ధి కావలయును. అట్టివాడు కోటాను కోట్లలో ఒకడుండును.

"కచ్చిన్‌మాం వేత్తి తత్త్వతః" అని గీతలో చెప్పినాడు. ఎన్నో జన్మల తపస్సు వలన చిత్త శుద్ధుడై జ్ఞానియైన ఏ ఒక్కడో ఈ వాసుదేవుని కుమారుడే పరబ్రహ్మమని గ్రహించు వాడు మహాత్ముడనియు అట్టివాడు ఈ లోకములో దుర్లభుడనియు స్వామి గీతలో "బహునాం జన్మనామంతే జ్ఞానవాన్‌ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః" అని గీతలో చెప్పినారు స్వామి. కావున కోటాను కోట్ల జీవులలో ఏ ఒక్కనికో ఏకాంతమున ప్రకటించవలసిన ఆత్మ రహస్యమును ఈనాడు నకిలీ అవతార పురుషులు మైకులలో వేలాది భక్తుల ముందు ప్రకటించుచున్నారు. దీనిని బట్టియే వీరు దత్తావతారులు కాదనియు చాలా ఎత్తుకు పోయిన ఉన్నత సాధకులనియు చిట్ట చివరిలో కీర్తి కాంక్షయను ఒక్క మారులో దత్త పరీక్షలో తప్పిన జీవులనియు పరమాత్మ జ్ఞాన సంపన్నులగు జ్ఞానులు తెలియుదురు. పామరులు నూటికి ఒక్క మార్కు తెచ్చుకున్న వారినే దత్తుడనుచున్నారు. ఇక 99 మార్కులు తెచ్చుకొని ఒక్క మార్కులో తప్పిన వారిని దత్తునిగా ఏలభావించరు? కాని పరమాత్మ జ్ఞానమును నిశితముగా క్షుణ్ణముగా కలిగిన పండితులు ఈ స్వల్ప లోపమును కనిపెట్టగలరు. పరమాత్మను గురించిన పరిపూర్ణ జ్ఞానమే పండా అని చెప్పబడుచున్నది. పండాను కల్గిన వాడే పండితుడు. వజ్రము యొక్క లక్షణములను సంపూర్ణముగా తెలిసిన నిపుణుడు మాత్రమే నకిలి వజ్రముల నుండి అసలు వజ్రమును వేరు చేయగలడు. ఇది సామాన్య మానవులకు సాధ్యము కాదు. దత్తుడెప్పుడును గుప్తముగనే యుండును. తనను తాను ఎప్పుడును ప్రకటించుకొనడు. కారణము తన సత్యమైన తత్త్వమును ప్రకటించినచో గ్రహించ గలవాడు ఈ సృష్టిలోలేడు. ఏలననగా దేవతలు బ్రహ్మర్షులు సహితము సాత్వికాహాంకారమును దాటలేక ఉన్నారు. సాత్వికులగు దేవతలు అసురులను జయించినప్పుడు తమశక్తి చేతనే జయించినామని ఉత్సవములు చేసుకొనుచున్నారు. అందులో సురపతి యగు ఇంద్రుడు తమ యొక్క ప్రాధాన్యతను భావించుకొనుచున్నాడు. అప్పుడు వారి ఎదుట ఒక పెద్ద యక్షరూపము గోచరించినది. యక్ష రూపమనగా మహా తేజస్సు. అప్పుడు దేవతలు దాని వద్దకు పోయినారు. ఆ తేజస్సే కరెంటు. ఈ దేవతలే తీగెలు. దీనిని తెలియచెప్పుటకే దత్త పరబ్రహ్మము ఒక మహా తేజస్సు రూపములో సాక్ష్కాత్కరించినది. అగ్నిని "నీ శక్తి ఏమి" అని ఆ తేజస్సు ప్రశ్నించినది. "నేను అన్నింటిని కాలుస్తాను" అన్నాడు అగ్ని. అప్పుడు ఎండిపోయిన ఒక గడ్డిపోచను అగ్ని ముందు పడవేసి దీనిని కాల్చమన్న అగ్ని ఎంత ప్రయత్నించినను, దానిలోకి కనీసము వేడికూడ ఎక్కలేదు. ఇట్లు దేవతలందరును దత్త పరీక్షలో ఓడిపోయినారు. చివరిలో అహంకారము ఎక్కువ మోతాదులో ఉన్న ఇంద్రుడు వచ్చినాడు. ఆ ఇంద్రునితో మాటలాడుటకు కూడా తిరస్కరించి ఆ తేజస్సు అదృశ్యమైనది. అప్పుడు ఇంద్రుడు బాధపడుచుండగా ఆ దత్తుని సహధర్మచారిణి అగు ఉమ గోచరించి ఆ తేజస్సు పరబ్రహ్మ మని చెప్పినది. అప్పుడు ఇంద్రుడు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేయగా గుర్రమును నడుపు శక్తి ఆ పరబ్రహ్మమేనను జ్ఞానము తలకెక్కినది. సర్వకర్మలను చేయు శక్తి పరమాత్మయే. కాని దుష్కర్మలను జీవుల యొక్క సంకల్పముల వలన చేయుచుందురు. సత్కర్మలు మాత్రము స్వసంకల్పము చేత చేసి తన భక్తులకు ఆ కీర్తి నిచ్చుచుండును. కావున అహంకారములను మూడింటిని దాటి అత్రియైన ఒకానొక జీవునకు మాత్రమే దత్తుడు తనను తాను ప్రకటించుకొనును. ఏలననగా ఆ ఒకానొక జీవుడు ఒకానొక సమయమున మాత్రమే ఆ అత్రి తత్త్వమును నిలుపుకొనగలుగు చున్నాడు. అర్జునుడు గీతాబోధ సమయమున మాత్రమే ఆ పరమాత్మ తత్త్వమును గ్రహించినాడు. పద్దెనిమిదో రోజు సాయంకాలమునకే మరల అహంకారమునకు వశుడై జారిపోయినాడు. కావున దత్తుడెప్పుడును అధమాధమ రూపములలో కనపడుచూ తన ఆత్మ తత్త్వమును మాయతో కప్పుకొనియే క్రీడించు చుండును. ఆత్మ తత్త్వమును ప్రకటించుటకు ఇష్టము లేకకాదు. దానిని గ్రహించు యోగ్యత గలవాడు లేడు కావున.

At the lotus feet of Shri Datta Swami
-Durgaprasad