Thursday, July 1, 2010

బహునాం జన్మ నామంతే

బహునాం జన్మ నామంతే అనగా ఎన్నో జన్మల తపస్సాధన ఉన్నగానే నన్ను గుర్తించలేరు, అనియు "యతతామ్‌పి సిద్ధానాం కస్చిన్‌ మామ్ వేతి తత్త్వత" " అనగా అష్ట సిద్ధులు సంపాదిచినను, ఎట్టి అహంకారమును పొందక నా కొరకు సాధన సాధించు ఏ ఒక్కడో నన్ను గుర్తించును అని గీత చెప్పుచున్నది. అసలు బ్రహ్మమును గుర్తించు బ్రహ్మ విద్యలో అంత కష్టము ఏమున్నదని ఎవరికైనను సంశయము రావచ్చును. కొందరు బ్రహ్మము నిరాకారమైన, సర్వవ్యాపకమైన చైతన్యమను చున్నారు. చైతన్యము కాంతి వలె ఒక శక్తి స్వరూపము. పట్ట పగలు కాంతి ఎట్లు సమస్త లోకములను వ్యాపించి యున్నదో, అట్లే చైతన్యము అను శక్తి ఈ సమస్త విశ్వమును వ్యాపించి యున్నది. ఇది అర్ధము చేసుకొనుటలో పెద్ద కష్టమేమున్నది. ఎంత పామరుడైనను అయిదు నిమిషములు ఆలోచించినచో, ఇది అర్ధమగుచునే ఉన్నది. పదవ తరగతి ఫిజిక్సు చదివిన విద్యార్ధి ఈ విషయమును ఒకే నిమిషములో అర్ధము చేసుకొనగలడు. దీని కొరకు ఏన్నో జన్మలు ఎందుకు? మరి కొందరు పరబ్రహ్మము అనగా ఈ విశ్వమును కూడ అత్రికమించిన విరాట్పురుషుని ఆకారము అనియు, ఈ జగత్తు ఆయన ధరించిన ఒక వస్త్రము వంటిది అనియు, ఆయన ఈ విశ్వములో అంతర్యామిగా ఉన్నాడనియు చెప్పుచున్నారు. ఇది ఇంకను సులభము. పామరుడు మూడు నిమిషములలో అర్ధము చేసుకొనగలడు. మరికొందరు పైలోకములో వైకుంఠములో నారాయణునిగాను, కైలాసమున పరమశివునిగాను, సత్యలోకమున హిరణ్యగర్భుని గాను పరబ్రహ్మ ఉన్నాడని చెప్పుచున్నారు. ఇది మరింత సులభము. పామరుడు ఒక్క నిమిషములో అర్ధము చేసుకొనగలడు. కావున ఈ సిద్ధాంతముల ప్రకారము బ్రహ్మవిద్య కష్టము కాదని తేలుచున్నది. శ్రుతులు కూడ పరబ్రహ్మము తర్కమునకు, ఊహకు సైతము అందదు అనియు, దేవతలు కూడ అర్ధము చేసుకొనలేరనియు చెప్పుచున్నవి. కావున వీరు చెప్పు సిద్ధాంతములేవియు బ్రహ్మ విద్యకు అర్ధము కావని తేలుచున్నవి. కావున బ్రహ్మ విద్య అనగానేమి? అది అంత కష్టముగా ఎందుకు ఉన్నది? దీనికి సమాధనము భగవద్గీతయే చెప్పుచున్నది. "బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్‌ మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి పరమాత్మ సుదుర్లభాః" అను శ్లోకమే బ్రహ్మ విద్యను గురించి చెప్పుచున్నది. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ వాసుదేవుడు పరబ్రహ్మము అని గుర్తించి పరిపూర్ణముగా విశ్వసించిన మహాత్ముడు ఎక్కడునూ దొరకడు. అనగా దేవకి గర్భమున పుట్టి యశోద చేత పెంచబడి అందరి నరులలో ఒక నరుడుగా ప్రవర్తించుచున్న ఈ వాసుదేవుడే పరబ్రహ్మమని గుర్తించుట చాలా కష్టము అని అర్ధము. ఇచ్చట వాసుదేవ శబ్ధము ప్రతి నరాకారమును గురించి చెప్పుచున్నది. కేవలము కృష్ణావతారమును గురించే కాదు. ఏలననగా అధర్మము తల ఎత్తినపుడల్లా మనుష్య రూపములో నేను అవతరిస్తానని "తదాత్మానం సృజామ్యహమ్‌", "మానుషీం తను మాశ్రితమ్‌" అని తరువాత గీతా శ్లోకములు చెప్పుచున్నవి. నరులలో ఒక నరునిగా అవతరించి ఇతర నరుల వలె ప్రవర్తించుచున్న నరవేషి యగు నారాయణుడని గుర్తించుట చాలా కష్టము. ఇట్లు నరులలో అవతరించిన వానిని గుర్తించుట దేవతలకు కష్టమే అగుచున్నది. ఏలననగా దేవతల కన్న నరులు చాలా తక్కువవారు. కావున వారు నరులను చులకనగా చూతురు.

యాదవ వంశములో పుట్టి నరవేషి యగు నారాయణుని గుర్తించక ఇంద్రుడు ఏడు రోజులు వర్షమును కురిపించినాడు. ఋషులు సైతము భ్రమలో పడుదురు. ఉదంక మహర్షి కృష్ణుని శాపము పెట్టుటకు పూనుకొనినాడు. "అవ జానంతి మాంమూఢాః మానుషీమ్‌ తను మాశ్ర్తితమ్‌" "మమభూత మహేశ్వరమ్‌" అనగా నర వేషమున నున్న నారాయణుని గుర్తించుటలో దేవతలు ఋషులు సైతము మూఢులై ఆయనను అవమానించుటకు పూనుకొందురు అని అర్ధము. ఇప్పుడు చూచితిరా! బ్రహ్మవిద్య ఎంత కష్టమో అందుకే శ్రుతి "బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి" అనగా బ్రహ్మమును గురించిన గుర్తింపు బ్రహ్మమునకే ఉండును అని అర్ధము. అక్రూరుడు, విదురుడు, భీష్ముడు, పార్ధుడు, గోపికలు వంటి మహా భక్తులు కూడ ఒక్కొక్క క్షణములో జారిపోయినారు. ఒక్క క్షణము కూడా జారి పోకుండా నిలబడినది రాధ మాత్రమే. అందుకే ఒకానొక జీవుడు మాత్రమే "కశ్చిన్‌ మాం వేత్తి తత్త్వతః" అని స్వామి గీతలో చెప్పియున్నాడు. ఆమె తన్ను తానే మరచిపోయినది. అనగా "నేను" సాత్విక అహంకారము కూడ లయమైనది. అహంకారము మూడు విధములుగా యుండును. "నేను" అని జ్ఞానము మాత్రమే స్వరూపముగా చైతన్యాత్మకమయమైన భావమే సాత్వికాహంకారము. ఇందులో "నేను" అను శబ్ధమునకు ఆత్మ అని అర్ధమే మిగిలి యుండును. ఈ చైతన్యాత్మ యగు జీవుడు శరీరమును వదలిపోయినను, తనను తాను నేను నేను అనుకొనుచుండును. కావున మరణించిననూ పోనిదే ఈ సాత్వికాహంకారము. ఇంక ఈ శరీరమును నేను అనుకొనుట రాజసాహంకారము. నేను ఎర్రగా ఉన్నాను అనుచున్నాడు. ఎర్రగా ఉన్నది శరీరము. ఈ శరీరముతో నేను ఏకీభవించుటయే రజోగుణము. ఈ శరీరము అగ్నిలో దగ్ధమగుననియు, అప్పుడు దగ్ధము కాకుండా బయిటకు వచ్చు ఆత్మయే "నేను" అను శబ్ధమునకు అర్ధము అని తెలియదు. కావున రజో గుణము అజ్ఞానమే. సాత్విక గుణము జ్ఞానము. ఏలననగా నశించిన చైతన్యాత్మ "నేను" అనుకొనుట జ్ఞానమే కదా! అది సత్యమే గదా! ఇక తనకు తోడుగా ఉన్న ధనము బంధువులు మొదలగు వానిని "నేను" అనుకొనుట తమో గుణము. సాత్వికాహంకారములో "నేను" అనునది నిలచినంత వరకు చైతన్యము పరిమితమై ఒక ఖండముగా ఉండును. ఎప్పుడు ఈ "నేను" అన్న సాత్వికాహంకారము కూడ నశించునో, అప్పుడు ఈ చైతన్య ఖండమైన ఆత్మ పరమాత్మ యొక్క చైతన్యము నందు లయించిపోవును. అప్పుడు "నేను" అను శబ్ధము కేవలము పరమాత్మ చైతన్యమునకు మాత్రమే మిగిలిపోవును. ఇదే శంకరాచార్యుల వారు తరువాత రమణ మహర్షి చేసిన నేను అను శబ్ధము యొక్క జిజ్ఞాస. ఈ విధముగా ఎవరు స్వామి సేవలో పాల్గొని తనను తాను మరచిపోవునో అప్పుడు ఆ జీవుడు పరమాత్మతో కైవల్యమును పొందును. కొందరు గంజాయి మొదలగు మత్తు పదార్ధములను వాడి ఈ "నేను" ను మరచిపోవుచున్నారు కాని ఇది కైవల్యము కాదు. గంజాయి మత్తు దిగగానే ఈ "నేను" మరల ఉద్భవించుచున్నది. గాఢనిద్రలో కూడ "నేను" లయించుచున్నది. కాన గాఢనిద్ర కైవల్యము కాదు. కావున కేవలము రాధ మాత్రమే నిజమైన కైవల్యము పొందినది. కావున నరాకారములో నిజమైన పరబ్రహ్మమును గుర్తించుటయే నిజమైన బ్రహ్మ విద్య. ఆ గుర్తింపుకే అనేక బాలారిష్టములున్నవి. ఆయన ఆశ్రయించిన నరశరీరము అన్ని నరశరీరముల వలే ప్రకృతి ధర్మములకు లోబడి యుండును. మనవలే ఆయనకు కూడ క్షుత్విపాసలు, దగ్గు, రొంప వచ్చుచుండును. ఈ బాహ్య లక్షణములను చూచి చాలా మంది మోసపోవుదురు. ఒకవేళ గుర్తించినను ధర్మమును తప్పిన నడకతో గోచరించుచుండును. ఆ దెబ్బతో గుర్తించిన వారు కూడ అరటి తొక్కపై కాలు పడినట్లు జారిపోవుచుందురు. ఆయనను గుర్తించు లక్షణములు కూడ ఎంతో తికమక ఉన్నది. సిద్ధులు గుర్తుగా పెట్టుకున్నచో రాక్షసులు, క్షుద్రమాంత్రికుల వలలో పడుదురు. జ్ఞానమును గుర్తుగా పెట్టుకున్నచో పండితుల వలలో చిక్కుకొందురు.

పండితులు చెప్పు జ్ఞానము బ్రహ్మానుభూతిని కలిగించలేదు. ఆయన యొక్క కల్యాణ గుణములలో కొన్ని కొన్ని గుణములు భక్తుల వద్ద కూడ కనిపించుచుండును. భగవంతుని నుండి భక్తులను వేరుచేయుట చాలా కష్టముగా యుండును. ఏలననగా సత్య భక్తులను భగవంతుడు ఆవేశించి యుండును. అయితే ఒక కార్యార్ధమై భగవంతుడు భక్తులను ఆవేశించును. ఆ కార్యము ముగియగనే, భగవంతుడు భక్తుల నుండు తొలగిపోవును. భక్తుడు, ముని కుమారుడైన పరశురాముని విష్ణుభగవానుడు ఆవేశించి సర్వ క్షత్రియ సంహారమును చేసెను. ఆ కార్యము ముగియగనే పరశురాముని నుండి తొలగిపోయెను. కావున ఇట్టి మహాభక్తులను నరావతారముల నుండి వేరుచేయుట కష్టము. ఒక్కొక్క సారి నరావతారుడగు స్వామి తన శక్తిని భక్తుని ద్వారా ప్రయోగించి వారి సాయమును తాను పొందుచు వారికి భగవంతునిగా కీర్తి నిచ్చి తాను భక్తుని స్ధానమున ఉండి నటించుచుండును. సంజీవి పర్వతమును హనుమంతుడు తెచ్చి లక్ష్మణుని బ్రతికించి, రాముని శోకమును పోగొట్టెను. రామశక్తి వలననే హనుమంతుడు సంజీవిని తెచ్చెను. చూచు వారికి హనుమంతుడే భగవంతుడు, రాముడే భక్తుడిగ తోచును. ఇట్టి మాయలను తప్పించుకొని ఆయనను గుర్తించుట చాలా కష్టము. గోటి చుట్టుపై రోకలి పోటు అన్నట్లు, వెన్నముద్దలు దొంగిలించుచూ, గోపికల వెంటబడుచు, అందరి విమర్శలకు గురియగుచు భక్తుల కండ్లకు మాయ పొరలను కప్పుచుండును. దీనికి తోడు సాక్షాత్తు నారాయణుని నుండి అసలు శంఖ, చక్రములనే సంపాదించిన ఈ నకిలీ నారాయణుల నుండి జారచోరత్వాది మాయలచే గప్పబడిన సత్యనారాయణుని గుర్తించుట చాలా కష్టము. సత్యనారాయణ వ్రతములో అంతరార్ధమిదే. సత్యనారయణ వ్రతములో గోవిందాది కృష్ణ నామములే ఉన్నవి. అనగా ఈ నరులలో సత్యమైన నారాయణుని గుర్తించి జారిపోకుండా గట్టిపట్టుతో దీక్షను పూనిన వాడే నిజముగా సత్యనారాయణ వ్రతము చేసినవాడు. ఈ విధముగా గొర్రెలలో కలసిపోయి గొర్రతోలు కప్పుకొని గొర్రె స్వరముతో అరచుచు గొర్రెలలో కలసిపోయిన పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. గొర్రెల కన్న వేరుగా నున్న పులిని గుర్తించుటలో కష్టమేమున్నది? కావున జీవుని కన్న భిన్నముగా వున్న భగవంతుని గుర్తించుటలో కష్టము లేదు. అన్ని గొర్రెలను పులియే అన్ననూ కష్టము లేదు. ప్రతి గొర్రెయును పులియే గదా. కావున సర్వజీవులను బ్రహమే అన్నప్పుడు కష్టములేదు. కావున ఇటువంటి అతితెలివి సిద్ధాంతముల భ్రమల నుండి బయిటపడి గొర్రె వేషముతో గొర్రెలలో కలిసిపోయి గొర్రెగా ఉన్న పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. కావున నరవేషముతో నురులతో కలసిపోయిన నారాయణుని గుర్తించుటయే మహా మహా కష్టము. కావున అనేక జన్మలు పట్టును. నరావతారమున ఉన్న రాముని గుర్తించి పూర్తిగా విశ్వసించిన హనుమంతుడును, అట్లే నరావతారమున ఉన్న కృష్ణుని గుర్తించి పరిపూర్ణ విశ్వసించిన రాధయును, వీరువురే బ్రహ్మవిద్యను పూర్తిగా తెలిసిన బ్రహ్మ జ్ఞానులు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad